Tuesday, May 18, 2010

మింగుడు పడలే...

మొన్నటి విజయం
నిన్నటి ఘోర తప్పిదంతో
మసకబారి
నీకు మొఖం చూపబుద్ధి కాలేదు..

ఏదో బాధ నరం గట్టిగా
మూలుగుతోంది..

ఖండితమైన భాగాల దృశ్యం
వెంటాడుతోంది...

నీకు గూడైన వారు,
బువ్వైన వారు,
రేపు నీతో నడిచేవారూ కావచ్చు...

గురి తప్పిన బాణం
మిత్రుని వెన్నులో దిగిన క్షణం
అది నీ గొంతులో దూరినట్లు లేదూ?

ఎందుకో
యిది మింగుడు పడలే...

(నిన్న దంతెవాడలో జరిగిన సామాన్యుల బలి దృశ్యాలు చూసి)

Wednesday, May 12, 2010

ఒంటరి పయనం..

ఖాళీ
గుండె గది మూలల్లో
మెదడు జ్ఞాపకాల పొరల్లో
అలా తెరలు తెరలుగా
తేలియాడుతూ వస్తున్నా గబా గబా
గాభరాగా ఎవరో తరుముతున్నట్లుగా
గాలి ఏదో తోసుకుపోతున్న మబ్బుల మల్లె
ఏదీ ఆగకు౦డా పయనమవుతూ
ఒంటరిగా ఈ గది మూలన నన్ను
వదిలి...

రాజుకుంటున్న జ్వాల పైకెగిరినట్లే
ఎగిరి మాయమవుతున్నది
తర౦గాలుగా లేస్తున్న ఆలోచనలు
ఒక్కమారు కుప్పకూలి
నన్నీ అగాధంలో తోసివేస్తూ...

మూతలు పడుతున్న రెప్పలు
ఎంతకీ తెగని సుదీర్ఘ అసంపూర్ణ
స్వప్నాన్ని తె౦చలేక
అలసిన దేహాన్ని ఇలా
ఈ గదిమూలలో ఒ౦టరిగా ...

Wednesday, May 5, 2010

నాన్న కళ్ళు మట్టిలో కలిసిపోయాయా?



అమ్మ పేగు తెంచుకుని పడ్డప్పటి నుంచి
నాన్న చేతులలోనే పెరిగిన వాణ్ణి
పాకేటప్పుడు ముడుకులు గీర్లు పడితేనే
కళ్ళ నీళ్ళు పెట్టుకున్న నాన్న
నిలబడేందుకు తన వేలి ఆసరా యిచ్చిన నాన్న
నడక నేర్పి, పరుగు నేర్పి
సైకిలు నేర్పి, ఆటలలో తానూ ఒకడై
తన కంటి పాప కన్నా నన్నే
ఎక్కువగా చూసిన నాన్న
పెన్సిలు చెక్కి బొమ్మ గీయడం నేర్పిన నాన్న
తన బొమ్మను నా పిచ్చి గీతలలో చూసి విరగబడి నవ్విన నాన్న
తర తరాలుగా తన రంగు పడ్డ వేదనను
బోధించి నా అక్షరం ద్వారా తన విశ్వాశ ప్రకటన
గావించిన నాన్న
జై భీం అంటూ ధమ్మ పథాన్ని మార్గంగా నడిచి
నడిపించిన నాన్న
నా కంట్లో నలుసు పడితేనే తన కళ్ళ సెలయేళ్ళు పొంగిన
నాన్న కళ్ళూ మట్టిలో కలిసిపోయాయా...

(కవి రాం మొన్న రాత్రి యిటీవల పరమపదించిన తన తండ్రె జ్ఞాపకాలతో యిలా అడిగి నన్ను ద్రవింపచేసినందుకు)

Friday, April 30, 2010

నూరేళ్ళ శ్రీశ్రీ కి నీరాజనాలు




తన జీవితకాలమంతా అభాగ్యుల వెతలను
కవితా తూటాలుగా పేల్చి
ఆచరణలో ఉద్యమాల వెంట నిలిచి
పతితులు, బాధాసర్పద్రష్టులకు
నేనున్నానని,
రేపు మనదేనని
కష్టజీవికి యిరువైపులా నిలబడ్డవాడే కవి అని
తెలుగు బావుటా రెపరెపలను
దశదిశలా వ్యాపింపచేయ
శరపరంపరగా అక్షరయాగం చేసిన
మహాకవికి అరుణారుణ వందనాలు..
నూరేళ్ళ శ్రీశ్రీ కి నీరాజనాలు..


