Tuesday, August 24, 2010

పాప జ్ఞాపకాలలో



నీ జ్ఞాపకం నన్ను
నిరంతరం వెన్నాడుతూనే వుంది
నీ కేరింతలతో ఇల్లంతా
పున్నమి వెలుగులు నింపిన
నీ బోసి నవ్వును
మరువలేకున్నా..

నీ అర్థనిమీలిత నేత్రాలతో
సుషుప్తావస్తలో వున్న
నిన్ను చూసి ఎంతలా
మురిసిపోయామో కదా!

నీ లేలేత దేహ కాంతి పుంజం
తాకి నా వొడలంతా పులకరించిన
క్షణాన్ని ఎలా మరిచిపోగలను..

కానీ..
ఆకశాన మెరిసిన విద్యుల్లతలా
భువిని తాకిన నీ పాదాలు
వెన్వెంటనే మాయమయ్యాయన్న
నిజం నేటికీ మింగుడుపడలేదీ
గుండెకి..

నింగిని మెరిసిన మెరుపును
చూసినప్పుడంతా నువ్వు మరలా
నాన్నా అంటూ గుండెలపై
వాలతావని ఆశగా..
ఆర్తిగా..

(ఈ రోజు మా మొదటి ప్రేమఫలం 'పాప' పుట్టిన రోజు. తను పుట్టినప్పుడు ఆరోగ్యంగా కనిపించి ఆ తరువాత blueish గా మారి ఎనిమిదో రోజున మమ్మల్ని విడిచిపోయింది. నిరుద్యోగం, ప్రేమ పెళ్ళి ఇబ్బందులతో తనను కాపాడుకోలేకపోయనన్న guiltiness ఇప్పటికీ వెంటాడుతూ వుంది..)

Friday, August 20, 2010

అమ్మ ఒడిలో..



అమ్మ ఒడిలో
తల వాల్చితే
కళ్ళనుండి ధారాపాతంగా
కారిన కన్నీటితో
సేద దీరిన మనసుతో
ఒక్కసారిగా ఏదో విద్యుత్ప్రవాహ తాకిడితో
మళ్ళీ ఉమ్మనీరులో ఈదినట్లుగా
మరో జన్మెత్తినట్లుగా
శిశువువలె
కేరింతలాడుతూన్నట్లు
అనుభూతి కలిగిన క్షణం
ఓ మహా యుద్ధ విజయానంతరం
వీరుని పెదవిపై ధరహాస చంద్రిక మెరిసిన క్షణం
కోల్పోయినదేదో గురుతెరిగిన మరుక్షణం
అమ్మ పాదాల చెంత
నా శిరశాభివందనం..

Friday, August 13, 2010

అరుణతార ఏప్రిల్ - జూన్ సంచిక



విరసం అధికార పత్రిక అరుణతార ఏప్రిల్-జూన్ సంచిక నలభైఏళ్ళ విరసం, నూరేళ్ళ శ్రీశ్రీ ప్రత్యేక సంచికగా వెలువరించారు. విరసం సభలలో ప్రసంగించిన హరగోపాల్, కె.శివారెడ్డి, వరవరరావు, కళ్యాణరావుల ప్రసంగపాఠాలు, విరసం తీర్మాణాలు, వ్యాసాలు, కథలు, కవితలు, సభల ఫోటోలు ఇందులో వున్నాయి. ఈ సంచిక నుండి వర్కింగ్ ఎడిటర్ గా బాధ్యతలు చేపట్టిన మా రాంకీ దీనిని pdf format లో అందించగా ఇలా online లో పెడుతున్నా. ఇందులో అరుణతారకు చందాలు, విరాళాలు పంపించే చిరునామా వుంది. దయచేసి సాహితీ మిత్రులు అరుణతార ఆర్థికంగా కోలుకునేందుకు సహకరిస్తారని ఆశిస్తూ ఈ రూపంలో మీముందుంచుతున్నా..

apr_jun 2010

Friday, August 6, 2010

మట్టి వేదం..



ఇప్పుడంతా కుబేరుల కాలం
అమ్మతనాన్ని కూడా సరుకునుజేసే మాయాజాలం
రంగుల పూతతో అమ్మజూపే టెక్నిక్ తప్ప
చనుబాల తీపినెరుగని వారి ఇంద్రజాలం..

