Saturday, February 12, 2011

ఎడారిలో వసంత గానం



మొన్న ఎగసిపడిన

జాస్మిన్ సెగలు

అంటించిన నిప్పు

రవ్వలు...


ఆకలిగొన్న

పేగుల ఆర్తనాదాలే

పొలి కేకలై

నిద్ర లేచిన మమ్మీల

నో టి నుండి

ఎగసిపడిన ఇసుక

తుఫాన్లో

అవినీతి చక్రవర్తి

ముబారక్

సింహాసనాన్ని

పెళ్ళగించి

ప్రజల పాదాల

చెంతకు

అధికారం

దాసోహమన్న

క్షణం ...


ఇది మరో మారు

విముక్తి పోరాటాల

యుగమని

జన హోరుముందు

మర ఫిరంగులు

బలాదూరని...


ఉత్తుంగ తరంగాలుగ...

ఎగసిపడే

జన కెరటాల తాకిడికి

ఏ రక్షణ కవచాలు

అడ్డు నిలవవని ...


అట్టడుగు జనావళికి

మరోమారు

గుండెనిబ్బరాన్నిచ్చిన

ఎడారి హోరు...


ఎండమావులే కాదు

ఒయాసిస్సులూ

ఉన్నాయన్న

భరోసాకు

జేజేలు....


ఈ వసంతగానం

నేల నాలుగు చెరగులా

వినిపించాలని...


ఈ విజయం

శాశ్వతం కావాలని...

(ట్యునీసియా, ఈజిప్టు ప్రజల ప్రజాస్వామ్య కాంక్షకు మద్ధతుగా)

Thursday, February 10, 2011

ఆది యందు అంతమందు నేనే

శూన్యమా అది

కాదు అక్కడా

నోట్ల రెపరెపలే

ఒకటా రెండా

లెక్కపెట్టనీకి

నీవి మున్నూరు

జీవితాలు కావాలె...

ఆద్యంతములు

ఖాళీగా వదలని

అవినీతి భూతం

వికటాట్టహాసం

నాలుక లేని

నాయకునికి

చేతులూ లేవు...

డొక్కనిండనీకి

జనం

రెండొందల

పెన్సన్ డబ్బులకు

క్యూలో

విదిల్చనీకి

ఇంక

ఎంగిలి మెతుకులూ

లేకుండా

నాకి పారేస్తున్న

నాయకుల

అరచేతి కింద

నీడ కూడా

భయపడి

దాక్కుంది...

కావుకావు మననీకి

కాకులూ లేవు

కరవనీకి

కుక్క పళ్ళకంద

బొమిక ఇరుక్కుంది

చల్ చల్ రే భాయి

జర దేఖో బహెన్

ఏక్ కఫన్

ఊంచా రహే హమారా...

Saturday, February 5, 2011

వలస పక్షులు
























ప్రతి
దినం

ఒక జాతర ఇలా

మా రైల్వే స్టేసను కాడ


బుజాలకేవో రెక్కలు

మొలిసినట్టు
అంతా
ఇలా దూరంగా
సాగిపోతున్నారు...
ఊరు దాటి గడప దాటి
రాని
మా గంగమ్మ, ముత్తాలవ్వ

సీతారాముల్నాయుడు

ఇలా నెత్తిన సత్తు ముంతల

గోనెతో సాగిపోతుంటే...


ఊరు దెయ్యమేదో
తిరుగాడినట్టు
ఊరంతా తలుపులు మూసుకుపోయి

దప్పికకు సెంబుడు
నీళ్ళిచ్చే
సెల్లెమ్మ లేక
గొంతు తడారిపోతోంది...


ఎన్ని పథకాలు పెట్టి

ఈ కడుపు మంటను

ఏమార్చ గలరు...


ఇలా మూటా ముళ్ళె

సరుదుకొని
సాగిపోతున్న
వారు
జన్మతః సంచార జీవులు కాదాయే..

