Tuesday, October 30, 2012

సముద్రానికెదురుగా...


సముద్రానికెదురుగా నేను
నాకెదురుగా తను...

ఒక్కో అలా ఎగసిపడుతూ
తీరం దాటనితనంతో మరలుతూ...

మౌన ఘోష చుట్టూ ఆవరించుకున్న
తరగని ఇసుక తీరం...

లోలోతుల ఇంకని ఆశల నురుగు
అలల అంచుల తాకుతూ...

కదలుతూనే వున్నట్టున్న
జడభరితం...

తుఫానులెన్నొచ్చినా
తన పరిథి దాటనితనం...

ఆకాశన్నంటుతున్నా
అందని జాబిలి...

నాకెదురుగా తను
సముద్రానికెదురుగా నేను...

Monday, October 29, 2012

ఆకాశ నేత్రమై...

నువ్వలా సడి లేకుండా వస్తావని
కనురెప్పల వాకిలి తెరచి వుంచా...

అత్తరులా దేహమంతా
పరిమళిస్తావని...

వెన్నెలంత చల్లదనాన్ని
నుదుట చుంబిస్తావని...

వెచ్చని కలవరింతవై
కరుణిస్తావని...

కలల యామినిలా
దరి చేరుతావని...

ఆత్మ బంధమేదో
సంకెల వేయగా....

కన్నీటి నదిని
ఎదురీది....

యుగాల నిరీక్షణ
అంతం చేయగా...

దేహమంతా ఆకాశ నేత్రమై
వేచి చూస్తున్నా.....

Saturday, October 27, 2012

పెలుసుతనం...

దుఃఖం

కనుగుడ్డు పగిలిపోయేట్టు రోదిస్తున్నా
తీరని ధుఃఖ హృదయం...

దేహమంతా అలముకున్న
కమురు చాయలు...

రేయంత చీకటి కమ్ముకున్న
హృదయాకాశం...

ఒక్కసారిగా తెరచాప చినిగి
నడి సంద్రంలో నిట్ట నిలువునా కూలిపోయినట్టు...

రాకడ లేని గుమ్మం
వెల వెలబోయిన పసుపుతనంతో....

చిగురు వేయని మొక్క
ఎండి బీటలు వారిన నేల...

చినుకు పడని మేఘం
ఆవిర్లుగా సుళ్ళు తిరుగుతూ....

జబ్బ సత్తువ కొద్దీ విసిరినా
వొట్టి బోయిన వలలా....

గదినిండా నిట్టూర్పుల
జ్వర పీడనం...

ఈ ఖాళీతనం గుల్లతనం
పెళుసు బారుతూ రాలిపోతూ...

Thursday, October 25, 2012

సడి...

 రాతిరి పూసుకున్న నలుపుతనంలో
నీ కనుల వెలుగు రేఖ...

ఒకింత గుండె సడిని
తరుముతూ కన్నార్పనీయలేదు... 

నీలాటి రేవులో మునిగిన పాదాలను
ముద్దాడిన చేప పిల్ల...

నీటిలో ప్రతిబింబమైన వెన్నెల
నీ మోముపై...

గల గల మాటాడుతూ
నువ్వు వదలిన ఊసుల పడవ...


నీ కనురెప్ప తెరచాపతో
సాగిన ఊహల పయనం...
 

అలల అంచున వీచిన గాలి
చల్లదనం తాకుతూ...

నీ వేలి చివర వెలిగిన
జ్వాల నన్నంటుతూ...

సగం కమ్మిన మబ్బు చాటుకు
చేరిన జాబిలి...

Tuesday, October 23, 2012

ముద్రలు..

అలా ఇసుక తడి లోతులో
నీ పాద ముద్రలు...

గుండె అరలో మిగిలిన
నీ జ్ఞాపకాల ముద్రికలు...

అలల కోతకు చెరగని
తీపి గురుతులు...