ఈ మట్టి పూల పరిమళాన్ని
ఈ మట్టి సారవంతాన్ని
ఈ మట్టి తేజాన్ని
ఈ మట్టి జీవత్వాన్ని
ఈ మట్టి నాగరికతను
మండించి బూడిద చేసే కుట్ర

ఎవరి ఇంట కాంతుల కోసం
మా ఇంటి దీపాన్ని కొండెక్కిస్తావు?

తీరమంతా పరచుకున్న జీవజాలాన్ని
జీవజలాన్ని నీ విషపు
మలంతో నింపి
భవిష్యత్ తరానికి అవిటితనాన్ని
వారసత్వంగా ఇవ్వజూపే కుళ్ళుతనం కాదా?

ఈ మట్టి వేదం
అమ్మతనం..

ఈ మట్టి వేదం
మడమతిప్పని
గున్నమ్మ వారసత్వం..

ఈ మట్టి వేదం
పంచాది నిర్మల పోరాట వారసత్వం..

ఈ మట్టి వేదం
శ్రీకాకుళ రక్తతర్పణం..

ఈ మట్టి వేదం
కుట్రలకెదురొడ్డి జబ్బచరచడం...

Sunday, July 4, 2010

విరసం ఝెండా ఎగురుతున్నది..



గత నలబై ఏళ్ళుగా తను రచించుకున్న ప్రణాళికకు నిబద్ధతతో కూడిన ఆచరణ ద్వారా, ప్రజలకు ప్రత్యామ్నాయ రాజకీయ పోరాట బావుటానందించేందుకు తన సాంస్కృతిక, సాహిత్య రంగం ద్వారా అవిరామ కృషి చేస్తున్న ఆంధ్ర ప్రదేశ్ విప్లవ రచయితల సంఘం ఝెండా తెలుగు నేలపై అదే స్ఫూర్తితో ఎగురుతున్నది. ఆది నుండి తనపై అమలు జరుగుతున్న తీవ్ర నిర్బంధాన్ని, నిషేధాన్ని తట్టుకొని ఉద్యమానికి బాసటగా ప్రజా సంఘంగా తనదైన కర్తవ్యాన్ని ముందు వరసలో ఆచరిస్తూ ప్రజల అభిమానాన్ని చూరగొంటూ, ప్రజలకు బాధ్యత వహిస్తూ నిలబడింది. భారత దేశ సామాజిక ఆర్థిక పరిస్థితులను అధ్యయనం చేస్తూ తన రచనల ద్వారా వాటిని మార్క్శిజం లెనినిజం మావో ఆలోచనా విధానం ద్వారా పరిష్కరించుకునే నేపథ్యంలో స్థానిక అస్థిత్వ పోరాటాలకు అండగా నిలుస్తూ పాలక వర్గాల దమన నీతిని ఎదుర్కొంటున్నది. తనపై విధించిన నిషేధాన్ని నిర్ద్వందంగా ఎదుర్కొంటూ ప్రజాస్వామిక మేధావుల ప్రజల అండదండలతో ప్రభుత్వాల నియంతృత్వ పోకడలను ఎండగట్టింది. అమరులైన చెరబండరాజు, సుబ్బారావు పాణిగ్రాహి, జ్నానేశ్వర్, కొ.కు., ఎన్నెస్ ప్రకాశరావు, శ్రీశ్రీ, తిరుపాల్, అబ్రహాం, ఈశ్వరి, సముద్రుడు, నూతన్, సహదేవరెడ్డి, ఎమ్మెస్సార్, కె.వి.ఆర్,ఐ.వి, పల్లెర్ల స్వామి, జనార్థన్, కౌముది లందించిన విప్లవ స్ఫూర్తిని నిత్యం రగిలిస్తూ భారతదేశ విముక్తి పోరాటాలకు అండగా నిలిచిన సంస్థకు ఆవిర్భావ దిన విప్లవ జేజేలు..

Thursday, July 1, 2010

మహాకవి శ్రీశ్రీ గారి అరుదైన వీడియో..

TV9 వారు ప్రసారం చేసిన ఈ వీడియోలో మహాకవి అరుదైన పలుకులు, హాస్య చలోక్తులు చూడొచ్చు..