ఇంటి కొచ్చిన అతిథికి

కడుపునిండా తిండి పెట్టి

పంపిన వారే

నేడిలా తమ
పేగుల్ని
మెడకు
సుట్టుకొని
సాగిపోయే రోజులొచ్చి

పొలాలు బీడులవుతుంటే
..

ఇక్కడ ఎక్కడెక్కడినుండో

వచ్చి బొగ్గు కుంపట్లు రాజేస్తామని

మా సుట్టు సేరిన పెద్దలు

వంతపాడుతున్న
గోడమీద పిల్లులు

ఇలా అంతా

మా బతుకులో
బుగ్గి పోయ జూసినోళ్ళే

మరి వాళ్ళ నోట్లో బుగ్గి పోసేదెప్పుడో...


ఈ వలసలాగి

మా నేల తల్లి
మల్లా
పచ్చ సీర కట్టుకొని
నుదుట ఎఱ కుంకుంబొట్టు

పెట్టుకునేదెన్నడో...

Tuesday, February 1, 2011

వెలుగు పూలు




















మీరు నడిచినంత మేరా

వెలుగు పూలు


మీ నవ్వుల కాంతితో

ఈ జగమంతా

వెలుగు పూలు


మీ ఆత్మీయ

కరచాలనంతో

మనసంతా

వెలుగు పూలు


మీరు వదిలిన

జ్నాపకాలన్నీ

మాకు

వెలుగు పూలు

Monday, January 31, 2011

నిశ్శబ్ధం చీడ కావద్దు








ఇక్కడేదో వాన ముందర

మబ్బులు కమ్మి

మసక బారినట్లు వుంది

తుఫాను ముందర

సంద్రం ప్రశాంతంగా అగుపిస్తున్నట్లుంది


మౌనాన్ని అంగీకారంగా

ఓటమికి చిహ్నంగా మారుద్దామన్న

తాపత్రయంతో వాళ్ళు ముంచుకొస్తున్నారు


కానీ

వేసిన వెనకడుగు

మరిన్ని బారల దూరాన్ని

అధిగమించడానికేనన్న

ఎరుకతో వుండండి..


నిశ్శబ్ధం బద్దలై

వసంత మేఘం గర్జించి

వర్షించే సమయుం

ఆసన్నమైంది...


ఇన్నాళ్ళు పొగిలి పొగిలి

ఏడ్చిన కనులే

నేడు విస్ఫులింగాల్ని

కురిపించనున్నాయి...

మోసపోయి పోయి

దగాపడ్డ జనమంతా

దండై నేడు

కదులుతున్న క్షణాన

ఢిల్లీ పీఠం కదలబారుతున్నది


ఎగరనీ ఎగరనీ

స్వతంత్ర తెలంగాణా

ఝెండా

నయా వలస పాలకుల

గుండెలపై...

Saturday, January 29, 2011

గోరఖ్ పాండే స్మృతిలో




















ఓ
యువ కవీ

నీ గురించి తెలుసుకున్న క్షణం

నీ పోరాట రూపాన్ని తలుచుకున్న క్షణం

ఎంతో ఉద్విగ్నతకు లోనయ్యాను

విద్యాధికుడివైనా
శ్రామిక జన పక్షపాతిగా కలం పట్టి
కుళ్ళు రాజకీయ వ్యవస్థపై

అక్షర పోరాట బాణాలనెక్కుపెట్టి

జన సాంస్కృతిక మంచ్
స్థాపించి
హిందీ, భోజ్ పురిలలో
సాహిత్య సృజన చేసి
నిరంతరం జన విముక్తిని
కలలు గన్న
ఓ కవీ
రవీ విప్లవ కవీ
నీ కలలు నేటికీ సజీవం

నీ జ్ఞాపకాలు వెంటాడుతూనే వున్నాయి..


