Sunday, October 7, 2012

గోడ గొంతుక...

అప్పుడలా...

గోడ పక్కగా నడుస్తూ వెల్తున్నప్పుడు
కనుల ముందు వార్తా పత్రికనో పాఠశాలనో నడయాడేది....

గోడ ఎక్కడో ఒరిగి పోయిన వీరుని చివరి పిలుపు
ఎర్రగా చెక్కి లోలోపల మంటను రగిల్చేది.....

గోడలన్నీ నినాదాల గేయాల బాణీ కడుతూ
తొలి పొద్దు పొడుపున వేకువ గీతాలయ్యేవి....

గోడ యుద్ధ నగారా మోగించే వాయిద్యమై
సరిహద్దులను చెరిపే గొంతుకయ్యేది...

గోడ తెల్లవారి వాడి కంట్లో సూదిలా దిగబడి
గుండెల్లో గుబులు పుట్టించేది....

గోడ అమ్మ పిలుపై కన్న పేగు తీపిని
తట్టి లేపి ఉలిక్కిపడేది....

వేలి చివరలన్నీ రంగు కుంచెలయి
వేల గొంతుకల పిలుపులయ్యేవి....

రెమ్మో కొమ్మో చివరికి బీడీ కూడా కుంచె అవతారమెత్తి 
చిట్లిన వేలి చివరి రక్తపు బొట్టు నినాదమయ్యేది....

ఎర్ర టోపీ వాడికి మస్కా కొట్టి
గోడ చలి రాతిరి వెచ్చని టీ గొంతులో పోసేది....

ఒక్కోసారి వీపును చీరిన లాఠీ
గొంతులో గట్టిగా ఓ మూల్గుతో తిట్టై నవ్వేది....

గోడ ఆత్మీయ మిత్రునిలా
ఆలింగనం చేసుకొని సేదదీర్చే రావి చెట్టయ్యేది....

నేడు...

ఏ గోడ చూసినా బలత్కారంగా నగ్నంగా సిగ్గులేనితనంతో
నిలబడి కనురెప్పలకు మేకులు దిగ్గొడుతోంది.....

గోడలన్నీ వాడి సరకుల బ్యానర్లై నిర్లజ్జగా
అమ్మతనాన్ని సరుకు జేసే సంతలా కూలబడుతున్నాయి....

గోడలకన్నీ మళ్ళీ గొంతునిచ్చి నినదించే
వేకువ కోసం ఆత్రంగా ఆర్తిగా...

15 comments:

  1. బాగా రాసారు ,మీరెందుకు సమాజం పట్ల అంత బాధ్యత తీసుకుంటారు ?మిమ్మలిని ప్రశ్నించే వయసు నాకు లేదు ,కాని ఆగలేకపోయాను ?

    ReplyDelete
    Replies
    1. యువకులైన మీరే అలా అడిగితే No comment...Thank u..

      Delete
    2. యువకుడినే కాని మీరెంత మీ రచనల తో మారుద్దమన్నా మార్పు ను అంగీకరించే స్తితిలో మనం లేము ,అందుకే అల అడిగాను !

      Delete
    3. మార్పు అనేది అంత తొందరగా కనపడదు బయటికి.. అంతర్లీనంగా సాగుతుంది..మీ పేరులోలా..

      Delete
    4. నా బ్లాగ్ పేరులో ఏముంది అండి,నాకు శ్రీశ్రీ అంటే అభిమానం అందుకే పెట్టాను ,ఇంకా నా పేరు శ్రీహర్ష ,వయసు 18 మాత్రమే ,మీరు గారు అనకర్లేదు

      Delete
  2. వర్మాజీ ,చక్కగా వివరించారు అప్పటికి, ఇప్పటికీ ఉన్న గోడ రాతలను
    అప్పుడు ప్రజాస్వామ్యం ఎలా ఉండాలో తెలిపే రాతలు చూసే వాళ్ళం.
    ఇప్పుడు ప్రజా స్వాహా..మ్యామ్మ్యాం ఎలా ఉంటుందో చూస్తున్నాం.
    గోడమీది రాతలు ఒక్కరి గొంతులోనైనా మాటలవ్వాలని రాసేవాళ్ళు.
    ఇప్పుడు కళ్ళలో తూటాలవుతున్నాయి...చక్కటి భావం.

    ReplyDelete
    Replies
    1. మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు ఫాతిమాజీ...

      Delete
  3. కనురెప్పలకు మేకులు దిగ్గొడుతోంది.....వర్మ గారు ఈ లైన్ చాలా చాలా బాగుంది చాల బాగా చెప్పారు గోడలు చూసి తలదించుకునే రోజులివి మీ అంతఃఘర్షణను అక్షర రూపంలో అద్భుతంగా మలచారు

    ReplyDelete
    Replies
    1. మీ అభిమాన స్పందనకు ధన్యవాదాలు skvramesh గారు..

      Delete
  4. each and every line very very nice sir alochimpavchese oka chakkati kavithanu andincharu

    ReplyDelete
    Replies
    1. మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు veenaa lahari గారూ..

      Delete
  5. మీ కవితల్లో పవర్ ఉందని మరోమారు నిరూపించారు:-)

    ReplyDelete
    Replies
    1. మీ అభినందనల స్ఫూర్తికి అభివందనాలు పద్మార్పిత గారు...

      Delete
  6. ఏ గోడను చూసినా మీ కవితే గుర్తుకొస్తుందండి. చాలా బాగారాసారు.

    ReplyDelete
    Replies
    1. మీ అభిమానానికి ధన్యవాదాలు అనికేత్...

      Delete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...