(ఇది ఫేస్ బుక్ లో కవి అఫ్సర్ గారిచ్చిన లింక్ చూసి ఆనందించి మరల ఇక్కడ ఇస్తున్నా.. తప్పయితే క్షమించండి)

Tuesday, June 29, 2010

ఖాళీ ఆవరణ



ఇప్పుడిక్కడంతా ఆవరించుకుంటున్న
ఖాళీ గురించే ఆలోచన..
గుండె గదినుండి అంతా పోగొట్టుకున్నట్టు
చివరాఖరి బొట్టు వరకు పీల్చి వేయబడ్డట్టు
ఏదో మాయో మత్తో కమ్ముకున్నట్లుగా
అంతా ఖాళీ అయిన ఆవరణ..

దేనిచేత పూరింపబడని ఒక లెక్క తప్పిదమా?
కాదేమో!
ఎందుకో అంతా జబ్బపట్టి లాక్కుపోతున్నట్టు...
నాకున్న ఈ రెండుపాదాల కింది నేల
వ్రయ్యలయినట్టు!

ఓ గబ్బిలం నా కనులముందు తన
రెక్కలతో విసురుతున్నట్టు!

కోల్పోయిన సందడి ఎవరిస్తారు మిత్రమా?
అడిగే హక్కు నాకున్నా
మొఖం చాటేసి పోతున్న నీ వెంబడి
ఈ నాలుక్కాళ్ళ పరుగులో నిన్ను
చేరలేనితనం...

దహించివేస్తున్న అగ్నకీలల బారినుండి
ఏ ఫైరింజన్ కాపాడగలదు?

పోనీ పోనీ అంటూ నిస్సహాయ
రాగాలాపన చేయలేని మొండితనం
ఎన్నాళ్ళు నిలబెట్టగలదు...

(అసంపూర్ణం)..

Monday, June 28, 2010

పొద్దులో నా కవితవచ్చిందోచ్..

చాన్నాళ్ళుగా పొద్దులో నా కవితను చూడాలని అనుకునేవాడిని. అందులో రాస్తున్న వారంతా సీనియర్స్ మరియు కవితల standard కూడా బాగుంటోంది. మన కవిత అందులో వస్తే బాగుణ్ణు అనుకునే వాడిని. ఇన్నాళ్ళకు అందులో చోటు దొరికింది. సాహితీ మిత్రులు స్పందించగలరు..

గాలి...http://poddu.net/?p=4823

Saturday, June 26, 2010

జ్ఞాపకంగా మిగులుతావనుకోలేదు...

మొన్నటి సభలనాడు అదే ఉత్సాహం
నీ గొంతులో అదే నినాదాల హోరు..

జనార్థనుని జ్నాపకాలను కలబోసుకొంటూ
విషాదాన్ని నీ కనురెప్పల మాటున దాచుకుంటూ
అందరితో చేయి కలిపి మనమంతా
కలిసి నిలబడాలనే అవసరాన్ని గుర్తుచేస్తూ
ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తానని
మాటిస్తూ కలుద్దాం మళ్ళీ మళ్ళీ అంటూ
వీడ్కోలు తీసుకున్న నీవే
ఓ జ్నాపకంగా మిగులుతావనుకోలేదు..

మొక్కవోని ఆత్మ స్థైర్యంతో నిర్బంధాన్ని
నిబ్బరంగా ఎదుర్కొన్న నీ జీవితం మా
కందరికీ ఆదర్శం...

(అమరుడు కా.జనార్థన్ సహచరి కా.తనూజ (వరంగల్) చెన్నైలో ఓ ఉన్మాది కౄర దాడిలో హత్యకు గురై మరణించిందన్న వార్త విని..)

Tuesday, June 22, 2010

చింతా 'దుక్కి' కవిత్వానికి ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డ్...