( ఈ రోజు గోరఖ్ పాండే ఆత్మహత్య చేసుకున్న రోజు. ఆయన తాను ఏర్పాటుచేసిన జన సాంస్కృతి మంచ్ తాను రూపొందిచిన ఆశయాలకనుగుణంగా ఎదగకపోవడం, సభ్యుల మధ్య సత్సంబంధాలు దూరం కావడంతో జనవరి 29,1989 న ఆత్మహత్య చేసుకున్నారు. పిన్నవయసులోనే మరణించిన ఈ కవి రెండు కవితా సంపుటాలు ప్రచురించారు. అలాగే వ్యవసాయ కూలీ పోరాటాలకు మద్ధతుగా పనిచేస్తూ రచనలు చేసారు. ఆయన జే.ఎన్.యు విద్యార్థి.A scholar of Sanskrit as well as a research scholar in philosophy, he did not let his academic background hamper his activity among the people.హిందీ కవితా రచనలలో ఓ కొత్త ఒరవడికి నాంది పలికిన గోరఖ్ పాండేకు జోహార్లర్పిద్దాం)

Friday, January 21, 2011

తడి












ఇప్పుడేదో అంతా
ఎడారి పరుచుకున్నట్లు
పాదాలు ఎర్రని ఎండలో
కూరుకుపోతున్నట్లు
అరచేతులలో తడి
ఆరినతనం..

దేనిని తాకినా
ఏదో రబ్బరు తొడుగు
దేహమంతా
కప్పబడినట్లు
స్పర్శ కోల్పోయినతనం..


కనుల లోయలో
పరచుకున్న
ఎండమావులు....
గాజు కళ్ళుగా
మారిపోయాయన్నట్టు
ఏదీ ఇంకనితనం..


అంతా రంగు రుచి లేని
కషాయంలా గొంతులో
ఏదో విషం దిగుతున్నా
బాధ తెలియని
శిలాజంలా...


ఒంటరితనంవైపు
మొగ్గుతూ బాహ్యాంతరాలలో
ఏదో నిషేధ ఘోష


చుట్టూరా కమ్ముకున్న
ఈ సమ్మె వాతావరణంలో
నాలుక పిడచకట్టి
గొంతెండిన వేసవితనం
వెంటాడుతోంది...


ఎక్కడో దాగిన కాసింత
కన్నీటి ఊట
నన్నింకా ఇలా
మనిషిలా(?)
నీముందు...

(ఈ కవిత ముందుగా 'పొద్దు' లో వచ్చింది)

Saturday, January 8, 2011

కళింగాంధ్ర గోస

ఇక్కడ గలగల పారే జీవనదులు

నాగావళి, వంశధారలతో పాటు

జంఝావతి, వేగావతి, గోస్తనీ,

చంపావతి, మహేంద్ర తనయ...

ఇంకా ఎన్నో ఎన్నెన్నో నదులు,

సెలయేళ్ళు, వాగులు, వంకలు

ఊటలు, పిట్టల కిలకిలా రావాలు,

పచ్చాపచ్చని అడవులు, సక్కని సుక్కలమల్లె పల్లెలు

సిన్నసిన్న పట్టణాలు, ఇసాకపట్నం నగరం,

ఇవన్నీ జూసి కన్నుకుట్టీ

బొగ్గు నిప్పుల కుంపట్లన్నీ

మా గుండెలపై రాజేస్తావా?

మా నెత్తిపై అణు బాంబునెత్తి

మా నేల పచ్చదనాన్ని భగ్గున మండిస్తావా?

మా సేపల వలలెత్తుకెల్లి

మరపడవలతో మా సంద్రం కడుపులో

దేవుకు పోతావా?

మా నట్టింట్లో కొచ్చి బంగరు

గనులన్నీ కాజేస్సి

మా కొండఫలాల్ని ఎత్తుకుపోయి

మా బూములన్నీ బుగ్గిజేసి

మా నీళ్ళన్నీ ఇసంజేసి

మా దీపాల్ని ఆర్పేయజూస్తావా?

మా బతుకులు సెడగొట్టడానికొస్తే

నీ పీక కోసి తలకాయ మా బొబ్బిలి

కోట గుమ్మానికి ఏలాడదీస్తాం!