http://www.mahakavisrisri.com/home/VideoClips.htm

Sunday, April 25, 2010

'పేగుకాలిన వాసన' జగన్నాధ శర్మగారి కథలపరిచయ సభ





పార్వతీపురంలో పుట్టిన ఋణాన్ని తీర్చుకునేందుకన్నట్లు ఎ.ఎన్.జగన్నాథ శర్మగారు తన కథల సంపుటి 'పేగుకాలిన వాసన' పరిచయ సభను ఈ సాయంత్రం యిక్కడ నిర్వహించారు. ఈ సభకు అధ్యక్షులుగా ప్రముఖ కవి కె.శివారెడ్డి నిర్వహణలో సభ ఆధ్యంతం ఆహ్లాదకరంగా జరిగింది. కథల సంపుటిని కథల మాస్టారు శ్రీ కాళీపట్నం రామారావు గారు ఆవిష్కరించారు. కథలను ఉత్తరాంధ్ర కథకులు అట్టాడ అప్పల్నాయుడు ముందుగా పరిచయం చేస్తూ కథలలో శర్మ గారు జీవన విషాదాన్ని ప్రముఖంగా రాసారంటూ అగ్రహారం బ్రాహ్మణుల జీవితాలలోని విధ్వంసాన్ని కూడా రాయాల్సిన అవసరముంది. ఈ కథలలో శర్మగారు చాలా వరకు తన నేపథ్య జీవితాన్ని ఆవిష్కరించారన్నారు. ఆ తరువాత సీమకథకులు ఆచార్య మధురాంతకం నరేంద్ర కథలను విపులంగా పరిచయం చేస్తూ యుద్ధం, విప్లవం, నినాదాలు లేకుండా విప్లవ కథలు చదవాలంటే శర్మ గారి కథలే చదవాలి. మార్క్సిస్టు దృక్పధంతో రాసినా కథలలో చదివినంతసేపూ విధ్వంసం చదువరికి బోధపడుతుంది గానీ అది విప్లవ కథగా వెంటనే స్ఫురించకుండానే ఆలోచనలను చైతన్యవంతం చేయడంలో ఈ కథలు తమ పాత్రను పోషిస్తాయని చెప్పారు. నినాదాలు లేకుండా గొప్ప మార్క్సిస్టు కథలు రాసిన వారు శర్మగారని కొనియాడారు. నాన్నంటే కథ గొప్ప విప్లవకథగా పరిచయం చేసారు. గొప్ప కళాకారుడిగా కీర్తించారు. రెండు రెళ్ళు గురించి చెప్పి చివరిగా నాలుగు రావడాన్ని గోప్యంగా వుంచి అది పాఠకుడికి విడిచిపెట్టడంలో శర్మ సఫలీకృతులయ్యారనన్నారు. గుడిపాటి తనకు శర్మ గారితో వున్న పరిచయాన్ని చెప్తూనే కథాసంకలనాలను కొని సాహిత్యాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యతను తెలియజేసారు. చివరిగా శర్మ గారు తనకు పార్వతీపురంతో వున్న పరిచయాన్ని చెప్తూనే తనకు కథా రచన తన అమ్మనుండే అబ్బిందని, స్క్రీన్ ప్లే ఎలా రాయాలో తాను తన తల్లి దగ్గరే నేర్చుకున్నానని చెప్పారు. చివరిగా తన బాల్య మిత్రులు, సహాధ్యాయులు శర్మగారిని సన్మానించారు.

Friday, April 9, 2010

కవి రాం తండ్రి అస్తమించారు



'కొయిటా అమ్మకు కన్నీటి ఉత్తరం' కవితా సంకలనం కవి సిహెచ్.రాం తండ్రి క్రిష్ణ్రారావు మాస్టారు గారు ఈ రోజు ఉ.11 గం.లకు యానాంలో అస్తమించారు. మాస్టారుకు కవి రాం అంటే చాలా ప్రేమ. కానీ చివరి క్షణాలలో రాం తన దరిలో లేకపోవడం విషాదం. తను మాకు దగ్గరలోని బొబ్బిలిలో నివాసముంటున్నాడు. తన సోదరుడు రవి తను కవలలు. ఇద్దరికీ సాహితీలోకంతో పరిచయం మెండు. ఏ కవితైనా చదివి యిట్టే గుర్తుపెట్టుకొని మరల సమయం వచ్చినప్పుడు దానిని మననం చేస్తూ వ్యాఖ్యానిస్తారు.