ఉత్తరాంధ్ర బతుకు దుఃఖాన్ని తన కవితా వస్తువుగా చేసుకొని తన మాతృ యాసలో కవిత్వాన్ని రాస్తున్న మా చింతా అప్పలనాయుడు మాస్టారుకు 2009 ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డ్ ప్రకటించారన్న వార్త చూసి మేమంతా గొప్పైపోయాము. తను కథలు, కవిత్వంతో ఈ ప్రాంత వాసుల జీవన వెతలను రికార్డు చేస్తున్న మాస్టారికి ఈ పురస్కారం రావడం ముదావహం. మా ప్రాంతానికి దక్కిన ప్రత్యేక గౌరవంగా భావిస్తూ ఫ్రంట్ కు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ సందర్బంగా వర్తమాన తెలుగు కవితా దీపస్తంభం కె.శివారెడ్డి గారు ఈ సంకలనానికి రాసిన ముందుమాటలోని వాక్యాలుః 'చింతా అప్పలనాయుడు మనముందు కూర్చొని శ్రీకాకుళం యాసలో కబుర్లు చెబుతున్నట్లు హాయిగా ఉంటుంది. చాలా సూటిగా, హాయిగా సాగిపోయే శైలి, పల్లెటూళ్ళ జీవనంలో అతలాకుతులమయిన పల్లెల జీవన దృశ్యాల్ని కతచెపుతున్నట్టు చెప్పుకుంటూ పోతున్నాడు, అతని కథా కథన పద్ధతి జానపదకథకుడు చెప్పే పధ్ధతి. అనుభవసారం గుండెనిండుగా వున్నవాడు, గొప్ప ఊహాశీలి, సంక్షోభాల్ని వర్ణించేటప్పుడు, కుతూహలం తగ్గకుండా, కన్నీళ్ళు తెప్పిస్తూ కథనడుపుతాడు. బహుశా అప్పల్నాయుడు శిల్పంకూడా యిదేనేమో' అన్నారు.

మాస్టారి కవితా పాదాలు కొన్నిః
'ఊరు ఊరంతటికీ..
ఉదయమే పొద్దు పొడుస్తుందిగానీ
నిజానికి మాలపేటలో
సాయంకాలమే సూర్యోదయమవుతుంది!
పొద్దు పోయి పోయి తిరిగొచ్చి
మాలపేట పొయ్యిల్లో దూరినట్టుంటుంది' (ఒక మాలపేట కొన్నిదృశ్యాలు)

అమెరికా వెళ్ళి పట్టించుకోని ఇంజినీరు కొడుకు గురించిః
'ఇంజీనీరువైతే..
గట్టిగూడు కట్టి నీడనిస్తావనుకున్నాను
డాలర్ పులి నోటికి దొరికి పోతావనుకుంటే
పుట్టినపుడే పుటికీసుందును!'

'నేల నా తల్లి
నాకు ఓర్పును ఒంటబట్టించింది నేలే..
ఏరు నా నేస్తం
కెరటాల్లో కొట్టుకు వచ్చే కట్టెను తెప్పజేసుకొని
ఈదులాడే విద్య నేర్పించింది ఏరే నాకు
ఏలినవారు మా దొడ్డ వారు
ఒక్క నదిని నాకు కాకుండాజేసి
రెండు నదుల్ని కానుకగా ఇచ్చారు
ఒక కంటికి కన్నీరు!
ఒక కంటికి నెత్తురు!'

'మాలోలు గుంటరా అని
మాటికీ నోళ్ళు పారేసుకుంటారు గానీ
నీలకుండతో నీలాటి రేవు చేరినప్పుడల్లా
ఆమె అందాన్ని చూసి నోళ్ళూరబెట్టుకున్నోలే!
అప్పడాల ముద్ద పేడించినట్లు
ఫెయిర్ అండ్ లౌలీ పుసుకున్నోళ్ళంతా
నాటుకోడిలా నిగనిగ మెరిసిపోయె
ఆమె ముందు ఫారం కోళ్ళే గదా?
శ్రమ జీవన సౌందర్య వేదిక మీద
ఆమె కదా విశ్వ సుందరి' (మా ఊరి మాలపిల్ల)

'మా ఊరికి నాగరికతను
మోసుకొచ్చిందని సంబరపడ్డామే గానీ
మా శ్రమ చమట చుక్కలై
ఈ రోడ్డుమీదుగానే ప్రవహించి
పట్నంలో ఇంకిపోతాయనే
ఎరుకలేని వాళ్ళం!'(కొండ)

'పెట్టుబడుల ప్రవాహమై
నా మట్టి పాదాలను చుట్టుముట్టి
ఊబిలోకి లాక్కుపోతుంటే
ఇనుప దున్నల స్వైర విహారంలో
ఇప్పుడు నేను విరిగిన నాగలిని..!'

ఇలా తన ప్రతి కవితలోను కరుణ రసాన్ని మేళవించి ఈ నేల ఆనుపానుల్ని ఎరిగిన ఈ తరం కవి చింతా అప్పల్నాయుడు మాస్టారు. ఆయనకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన కలం నుండి మరిన్ని కొత్త పదచిత్రాలను ఆశిస్తూ...