Friday, January 7, 2011

డా.జ్నానానంద కవి మృతి

పద్మశ్రీ, కళాప్రపూర్ణ, డా.సురగాలి తిమోతి జ్నానానంద కవి నిన్న కాకినాడలో అనారోగ్యంతో తన 90వ ఏట మరణించారు. ఈయన విజయనగరం జిల్లా, బొబ్బిలి సమీపంలోని పెదపెంకి గ్రామంలో 1922, జూలై 16 న జన్మించారు. కాకినాడలోని మెక్లారిన్ హైస్కూల్ లో 35 సం.లపాటు తెలుగు పండితునిగా పనిచేసారు. 30 కి పైగా రచనలు చేసారు. బుద్ధుని శిష్యురాలైన ఆమ్రపాలి పై రాసిన కావ్యం పేరొందింది. అలాగే గోల్కొండ కావ్యం, క్రీస్తు చరిత్ర, తరంగమాల, వసంతగానం, గాంధీ, దేశబంధు, పాంచజన్యం, ప్రభంజనం, పర్జాన్యం, వెలుగుపాట, విజయాభిషేకం కావ్యాలు సాహితీ లోకాన్ని అలరింపచేసాయి. ఈ కావ్యాలలో చాలావరకు పాఠ్యాంశాలుగా చేర్చబడి ప్రశంశలందుకొన్నాయి. ఈ సాహితీపురుషుని నిష్క్రమణ తెలుగు సాహితీరంగాన్ని దుఃఖసాగరంలో ముంచింది..

Wednesday, January 5, 2011

నాన్నగారు

















నాకు
ఆయనను చూసినప్పుడంతా

మేరు పర్వతం వర్ణనే గుర్తొస్తుంది

ఆ నీడలో వుంటే దేన్నైనా
జయించగలనన్న
హామీ గుండెనిండా..

చల్లగా ఆ చేతి స్పర్శ నుదుటిపై తాకగానే

చందమామ పుస్తకంలోని
రాకుమారునిలా మారి
రెక్కలగుఱమెక్కి
వినువీధిలో
షికారుకెల్లిన అనుభూతి...


తను కన్నెఱ చేస్తే పాదాల కింద
నేల
ఈనెలై అగాథాలలో పడిపోతున్న బావన...


తన పాదముద్రలను తాకగానే

కడిగిన ముత్యమల్లే మనసంతా
తేలికై
ఒక్కసారిగా దేహమంతా
కొత్త వెలుగు...

నాన్నగారూ
మీ కివే
నా జన్మదిన
శుభాభినందనలు...

Wednesday, December 29, 2010

ప్రశ్నను ఉరివేయగలరా?




ప్రశ్న
ఇది ఆది నుండి
అందరి గొంతులో దిగబడుతున్న
కర్కశ శూలం
తట్టుకోలేనితనంతో
అంతా దానిని పాతరేయజూస్తుంటే
మరల మరల అది
నిటారుగా మొలుస్తూ
జూలు విదిలించి
తన కొక్కేనికి నీ పీక
తగిలిస్తోంది...

ఎంత ఓర్చుకోలేనితనం
ఒక్కమారుగా గుంపుగా మందలా
పడి దాన్ని నలిపేయ నమిలేయ
జూస్తే పళ్ళమధ్య ఇరుక్కొని
కుక్క ఎముకను
కొరుకుతూ తన పళ్ళసందుల
కారే నెత్తురు రుచికి ఆహా అనుకున్నట్లు
తన్మయత్వంలో వున్నావా?

ఆగాగు
యుగాలుగా దానిని ఉరితీసి
ఊపిరి పీల్చుకుందామనుకుంటే
అది నీ మెడ చుట్టూ
బిగుసుకుంది చూడు...

(ఆదివాసీ హక్కుల కార్యకర్త డా.బినాయక్ సేన్ పై మోపబడ్డ దేశద్రోహ నేరమూ-శిక్షకు వ్యతిరేకంగా)

కవిత్వమె దేహమై ఆత్మైన గుడిహాళం స్మృతిలో..