యిక్కడ రాం కవిత్వ పరిచయం సందర్బం కాకపోయినా తనతో పరిచయం లేనివారికి పరిచయం చేద్దామని...

కొయిటా అమ్మకు కన్నీటి ఉత్తరం కవితా సంకలనం కవి శివారెడ్డి, కవి డా.శిఖామణి, కవి సీతారాం గార్ల ముందుమాటలతో మంచి విశ్లేషణతో వుంటుంది. దళిత కంఠాన్ని కొత్త గొంతుకతో మూలాలను స్పృశిస్తూ సాగుతుంది రాం కవిత్వం. అలాగని తన వర్గం వెతలనే కాక సమకాలీన సమస్యలన్నింటినీ తన నిశిత దృష్టితో పరిశీలించి కవిత్వీకరించి మనముందుంచుతాడు. మనం రోజువారీ అతి సాధారణంగా చూస్తూ పోయే వాటిని తన కవితలలో అభివ్యక్తీకరించిన తీరు రాంకే సాధ్యమా అనిపిస్తాయి.

కిటికీ...

తెల్లారక తెల్లారక తెల్లారుతుంది
ఎల్లవేసిన గోడలో పాతుకుపోయిన కిటికీ
కొత్తగా కనిపిస్తుంది
కిటికీ బుజాలమీద చేతులేసి
రాత్రంతా జాగారం చేసిన
కళ్ళు ఎరుపెక్కాయి
గాలి వచ్చీ, వానా వచ్చీ
మంచూ పట్టీ, పొగా పట్టీ
రాత్రి గడిచాక
ఓ వెలుగుకిరణాన్ని
కిచ కిచల పిట్టను చేసి
నాపైకి పంపుతుంది కిటికీ.

'నా బంగారు తల్లి పిడికెడు ఆత్మ
పిచ్చుకై వాలింది కిటికీరెక్కపైనే'

రెప్పల మధ్య ఓ పురా జ్నాపకం
కన్నీటి బిందువై నిలిచినపుడు
నా ముఖచిత్రం చుట్టూ
నలుచదరపు చట్రమై
నన్ను పొదివి పట్టుకుంది కిటికీయే...


2. పాకీ పిల్ల..
చీకటిని ప్రేమించే చీకటి పిల్ల
మనసుని చంపుకుని
మానవ మలాన్ని గంపలకెత్తుకుని
సందు సందునా సంచరించే
చండాల బాలిక...
---
ఆమె బాల్యాన్ని పలకరిస్తే భగవంతుడే భయపడతాడు
అసలు బాల్యాన్ని భగవంతుడితో పోల్చిందెవడు
బాల్యమే భగవంతుడైతే
భగవంతుడు ఏనాడో పీతి కుప్పమీద కూర్చున్నాడు..
--
రాత్రంతా
పాకీ పేటపై సంచరించిన
పీతి రంగు చంద్రుడు
తెల్లారేసరికి
వేదాల రేవులో తేలియాడుతున్నాడు
పదా...
చీపుర్ని పులిమి
కొత్త జీవనం సాగిద్దాం...

3. కొత్త వసంతం..
మా ఏకాంత పూదోటలో
పై పెదవి నేనై
క్రింది పెదవి తానై
ఈ ఫలాన్ని కోరుకున్నాం
వీడేమిటి
వామనుడై నన్ను
నా బాల్యపు లోతుల్లోకి తొక్కేస్తున్నాడు
--
ప్రతీ సాయంత్రం
వెన్నెల వాకిలిలో గెంతులేస్తూ
చంద్రవంకను మా యింటి చూరుకు
లాంతరు దీపమై వేలాడదీసి
నా బాల్యపు జ్నాపకాల కిటికీని
మూసేసిన మా అమ్మను
మరల, మరల జ్నాపకం చేస్తున్నాడు...