ఈ సంకలనాన్ని ప్రముఖ కథా రచయిత, కవి గంటేడ గౌరునాయుడు మాస్టారి నేతృత్వంలోని 'స్నేహకళా సాహితి, కురుపాం' వారు ప్రచురించారు. ప్రతులు విశాలాంధ్ర, ప్రజాశక్తి బ్రాంచీలలో లభ్యమవుతాయి.


Wednesday, June 16, 2010

అలసట...

పెడుతున్న పరుగునాపి
గుండెలనిండా ఒక్కమారు ఊపిరి తీసుకొని
గొంతులో కాసిన్ని నీళ్ళు పోసుకొని
అలసట తీరిన క్షణం
పొందిన ఆనందం వర్ణణాతీతం

కొత్త శక్తితో
మొదలైన ప్రయాణం
చెవిదాకా లాగివదిలిన బాణంలా
దూసుకుపోతుంది...

Tuesday, June 15, 2010

శ్రీశ్రీ...ఓ మహాస్వప్నం




శ్రీశ్రీ... ఓ పోరాట రూపం

శ్రీశ్రీ... ఓ సామాన్యుడి అంతరాత్మ

శ్రీశ్రీ... స్పార్టకస్ ఖడ్గం

శ్రీశ్రీ... వేల ప్రశ్నలకు జవాబు

శ్రీశ్రీ... జగన్నాద రథ సారథి

శ్రీశ్రీ... సమస్త వృత్తుల సహస్ర చిహ్నం

శ్రీశ్రీ... విశ్వమానవాళి కన్న మహా స్వప్నం

శ్రీశ్రీ... మరోప్రపంచపు ఎఱబావుటా నిగనిగ

శ్రీశ్రీ... అనంత విశ్వంపై ఎగిరిన తెల్లబావుటా ధగధగ


(శ్రీశ్రీ వర్థంతి సందర్భంగా)

Sunday, June 13, 2010

వెంటాడుతున్న ఆ కళ్ళు



ఆ మూసుకుపోని కనురెప్పల
ఆవల దాగిన విషాదం
ఇన్నినాళ్ళ తరువాత కూడా
వెంటాడుతూనే వుంది..

రాబందుల నోట చిక్కి విలవిలలాడిన
ఆ క్షణం,
ఊపిరి సలపలేని
గుండెలపై పడిన భారం
బిగబట్టి వదలలేని శ్వాస
చివరి నిట్టూర్పై కళ్ళలోంచి
నిష్క్రమించిన క్షణం..

ఆ కళ్ళు కొన్ని వేల
ప్రశ్నలకు గురుతుగా
సమాధి చేయబడ్డా
తిరిగి లేచిన
మోసెస్ వలే నిన్ను
వెంటాడుతూనే వుంటాయి..

తప్పించుకున్న హంతకులను
వేటాడుతూనే వుంటాయి..

Tuesday, May 18, 2010

మింగుడు పడలే...

మొన్నటి విజయం
నిన్నటి ఘోర తప్పిదంతో
మసకబారి
నీకు మొఖం చూపబుద్ధి కాలేదు..

ఏదో బాధ నరం గట్టిగా
మూలుగుతోంది..

ఖండితమైన భాగాల దృశ్యం
వెంటాడుతోంది...

నీకు గూడైన వారు,
బువ్వైన వారు,
రేపు నీతో నడిచేవారూ కావచ్చు...

గురి తప్పిన బాణం
మిత్రుని వెన్నులో దిగిన క్షణం
అది నీ గొంతులో దూరినట్లు లేదూ?

ఎందుకో
యిది మింగుడు పడలే...

(నిన్న దంతెవాడలో జరిగిన సామాన్యుల బలి దృశ్యాలు చూసి)

Wednesday, May 12, 2010

ఒంటరి పయనం..

ఖాళీ
గుండె గది మూలల్లో
మెదడు జ్ఞాపకాల పొరల్లో
అలా తెరలు తెరలుగా
తేలియాడుతూ వస్తున్నా గబా గబా
గాభరాగా ఎవరో తరుముతున్నట్లుగా
గాలి ఏదో తోసుకుపోతున్న మబ్బుల మల్లె
ఏదీ ఆగకు౦డా పయనమవుతూ
ఒంటరిగా ఈ గది మూలన నన్ను
వదిలి...

రాజుకుంటున్న జ్వాల పైకెగిరినట్లే
ఎగిరి మాయమవుతున్నది
తర౦గాలుగా లేస్తున్న ఆలోచనలు
ఒక్కమారు కుప్పకూలి
నన్నీ అగాధంలో తోసివేస్తూ...