"నేల రహస్యం ఎంతగా తెలుసో
చెట్టుకి
ఆకాశ రహస్యమూ అంతగా తెలుసు
పాతాళం వేడి ఒత్తిడి తెలిసిన జలమే
గగన సీమల్లో విహరించగల్దు"

అని గగన సీమల్లోని రహస్యాన్ని చేదించడానికి నింగికెగసిన విపశ్యన కవి మిత్రులు, రచయిత, పాత్రికేయులు గుడిహాళం రఘునాధం ఏభై నాలుగేళ్ళకే తెలుగు నేలను విడిచిపోవడం అత్యంత విషాదం..

తొంబైలలో వచ్చిన ఆయన ఫోర్త్ పెర్సన్ సింగ్యులర్ కవితా సంకలనం కవిత్వ రంగాన ఎలుగెత్తిన కొత్త గొంతు. పద్యంలో ఇమడాల్సిన అందం గురించి తెలిసిన కవితా సౌందర్య పిపాసి. రాత్రినడిచిన జాడ ఇంకా చెరిగిపోలేదు. మనమంతా తప్పక హృదయాగ్నిలో ఈ కవిని స్నానం చేయనిద్దాం... (ఇవన్నీ ఆయన కవితా పాదాలనుండే)..



ఇక్కడ సుంకిరెడ్డి రాసిన నివాళి చదవండి

Tuesday, December 14, 2010

విషాదం?
















౧.రోడ్లు
వెడల్పు అవుతున్నంత సులభంగా
మనుషుల మనసులు
విశాలం కావట్లేదెందుకో??

౨.చెత్తనూడ్చినంత సరళంగా
మనసును శుభ్రపరచలేమెందుకో??

Tuesday, November 23, 2010

కవిత్వంతో ఎగసిపడిన 'అల' హఠాన్మరణ౦....


ఎక్కడ సాహితీ సభలు జరిగినా తప్పక హాజరై తన కవితను వేదికపై వినిపించే 'అల' ఈ మధ్యాహ్నం కామెర్ల వ్యాధితో బాధ పడుతూ చనిపోవడం ఉద్యమ కవితా రంగానికి, ఉత్తరాంధ్ర సాహితీ మిత్రులకు తీరని నష్టం. మినీ కవితలు చాలా రాసిన 'అల' జనసాహితీ నిర్మలానంద గారి ప్రోత్సాహంతో దీర్ఘ కవితలు రాయడం ఆరంభించి ఈ మద్యనే నిప్పులవాగు, మట్టిచెట్టు పిట్ట బజినిక, అలల సవ్వడి అన్న దీర్ఘ కవితా సంకలనాలు ప్రచురించారు. మృదు స్వబావిగా, ఎప్పుడూ చిరునవ్వుతో పలుకరించే అల తన కలం ద్వారా రాజ్యం పట్ల, దాని అణచివేత ధోరణి పట్ల తీవ్ర వ్యతిరేకతను, ప్రజా ఉద్యమాల పట్ల సానుభూతిని, అణగారిన వర్గాల పట్ల ఆప్యాయతను కలిగివుండే వారు. తన సొంతవూరు అన్నంరాజు పేటలో ఓ చిన్న స్కూలును నడుపుతూ సాధారణ జీవితం గడుపుతూ తన కవితల ద్వారా, రచనల ద్వారా సాహితీ మిత్రులతో పాటు ఇక్కడి ప్రజల ఉద్యమాలలో పాలుప౦చుకు౦టూ అందరికీ చేరువైన వారు. అనారోగ్యంతో ఇలా అందరినీ విడిచి పోవడం ఎవరికీ నమ్మశక్యంగా లేదు. 'అల' కలల సవ్వడి ఇంత హఠాత్తుగా ఆగిపోవడం మాకు తీరని బాధను మిగిల్చింది.
అల
కవితా వాక్యాలు కొన్ని:
నాగలి మేడిని
అదిమిపెట్టే వేలే
తెల్లకాగితం మీద
ముద్ర వేసినప్పుడు
కొరడా కర్రని
బిగిసిపట్టిన చెయ్యే
అప్పులకోసం అర్రులు చాచినప్పుడు

యుద్ధం అనివార్యం..