యిలా వైవిధ్యంతో సాగుతుంది రాం కవిత్వం. రాం కవిగా ఎదగడానికి తన తండ్రి ప్రోత్సాహం చాలా వుంది. మాస్టారు గారు అంబేద్కరిస్టుగా, బుద్ధిజాన్ని ఫాలో అయ్యే వ్యక్తిగా యానాం ప్రజలందరికీ తలలో నాలుకలా వున్న మనిషి. రాంకు తన చిన్నతనంలోనే అమ్మను కోల్పోయినా లోటు తెలియనివ్వని తండ్రీ. ఆయన మరణం రాం, రవిలకు కుటుంబ సభ్య్లకే కాదు యానాం వాసులందరికీ విషాదాన్ని నింపింది.

Thursday, April 8, 2010

ఇట్లు మీ విధేయుడు-భరాగో సెలవు



ఇట్లు మీ విధేయుడు కథా సంకలనంతో అందరి హృదయాలలో శాశ్వత స్థానం ఏర్పరచుకొని తన 78 వ ఏట అందరి వద్ద సెలవు తీసుకొని వెళ్ళిన భరాగో లేరన్న వార్త తెలుగు సాహితీ లోకాన్ని శోక సంద్రంలో ముంచింది. తన సునిసిత హాస్య రచనలతో తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన భరాగో (భమిడిపాటి రామగోపాలం) గారికి నా హృదయపూర్వక నమస్సుమాంజలులు.

ఆయన వందకు పైగా కథలు, వంటొచ్చిన మగాడు, వెన్నెల నీడ నవలలు రాసారు. ఇట్లు మీ విధీయుడు కథా సంకలనంకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఇచ్చి తనను తాను సత్కరించుకుంది. ఉన్నత మానవీయ సంబంధాలతో సాహితీ లోకాన ఆయన చేసిన కృషి మరువరానిది.

ఇక్కడ ఇట్లు మీ విధేయుడు చదవొచ్చుః
bhamidipati ramagopalam_Part1

Thursday, March 25, 2010

అరచేతులలో నేను



నిన్ను చూస్తుంటె మా అమ్మ చేతిలో
నేనాడిన మధుర క్షణాలు గుర్తుకొస్తున్నాయి కన్నా

నవమాసాలు మోసి నీవు పేగు తెంచుకొని
బయటపడ్డప్పటి బాధ
నీ నవ్వుతో మటుమాయమయ్యిందిరా..

యింక నీ ఎదిగే ప్రతిక్షణమూ
తప్ప నాదంటు ఏమీ లేనిదానను..

(విజయవాడ సాహితీ మిత్రులు కవితా మార్చి 2010 సంచికలోని T.Srinivasa Reddy గారి ఫోటో చూసి)

Monday, March 22, 2010

మరో మారు సిద్దార్థుడి హత్య

తాను రాజభవనం వీడి రాలేదు..
దుఃఖం ఎరుగక ఇల్లు వదలలేదు
అన్నార్తులు, అభాగ్యులు, విధివంచితులు,
పీడితులు, తాడితులు,
తనకు సుపరిచితులే..

తన చుట్టూ వున్న వాతావరణం
నిలబడనీయక,
కాలికింద మట్టి పెల్లగింపబట్టి
తన పయనాన్ని వేగవంతం చేయగా
జనం తలలో నాలుకలా
పొద్దుగుంకని, బడలికలేని తనంతో
నలుదిక్కులా సాగిందీ సూరీడి పయనం..

సామాజిక రుగ్మతల కార్యకారణ సంబంధాల
నిజరూపాన్ని అనేక బోధి వృక్షాల కింద
అధ్యయనం చేసి ఔపోసన పట్టి
నయా బుద్ధుడయ్యాడు!

నాటి సిద్దార్థుడు కత్తిని విడిచి
శిరోముండనం చేసుకొని విరాగికాగా
నేటి సిద్దార్థుడు చేత మరతుపాకీ పట్టి
పచ్చని చొక్కాలో పంటచేలమధ్య కలుపును
పెరికే పనిలో పడ్డాడు!