మూతలు పడుతున్న రెప్పలు
ఎంతకీ తెగని సుదీర్ఘ అసంపూర్ణ
స్వప్నాన్ని తె౦చలేక
అలసిన దేహాన్ని ఇలా
ఈ గదిమూలలో ఒ౦టరిగా ...

Wednesday, May 5, 2010

నాన్న కళ్ళు మట్టిలో కలిసిపోయాయా?



అమ్మ పేగు తెంచుకుని పడ్డప్పటి నుంచి
నాన్న చేతులలోనే పెరిగిన వాణ్ణి
పాకేటప్పుడు ముడుకులు గీర్లు పడితేనే
కళ్ళ నీళ్ళు పెట్టుకున్న నాన్న
నిలబడేందుకు తన వేలి ఆసరా యిచ్చిన నాన్న
నడక నేర్పి, పరుగు నేర్పి
సైకిలు నేర్పి, ఆటలలో తానూ ఒకడై
తన కంటి పాప కన్నా నన్నే
ఎక్కువగా చూసిన నాన్న
పెన్సిలు చెక్కి బొమ్మ గీయడం నేర్పిన నాన్న
తన బొమ్మను నా పిచ్చి గీతలలో చూసి విరగబడి నవ్విన నాన్న
తర తరాలుగా తన రంగు పడ్డ వేదనను
బోధించి నా అక్షరం ద్వారా తన విశ్వాశ ప్రకటన
గావించిన నాన్న
జై భీం అంటూ ధమ్మ పథాన్ని మార్గంగా నడిచి
నడిపించిన నాన్న
నా కంట్లో నలుసు పడితేనే తన కళ్ళ సెలయేళ్ళు పొంగిన
నాన్న కళ్ళూ మట్టిలో కలిసిపోయాయా...

(కవి రాం మొన్న రాత్రి యిటీవల పరమపదించిన తన తండ్రె జ్ఞాపకాలతో యిలా అడిగి నన్ను ద్రవింపచేసినందుకు)

Friday, April 30, 2010

నూరేళ్ళ శ్రీశ్రీ కి నీరాజనాలు




తన జీవితకాలమంతా అభాగ్యుల వెతలను
కవితా తూటాలుగా పేల్చి
ఆచరణలో ఉద్యమాల వెంట నిలిచి
పతితులు, బాధాసర్పద్రష్టులకు
నేనున్నానని,
రేపు మనదేనని
కష్టజీవికి యిరువైపులా నిలబడ్డవాడే కవి అని
తెలుగు బావుటా రెపరెపలను
దశదిశలా వ్యాపింపచేయ
శరపరంపరగా అక్షరయాగం చేసిన
మహాకవికి అరుణారుణ వందనాలు..
నూరేళ్ళ శ్రీశ్రీ కి నీరాజనాలు..