౨
. విత్తనం కడుపులో స౦కర౦ సు౦కు పుట్టి౦ది
బహుళ
జాతి బలాత్కరి౦చి
టెర్మినేటర్ ఎబార్షన్ చేసి0ది

రైతు స0క్షోభం సర్వవ్యాప్తమై

మట్టిని మేల్కొలిపి0ది...


ఇప్పుడు
మన యుద్ధం
ఒక్క
బుగత మీదే కాదు
బుగతకు బాసటగా వున్న
ఈ
రాజ్యం మీద మాత్రమె కాదు
మన
ఆలోచనల మీద,
మన సంస్కృతి మీద
సాగుబడి మీద,
మన వృత్తుల మీద

మన వ్యాపారం మీద,
మన సకల ఆహారపు అలవాట్ల మీద

చావుదెబ్బతీశాడే...
వాడిమీద,
వాడి కుట్ర మీద
యుద్ధం చెయ్యాలి..

ఇలా
రాజ్యం, దానికి వత్తాసుగా వున్న సామ్రాజ్యవాద౦ మీద తన యుద్ధాన్ని ప్రకటి౦చిన 'అల' తన యుద్దాన్ని ఇలా అర్థా౦తర౦గా వదిలేసి వెళ్ళిపోవడం సాహితీ ఉద్యమానికి ఆశనిపాతం.. తను జన సాహితీ సంస్థ బాధ్యతలలో వున్న మిగతా సాహితీ సభలకు అలాగే విరసం సభలకు కూడా హాజరై తన స౦ఘేభావాన్ని, మిత్రత్వాన్ని కొనసాగించే అల ఇలా దూరమవ్వడం బాధాకరం..

జోహార్
కా.అల...
కా
.అల ఆశయాలను కొనసాగిద్దాం...

Wednesday, November 17, 2010

అరుణతార జూలై - సెప్టెంబర్ సంచిక



అరుణతార విరసం అధికార పత్రిక. ఈ పత్రిక ఇంత ఆలస్యంగా రావడానికి కారణం ఆర్థికపరమైన వెనుకబాటు. సాహితీ మిత్రులు, పాఠకులు మీ విరాళాలతో, చందాలతో పత్రికను ఆదుకొనగలరని ఆశిస్తూ..

చందాలు, విరాళాలు ఈ చిరునామాకు పంపగలరుః
ఎస్.రవికుమార్,
5-1307,
దొరసానిపల్లె రోడ్,
ప్రొద్దుటూరు,
కడప జిల్లా - 516 360
Mobile No.:9866021257

రచనలు ఈ చిరునామాకు పంపించి పత్రికకు సాహిత్యపరంగా తోడుకాగలరుః

డి.వి.రామక్రిష్ణారావు,
M.I.G.-14, APIIC colony,
Opp. Corbide Company
Moulali,
Hyderabad - 500040.

Email: arunatara1977@gmail.com

Arunatara July-Sep2010 Final

Sunday, November 7, 2010

మాయల ఫకీరులు




ఏదో ఓ పెద్ద సునామీ కెరటం
ముంచెత్తడానికి
ముందున్నట్లు ఈ ప్రశాంతత..

ఆకాశమంత కమ్ముకున్న
మబ్బులు రైతన్న
మోముపై చూస్తూ
భూమిలోకి కుంగిపోతున్న
అనుభూతి...

కోతకొచ్చిన పంట 'జల'
వరదపాలౌతుందన్న
బెంగతో గొంతులో
ముద్ద దిగక
ఊపిరాడనితనం...

ఇంతలొ...

ఓ అరచేయి అందరి
నెత్తిపై గట్టిగా మోదుతూ
మోకాళ్ళపై మోకరిల్లమని
ఆజ్నాపిస్తున్నట్లు...

నోటికందిన ముద్దను
నల్లరెక్కల గెద్ద ఏదో తన్నుకు
పోతున్నది!

