మొన్న ఎగసిపడిన
జాస్మిన్ సెగలు
అంటించిన నిప్పు
రవ్వలు...
ఆకలిగొన్న
పేగుల ఆర్తనాదాలే
పొలి కేకలై
నిద్ర లేచిన మమ్మీల
నో టి నుండి
ఎగసిపడిన ఇసుక
తుఫాన్లో
అవినీతి చక్రవర్తి
ముబారక్
సింహాసనాన్ని
పెళ్ళగించి
ప్రజల పాదాల
చెంతకు
అధికారం
దాసోహమన్న
క్షణం ...
ఇది మరో మారు
విముక్తి పోరాటాల
యుగమని
జన హోరుముందు
మర ఫిరంగులు
బలాదూరని...
ఉత్తుంగ తరంగాలుగ...
ఎగసిపడే
జన కెరటాల తాకిడికి
ఏ రక్షణ కవచాలు
అడ్డు నిలవవని ...
అట్టడుగు జనావళికి
మరోమారు
గుండెనిబ్బరాన్నిచ్చిన
ఎడారి హోరు...
ఎండమావులే కాదు
ఒయాసిస్సులూ
ఉన్నాయన్న
భరోసాకు
జేజేలు....
ఈ వసంతగానం
నేల నాలుగు చెరగులా
వినిపించాలని...
ఈ విజయం
శాశ్వతం కావాలని...
(ట్యునీసియా, ఈజిప్టు ప్రజల ప్రజాస్వామ్య కాంక్షకు మద్ధతుగా)
No comments:
Post a Comment
నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..