http://www.mahakavisrisri.com/home/VideoClips.htm

Sunday, April 25, 2010

'పేగుకాలిన వాసన' జగన్నాధ శర్మగారి కథలపరిచయ సభ





పార్వతీపురంలో పుట్టిన ఋణాన్ని తీర్చుకునేందుకన్నట్లు ఎ.ఎన్.జగన్నాథ శర్మగారు తన కథల సంపుటి 'పేగుకాలిన వాసన' పరిచయ సభను ఈ సాయంత్రం యిక్కడ నిర్వహించారు. ఈ సభకు అధ్యక్షులుగా ప్రముఖ కవి కె.శివారెడ్డి నిర్వహణలో సభ ఆధ్యంతం ఆహ్లాదకరంగా జరిగింది. కథల సంపుటిని కథల మాస్టారు శ్రీ కాళీపట్నం రామారావు గారు ఆవిష్కరించారు. కథలను ఉత్తరాంధ్ర కథకులు అట్టాడ అప్పల్నాయుడు ముందుగా పరిచయం చేస్తూ కథలలో శర్మ గారు జీవన విషాదాన్ని ప్రముఖంగా రాసారంటూ అగ్రహారం బ్రాహ్మణుల జీవితాలలోని విధ్వంసాన్ని కూడా రాయాల్సిన అవసరముంది. ఈ కథలలో శర్మగారు చాలా వరకు తన నేపథ్య జీవితాన్ని ఆవిష్కరించారన్నారు. ఆ తరువాత సీమకథకులు ఆచార్య మధురాంతకం నరేంద్ర కథలను విపులంగా పరిచయం చేస్తూ యుద్ధం, విప్లవం, నినాదాలు లేకుండా విప్లవ కథలు చదవాలంటే శర్మ గారి కథలే చదవాలి. మార్క్సిస్టు దృక్పధంతో రాసినా కథలలో చదివినంతసేపూ విధ్వంసం చదువరికి బోధపడుతుంది గానీ అది విప్లవ కథగా వెంటనే స్ఫురించకుండానే ఆలోచనలను చైతన్యవంతం చేయడంలో ఈ కథలు తమ పాత్రను పోషిస్తాయని చెప్పారు. నినాదాలు లేకుండా గొప్ప మార్క్సిస్టు కథలు రాసిన వారు శర్మగారని కొనియాడారు. నాన్నంటే కథ గొప్ప విప్లవకథగా పరిచయం చేసారు. గొప్ప కళాకారుడిగా కీర్తించారు. రెండు రెళ్ళు గురించి చెప్పి చివరిగా నాలుగు రావడాన్ని గోప్యంగా వుంచి అది పాఠకుడికి విడిచిపెట్టడంలో శర్మ సఫలీకృతులయ్యారనన్నారు. గుడిపాటి తనకు శర్మ గారితో వున్న పరిచయాన్ని చెప్తూనే కథాసంకలనాలను కొని సాహిత్యాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యతను తెలియజేసారు. చివరిగా శర్మ గారు తనకు పార్వతీపురంతో వున్న పరిచయాన్ని చెప్తూనే తనకు కథా రచన తన అమ్మనుండే అబ్బిందని, స్క్రీన్ ప్లే ఎలా రాయాలో తాను తన తల్లి దగ్గరే నేర్చుకున్నానని చెప్పారు. చివరిగా తన బాల్య మిత్రులు, సహాధ్యాయులు శర్మగారిని సన్మానించారు.

Friday, April 9, 2010

కవి రాం తండ్రి అస్తమించారు



'కొయిటా అమ్మకు కన్నీటి ఉత్తరం' కవితా సంకలనం కవి సిహెచ్.రాం తండ్రి క్రిష్ణ్రారావు మాస్టారు గారు ఈ రోజు ఉ.11 గం.లకు యానాంలో అస్తమించారు. మాస్టారుకు కవి రాం అంటే చాలా ప్రేమ. కానీ చివరి క్షణాలలో రాం తన దరిలో లేకపోవడం విషాదం. తను మాకు దగ్గరలోని బొబ్బిలిలో నివాసముంటున్నాడు. తన సోదరుడు రవి తను కవలలు. ఇద్దరికీ సాహితీలోకంతో పరిచయం మెండు. ఏ కవితైనా చదివి యిట్టే గుర్తుపెట్టుకొని మరల సమయం వచ్చినప్పుడు దానిని మననం చేస్తూ వ్యాఖ్యానిస్తారు.

యిక్కడ రాం కవిత్వ పరిచయం సందర్బం కాకపోయినా తనతో పరిచయం లేనివారికి పరిచయం చేద్దామని...

కొయిటా అమ్మకు కన్నీటి ఉత్తరం కవితా సంకలనం కవి శివారెడ్డి, కవి డా.శిఖామణి, కవి సీతారాం గార్ల ముందుమాటలతో మంచి విశ్లేషణతో వుంటుంది. దళిత కంఠాన్ని కొత్త గొంతుకతో మూలాలను స్పృశిస్తూ సాగుతుంది రాం కవిత్వం. అలాగని తన వర్గం వెతలనే కాక సమకాలీన సమస్యలన్నింటినీ తన నిశిత దృష్టితో పరిశీలించి కవిత్వీకరించి మనముందుంచుతాడు. మనం రోజువారీ అతి సాధారణంగా చూస్తూ పోయే వాటిని తన కవితలలో అభివ్యక్తీకరించిన తీరు రాంకే సాధ్యమా అనిపిస్తాయి.

కిటికీ...

తెల్లారక తెల్లారక తెల్లారుతుంది
ఎల్లవేసిన గోడలో పాతుకుపోయిన కిటికీ
కొత్తగా కనిపిస్తుంది
కిటికీ బుజాలమీద చేతులేసి
రాత్రంతా జాగారం చేసిన
కళ్ళు ఎరుపెక్కాయి
గాలి వచ్చీ, వానా వచ్చీ
మంచూ పట్టీ, పొగా పట్టీ
రాత్రి గడిచాక
ఓ వెలుగుకిరణాన్ని
కిచ కిచల పిట్టను చేసి
నాపైకి పంపుతుంది కిటికీ.