దుఃఖానికి మూలం కోరికలే కాదు
అపరిమిత స్వార్థంకూడా తోడయిన నాడు
ప్రవచనాల వల్లింపుతో ఏదీ సాధ్యపడదన్న
జ్ఞానోదయమై శత్రువు పక్కలో బల్లెమైనాడు

కుళ్ళి కృశించి నశించే కంటే
ఉల్కలా మారి బూడిదకావాలని ఆశించిన వాడు
నేలతల్లి విముక్తి పోరులో
మరోమారు సిద్ధార్థుడు హత్యకావింపబడ్డాడు..

(సురాజ్యాంగం ఉన్నా సుజనుల హత్యలు అన్న కన్నాభిరాన్ వ్యాసం (తే.21.3.10దీ ఆంధ్రజ్యోతి)చదివి..)

Saturday, March 20, 2010

పిట్టలేని ఆకాశం



సంకురాతిరికి ముందుగానే
చూరుకు వేలాడే వరికంకుల పై
వాలి పలకరించిన పిచ్చుక గుంపులు
నేడు మచ్చుకైనా కానరాక
కోల్పోయినదాని విలువ ఏమిటో
నేడు గుర్తుకొచ్చి ఒక దీర్ఘ నిట్టూర్పుతో
సరిపిట్టుకోవడమేనా?

గుండెలో దిగులు గొంతులో పెగలక
కీచుమని అరుపు బయటకు రాలేకపోతోంది...
హరించుకుపోయిన పత్రహరితంతో
ఆకులు ఎండిన ముసలిదాని చర్మంలా
ముడుతలు పడి వొంకరలుపోయినాయి..

ఏరుకునేందుకు గింజలు జల్లిన పొలాలు కరువై
అసహజంగా పొడుచుకొచ్చిన కాంక్రీటు దిమ్మలతో
నగరం గోడపై వుమ్మివేయబడ్డ పాన్ మరకలా మారిన
నాగరికత అపహాస్యతతో కుళ్ళిన పేగువాసనలబారిన పడి
మాయమైన ఈ పిచ్చుకగుంపులోని
చివరి పిట్ట చేసిన ఆర్తనాదం
నీ చెవిన పడకుండా అడ్డుకున్న సెల్ మోత...

ఇది నీకు చివరి వీడ్కోలు కాకూడదు మిత్రమా..

(నేడు అంతర్జాతీయ పిచ్చుకల సంరక్షణ దినం సందర్భంగా)

Sunday, March 14, 2010

ముఖం ఏదైనా..



అవును ముఖం ఏదైనా
ముసుగు తొలగించి చూస్తే
దాని వికృత కర్కశ కోరలు
బయటపడుతూనే ఉన్నాయి

దాని శ్వాసలోనే దాగివుంది
కుళ్ళిన విషపు వాయువు
ప్రకృతిలో నడయాడే చిరుగాలిని
హరించే రసాయనాల సమ్మేళనం..

స్వేచ్చ ఓ కలగా మిగిలిన నాడు
దానికోసం ఈ ఉత్త చేతులతో పోరాడే
రూపాలకు దాని కోరలమాటున
చిక్కే ప్రమాదం పొ౦చివు౦టూనే వుంటూంది..

జరుగుతున్న యుద్ధంలో అభిమన్యులు
నేలకొరగడం సాధారణమౌతున్న కాలం
శ్వాశ నిశ్వాశలనే బంధించ జూస్తున్న
రాకాసి మూకలు..

చీమలు తమ శక్తిని గ్రహించనంతవరకే
ఈ పాముల బుసబుసలు..

(పచ్చదనంపై వేట కొనసాగింపునకు వ్యతిరేకంగా)

Sunday, March 7, 2010

కొంగూ నడుముకు చుట్టవే చెల్లెమ్మా



కొంగూ నడుముకు చుట్టవే చెల్లెమ్మా
కొడవళ్ళు చేపట్టవే చెల్లెమ్మా
ఈ పాట యిప్పటికీ నిజాయితీగా మారుమోగుతోంది

ఈ లిప్ స్టిక్ భామల, ఎత్తుమడమల
హైటెక్కు నిక్కులకు మోసపోవద్దు

ఆకాశంలో సగంను అడ్డంగా కత్తిరించి
ఓట్ల డబ్బాలో వేయజూసే వీరి మోసాలను
ఎండగట్ట గంగ దాటిరావాలని పిలుపునిస్తున్నా

నేతిబీరకాయ ప్రజాస్వామ్యంలో
ఎన్నటికీ రాని వాటా కోసం
పోరాటమొక్కటే అమరులకిచ్చే నివాళి

అర్థరాత్రి నడిచే స్వాతంత్ర్యం పబ్ లనుంచి
కాదు
పగలయినా పగలబడినవ్వే
స్వేచ్చ కోసం..