రెక్కలకింద దాగిన పిల్లలను
మరింతగా దాచుకునేందుకు
ఒదిగిపోతున్న కోడి
ఈకల సందుల్లో దూరుతున్న
సాటిలైట్ చూపుతో
సిగ్గుతో చచ్చిపోతున్నది..

మూసుకుపోతున్న
బాహ్య ఆధార దారులతో
నిరుద్యోగి గుండె సంద్రమౌతున్నది..

ఇక్కడి ధాతువులన్నీ
చాప చుట్టే పన్నాగంతో
వచ్చిన ఈ మాయల ఫకీరు
చిలకను కొట్టేందుకు
శిలకోలలెక్కుపెడుదాం...

Saturday, October 2, 2010

నేనూ మా నాన్నగారూ ఓ ర్యాలీ సైకిల్



బడిలో ప్రార్థనకు ముందుగా
గేటు వద్ద దింపకపోతే తన
కొడుకు అరచేయిపై పడే ఎఱ
చారలనూహించుకొని
అప్పుడే తిన్న పేగుల్నొప్పిని
పైపంటితో భరిస్తూ స్పీడుగా
వెళ్ళలేనని మొరాయిస్తున్న
సైకిల్ పెడల్ పై శక్తినంతా పెట్టి
తొక్కిన మీ పాదాలను
నమస్కరించకుండా ఎలా వుండగలను
నాన్నగారూ..

సైకిల్ సొంతంగా తొక్కితే
పడి మోకాలుపై చర్మం వూడితే
ఇంకెప్పుడూ సైకిల్ తొక్కనివ్వని
మీ అవ్యాజ ప్రేమ
నన్నిప్పటికీ దానికి దూరం చేసిందని
తలచుకున్నప్పుడంతా నవ్వే
మిమ్మల్ని చూస్తూ
నా భయానికి నాకే సిగ్గేస్తోందిప్పుడు!

హాయిగా మీ గుండెలపై వాలి
ఇప్పటికీ వేళ్ళమధ్య రోమాలనిరికించి
ఆడుతూ నిదరపోవాలనివుంది...

Sunday, September 5, 2010

కాస్తంత ఎండను ఆహ్వానిద్దాం..




ఎప్పుడూ చలువరాతి గదుల్లోనేనా!
కాస్తంతా ఎండను కూడా ఆహ్వానించండి

ఎండ మీ గుండె గదిమూలల్లో
తగిలేలా బార్లా తలుపులు తెరిచి వుంచండి..

గాభరాగా బయటకు వచ్చి
తుఱున మరల లోపలికి ముడుచుకుపోయే
స్ప్రింగ్ డొర్ లను అడ్డుపెట్టి ఆపండి
లేదా బద్దలుకొట్టి బయటపడండి..

ఎండ జీవితంలో సుఖ దుఃఖాలకు సంకేతం..
దాని రూపు తెలీకపోతే
మీతో పాటుగా మీ మెదడు కూడా
నాచు పట్టిపోగలదు..

కాస్తంత ఎండను ఆహ్వానించండి
గట్టిగా నేలను తన్నిపెట్టి
శక్తినంతా పాదాలలోకినెట్టి
పైకెగరండి..
ఆకాశపుటంచులతాకే చేతులకు
అంటిన మబ్బుల చల్లదనం
ఎరుకౌతుంది...

కాస్తంత ఎండను ఆహ్వానించండి
ఎదను హత్తుకున్న మీ
మిత్రుని గుండెలయ మీ
గుండెపొరల ద్వారానే తెలుసుకోండి..
మీలోకి పాకిన తన రక్తచలన
సంగీతాన్ని చెవులారా విని
గొంతులో స్వేచ్చా గీతాన్ని
జుగల్బందీగా గానం చేయండి..

ఎల్లలు చెరిగిన నిర్వాణక్రమాన్ని
అనుభూతిచెందండి..

కాస్తంత ఎండను ఆహ్వానిద్దామా?
Related Posts Plugin for WordPress, Blogger...