'నా బంగారు తల్లి పిడికెడు ఆత్మ
పిచ్చుకై వాలింది కిటికీరెక్కపైనే'

రెప్పల మధ్య ఓ పురా జ్నాపకం
కన్నీటి బిందువై నిలిచినపుడు
నా ముఖచిత్రం చుట్టూ
నలుచదరపు చట్రమై
నన్ను పొదివి పట్టుకుంది కిటికీయే...


2. పాకీ పిల్ల..
చీకటిని ప్రేమించే చీకటి పిల్ల
మనసుని చంపుకుని
మానవ మలాన్ని గంపలకెత్తుకుని
సందు సందునా సంచరించే
చండాల బాలిక...
---
ఆమె బాల్యాన్ని పలకరిస్తే భగవంతుడే భయపడతాడు
అసలు బాల్యాన్ని భగవంతుడితో పోల్చిందెవడు
బాల్యమే భగవంతుడైతే
భగవంతుడు ఏనాడో పీతి కుప్పమీద కూర్చున్నాడు..
--
రాత్రంతా
పాకీ పేటపై సంచరించిన
పీతి రంగు చంద్రుడు
తెల్లారేసరికి
వేదాల రేవులో తేలియాడుతున్నాడు
పదా...
చీపుర్ని పులిమి
కొత్త జీవనం సాగిద్దాం...

3. కొత్త వసంతం..
మా ఏకాంత పూదోటలో
పై పెదవి నేనై
క్రింది పెదవి తానై
ఈ ఫలాన్ని కోరుకున్నాం
వీడేమిటి
వామనుడై నన్ను
నా బాల్యపు లోతుల్లోకి తొక్కేస్తున్నాడు
--
ప్రతీ సాయంత్రం
వెన్నెల వాకిలిలో గెంతులేస్తూ
చంద్రవంకను మా యింటి చూరుకు
లాంతరు దీపమై వేలాడదీసి
నా బాల్యపు జ్నాపకాల కిటికీని
మూసేసిన మా అమ్మను
మరల, మరల జ్నాపకం చేస్తున్నాడు...

యిలా వైవిధ్యంతో సాగుతుంది రాం కవిత్వం. రాం కవిగా ఎదగడానికి తన తండ్రి ప్రోత్సాహం చాలా వుంది. మాస్టారు గారు అంబేద్కరిస్టుగా, బుద్ధిజాన్ని ఫాలో అయ్యే వ్యక్తిగా యానాం ప్రజలందరికీ తలలో నాలుకలా వున్న మనిషి. రాంకు తన చిన్నతనంలోనే అమ్మను కోల్పోయినా లోటు తెలియనివ్వని తండ్రీ. ఆయన మరణం రాం, రవిలకు కుటుంబ సభ్య్లకే కాదు యానాం వాసులందరికీ విషాదాన్ని నింపింది.

Thursday, April 8, 2010

ఇట్లు మీ విధేయుడు-భరాగో సెలవు



ఇట్లు మీ విధేయుడు కథా సంకలనంతో అందరి హృదయాలలో శాశ్వత స్థానం ఏర్పరచుకొని తన 78 వ ఏట అందరి వద్ద సెలవు తీసుకొని వెళ్ళిన భరాగో లేరన్న వార్త తెలుగు సాహితీ లోకాన్ని శోక సంద్రంలో ముంచింది. తన సునిసిత హాస్య రచనలతో తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన భరాగో (భమిడిపాటి రామగోపాలం) గారికి నా హృదయపూర్వక నమస్సుమాంజలులు.

ఆయన వందకు పైగా కథలు, వంటొచ్చిన మగాడు, వెన్నెల నీడ నవలలు రాసారు. ఇట్లు మీ విధీయుడు కథా సంకలనంకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఇచ్చి తనను తాను సత్కరించుకుంది. ఉన్నత మానవీయ సంబంధాలతో సాహితీ లోకాన ఆయన చేసిన కృషి మరువరానిది.

ఇక్కడ ఇట్లు మీ విధేయుడు చదవొచ్చుః
bhamidipati ramagopalam_Part1
Related Posts Plugin for WordPress, Blogger...