Sunday, February 28, 2010

ఒలి ఒలొలె రంగె ఓలి..




ఒలి ఒలొలి రంగె ఓలీ
సమ కేలిల ఓలి...
అందరం కాసేపైనా రంగులనద్దుకొని
మన అసలు రంగులను దాచేద్దాం..
వాన వెలిసినాక అదెలాగు బయటపడక మానదు

తీసుకో పిడికెడు రంగు
ఒత్తుకో నీ ముఖానికింతా
నా ముఖానికింతా..

ఒలీ ఒలోలి రంగె ఓలీ
సమకేలిల ఓలి..

Friday, February 12, 2010

డైరీ




జ్ఞాపకాలను రేపటికోసం దాచే గుండె గది

పొరల మధ్య కన్నీళ్లు వుంటాయి

రక్తపు చారికలు వుంటాయి

కేరింతలు వుంటాయి

కానీ ఖాళీలుగా మిగిలిన పొరల మధ్య

అంతరాన్ని పూరించడానికి

.......

Monday, February 8, 2010

జీవితమే యుద్ధమైనప్పుడు..

peace2

 

మేమున్నది యుద్ధరంగంలోనే

జరిగేది, జరగబోయేది యుద్ధమేనని తెలుసు

కొత్తగా మీ ఘీంకారాలకు వెరచి వెన్ను చూపేది లేదు

 

ఆయుధం మీకు జీతాన్నిస్తుంది..

ఆయుధం మా శరీరాంతర్భాగమయ్యింది

ఇది స్పార్టకస్ తో మొదలై  కొనసాగుతూన్న కలల పోరాటం..

 

సత్యం కోసం జరిగే అలుపెరుగని ఆరాటమిది

కోట్లాది ఆక్రందనల, అవేదనల, ఆర్తనాదాలకు ముగింపు కొరకు

నేలతల్లి విముక్తికొరకు సాగుతున్న సాయుధ కవాతు యిది

 

ఓటమి నెదుర్కొనడం మాకు కొత్త కాదు

శతాబ్ధాల మహాప్రస్థానమిది

జీవితమే యుద్ధమైనపుడు

యుద్ధాన్ని ఓడించడానికే యుద్ధం చేస్తున్న వాళ్ళం…

Saturday, January 16, 2010

కాళ్ళ కింద భూమే మింగేస్తే..


అంతవరకు తనను ఒడిలో లాలించిన
తల్లి ఒక్కసారిగా విదిలించి మోదినట్లు
నేలతల్లి నిట్ట నిలువుగా చీలిపోయి
పాము తన పిల్లలను తానే
మింగినట్లు తమనంతా
తన కడుపు చీల్చి
పాతిపెట్టితే

కప్పై తమను కాపాడుతుందనుకున్న
ఇల్లే తమకు సమాధి అవుతుందని
కలలో కూడా వూహించక గుండె మీద
చేయేసుకు నిదురపోతున్న హైతీ

నేడు నిస్సహాయంగా దీనంగా
అనాథ అయినది

Monday, January 11, 2010

మరణం నా చివరి చరణం కాదు - అలిశెట్టి ప్రభాకర్




'అలిశెట్టి ప్రభాకర్' ఈ పేరు నిజాయితీగా తన జీవితాన్ని పోరాడే ప్రజల పక్షాన నిలిపిన ఓ కవి, ఫోటో చిత్రకారుడు, కవితా చిత్రశిల్పి అయిన ఒక మరపురాని వ్యక్తికీ సంబంధించిన సజీవ జ్ఞాపకాల తడి. ఆయన జననం 12-01-1954 అమరత్వం 12-01-1993. జన్మించిన తేదీనాడే ప్రభాకర్ మరణం జరగడం యాధృచ్చికమైనా మనల్ని ఒక రకమైన ఉద్వేగానికి గురిచేస్తుంది.

ఆయన గురించి విప్లవకవి వరవరరావుగారి కవితా నివాళిలో

మృత్యువు దాడిచేసిన రాత్రి అతడు
అక్షరాలకు జీవం పోస్తున్నాడు

రాత్రి గడియారంలో కాలం నిలిచిపోయింది
రక్తం కక్కుకుని ప్రభాకర్ కన్నుమూసాడని
గాలిలో సగం తెగిన నరాల తరంగాల స్వరాలు

....

చాలామంది ఆరోగ్యవంతులకు
మనిషన్నాక చావు చెప్పకుండానైనా ఒకనాడు వస్తుందని
స్పృహ వుండదు
జూలియస్ ఫ్యూజిక్కు చెరబండరాజుకూ నీకు
నాజీ వ్యవస్థ అయితేనేమి
క్యాన్సర్ వ్యవస్థ అయితేనేమి
క్షయగ్రస్త వ్యవస్థ అయితేనేమి
అది మరణ శాసనం రాసిన మరుక్షణం నుంచీ
మీరు ఒక్క స్వప్నాన్ని నిదురపోనివ్వలేదు
ఒక్క క్షణాన్నీ వృథా కానివ్వలేదు
..

ఈ కవితలో ఆయన జీవితాన్ని వివి ఆవిష్కరించారు. సమాజంలోని రుగ్మతలను రూపుమాపేందుకు తన కలంతో, లెన్స్ తో పోరాడిన ప్రభాకర్ క్షయ వ్యాధితో పోరాటంలో ఓడిపోయి మనకు దూరమయ్యాడు.

ఆయన రాసిన కవితా పాదాలు కొన్ని..

మరణం నా చివరి చరణం కాదు
మౌనం నా చితాభస్మం కాదు
మనోహరాకాశంలో విలపించే చంద్రబింబం
నా అశ్రుకణం కాదు

నిర్విరామంగా నిత్యనూతనంగా
కాలం అంచున చిగురించే నెత్తుటి ఊహను నేను
కలల ఉపరితలమ్మీద కదలాడే కాంతి పుంజం నేను
కన్నీళ్ళకి కర్తవ్యాన్ని నిర్దేశించే దిక్సూచిని నేను

అగ్ని పద్యం నేను, దగ్ధగీతం నేను అక్షర క్షిపణి నేను
ఆయుధాలుగా రూపాంతరం చెందే ఆకలి నేపథ్యం నేను
అడవి నేను - కడలి నేను
ఉప్పొంగే మానవ సమూహాల సంఘర్షణ నేను
అజ్ఞాత౦గా అంతర్లీనంగా
మట్టి పొరల్లోంచి పరీవ్యాప్తమవుతున్న పోరాట పరిమళం నేను...

2. సూర్యుడే నా ముఖ చిత్రం

ఎన్నెన్ని
గాయపడిన ఉదయాల్ని
సంకలనంగా కూర్చినా

ఎవరెవరి
బాధామయ గాధల్ని
ఈ కలంతో జాలువార్చినా

మిత్రుడా
నిరంతరం
సూర్యుడే నా ముఖ చిత్రం

3. విషాద సాక్షాత్కారం

కన్నీళ్ళని ఏ భాషలోకి అనువదించినా
విషాదం మూర్తీభవించిన స్త్రీయే
సాక్షాత్కరిస్తుంది

ఎక్కడ కన్నీటి తరంగాలుప్పొంగినా
అచేతనంగా
అలల చేతుల మీంచి రాలిపడిన
అభాగినే దర్శనమిస్తుంది

తన కవితలలో ఎక్కువగా రాజకీయ దళారీల గురించి, స్త్రీల బాధల గురించే రాస్తాడు ప్రభాకర్.

ఆయన ప్రతి అంశాన్ని ఉద్యమ స్ఫూర్తితో కలగలిపి నెత్తురు మండే అక్షరాలను సృజించినవాడు. తాను గీసిన బొమ్మలకు రాసిన కేప్షన్స్ చాలా భావ స్ఫోరకంగా ఆలోచనలను రగిలించేవిగా ఉండేవి.

ఆయన ఒక దశాబ్ధం పాటు విరసం సభ్యుడు. అంతకన్నా అంతిమ శ్వాస దాకా విప్లవోద్యమ అభిమాని, కవి, చిత్రకారుడూ. ఫోటోగ్రఫీ వృత్తిగా జీవించినా అది జీవిక చేసుకోలేకపోయిన వాడు. విప్లవోద్యమం ప్రతిమలుపులో తనపై ఎంత నిర్భంధమమలయినా ఉద్యమ పక్షపాతిగానే చివరంటా జీవించి తన కలాన్ని మరింత పదునెక్కించిన సాంస్కృతిక సైనికుడు.

చివరిగా కవి ఆశారాజు తన కవితలో...

అంతమంది చేరిన గుంపులో
ఎవ్వరూ మాట్లాడ్డంలేదు
అంతటి గంభీర నిశ్శబ్ధంలో
అందరితో శవమొక్కటే బతుకుని గురించి మాట్లాడుతుంది
తలదగ్గ వెలుగుతున్న దీపమొక్కటే మాట్లాడుతుంది
బహుశా మరణించిన తర్వాతే
కవి బతకడం మొదలు పెడతాడనుకుంటాను...
-o0o-

జోహార్ అలిశెట్టి ప్రభాకర్...

Friday, January 8, 2010

'మీకు దగ్గరలోనే' కవితా స౦పుటికి అభ్యుదయ బహుమతి

కవి మిత్రుడు కె.ఆంజనేయకుమార్ కవితా సంపుటి 'మీకు దగ్గర్లోనే' కు కాకినాడ అభ్యుదయ ఫౌండేషన్ వారి ప్రథమ బహుమతి వచ్చింది. ఈ బహుమతి ప్రథానోత్సవం కాకినాడలోని సూర్య కళామందిర్ లో ఈ ఆదివారం (10-1-2010) కలదు. అదేరోజు ఉదయం 9 గం.లకు శ్రీశ్రీ శత జయంతి సభతో కార్యక్రమాలు మొదలవుతాయి. కవిసమ్మేళనం అనంతరం కవితా సంపుటి, కథా సంపుటాలకు బహుమతి ప్రథానాలు జరుగుతాయి. ఈ సాహితీ విందుకు ప్రముఖ కవి, సాహితీ విమర్శకులు అద్దేపల్లి రామ్మోహనరావు, కవి భగ్వాన్, మేడపల్లి రవికుమార్ తదితర ప్రముఖులు హాజరవుతున్నారు. సాహిత్యాభిమానులు హాజరయి విజయవంతం చేయాలని కోరుతు..

Wednesday, January 6, 2010

జనవరి ప్రాణహిత లో నా కవిత





జనవరి 2010 ప్రాణహిత నెట్ మేగజైన్ లో నా 'కరిగిన స్వప్నం' కవిత వుంది. ఇదేమంత గొప్ప విషయం కాకపోయినా నాకు ద్రోణాచార్య వంటి శివారెడ్డిగారి 'సుదర్శనుడి కళ్ళు' కవిత చదవండి. ఇటీవలి కాలంలో నేను ఇంతకంటే మంచి కవితను చదవలేదు. మీరూ చదివి ఆనందిస్తారని.http://www.pranahita.org/

Wednesday, December 30, 2009

అంత:సాగరం




ఎందుకో చెప్పలేను..

సముద్రానికెదురుగా వుంటే
తనలోకి అలా నడిచి వెళ్ళి
అంతర్థానమవ్వాలని ఒకటే ఆతృత!

ఏదో నా స్వంత ఆత్మలోకి
ప్రవేశిస్తున్న భావన వెంటాడుతుంది
నన్నెవరో తనలోకి లోలోకి ఆహ్వానిస్తున్న అంతఃప్రేరణ!

నా ఆదిమమూలాలను తట్టిలేపే అవిరామ ఘోష
గుండె గదిమూలలలో..

నా కాళ్ళు అలా అలా తనలోకి లోలోకి...
మరింత దగ్గరితనం!!

నా కనుల ముందు మరే దృశ్యానికి చోటులేనితనం!

నా సంఘర్షణలకు ఒక స్వాంతననిచ్చే ఒక
మహా విశ్వరూపం సముద్రం

తల్లో తండ్రో లేక ఓ విశాల బాహువుల స్నేహితుడో
నన్ను మనసారా ఆలింగనం చేసుకుంటున్న అనుభూతి
వెనక్కిరానివ్వని ప్రియురాలి బిగి కౌగిలా?

నా చివరి ఊపిరి తనలో కలవాలని
ఒకటే తృష్ణ
..........
Related Posts Plugin for WordPress, Blogger...