యింకా పరిమళిస్తూనే వున్న
నీ జడ సాంబ్రాణి ధూపం...

రిబ్బను చివర వేలాడుతున్న
మందార పుష్పం...

నీ చుట్టూ ఓ వెలుగు
మంత్రపు వలయం....


నేనిలా

ఒంటరిగా యిలా యిసుక
రేణువులను ముద్దాడుతూ....

Monday, October 22, 2012

పునీతమవ్వాలని..

Photo: నాన్న భుజాలపై నుండి చూసిన ప్రపంచం
నేడు చిన్నబోయింది...

ఆసరాగా నిలిచిన పాదు కొయ్య విరిగి
నేల రాలినట్టు...

నాన్నా కనులలోంచి దొంగిలించబడ్డ కాంతి
నా చుట్టూ చీకట్లను ముసిరింది...

యిదంతా ఓ వలయమని
నిన్నా రేపుల మాయయని
నవ్వుతూ నువు చెప్పిన మాట
యాదికొచ్చినప్పుడంతా ఎద కోతకు గురవుతుంది....

నాన్నా మరొక్క సారి
యిటు తిరగవూ!!

నీ పాదాలు తాకి పునీతమవ్వాలని...
నాన్న భుజాలపై నుండి చూసిన ప్రపంచం
నేడు చిన్నబోయింది...

ఆసరాగా నిలిచిన పాదు కొయ్య విరిగి
నేల రాలినట్టు...


నాన్న కనులలోంచి దొంగిలించబడ్డ కాంతి
నా చుట్టూ చీకట్లను ముసిరింది...

యిదంతా ఓ వలయమని
నిన్నా రేపుల మాయయని
నవ్వుతూ నాన్న చెప్పిన మాట
యాదికొచ్చినప్పుడంతా ఎద కోతకు గురవుతుంది....

నాన్నా మరొక్క సారి
యిటు తిరగవూ!!

నీ పాదాలు తాకి పునీతమవ్వాలని...

Thursday, October 18, 2012

నిర్జన వంతెన....

ఈ నిర్జన వంతెన అంచున
ఒక్కో దారప్పోగునూ పేనుతూ
అక్షరాల అల్లికలల్లుతూ
పదాల మధ్య బందపు కండెను జార్చుతూ
ఒలికి పోకుండా పట్టుకొనే ఒడుపు కోసం నిలబడి వున్నా....

ఏదీ అంటనితనమేదో యిలా ఒంటరిగా
మిగిల్చి పాదాలను రాతి తాళ్ళతో బంధించి
దేహాన్ని ఇలా వదిలేసి పోయింది....

మనసు మూగతనాన్ని నింపుకొని
గ్లాసు నిండుగా ఒంపినా గొంతుదిగని మత్తు....

యుద్ధానంతర నిశ్శబ్ధపు నీరవం
చుట్టూరా పొగల సుళ్ళుగా  అల్లుకొని
అస్తమయ వెలుగులో కాసింత రంగునిచ్చి
కనులలోయలో ఒరిగిపోతు....

దూరంగా జరుగుతున్న మేఘాల రాపిడికి
అక్కడక్కడా మెరుస్తూ ఓ వాన చినుకు
కన్రెప్పపై జారిపడి వెచ్చగా గొంతులో దిగుతూ
గుండె మూలల ఖాళీని కాసింత కప్పే కఫనవుతూ....

దేనికదే ఒక అసంపూర్ణత్వం కలగలిసి
నలుపు తెలుపుల చిత్రంగా గోడనతుక్కొని
కలవని గీతల వలయంలా మారుతూ
వెక్కిరిస్తూ ఎదురుగా అలా నిలబడుతూ....

ఎక్కడో ఓ సన్నని నాదం విరిగిన వెదురు పొద మీంచి
గాలిని కోస్తూ శబ్ధావరణాన్ని సృష్టిస్తూన్న
వాతావరణంలో గాయాన్ని సలపరమెట్టిస్తూ.....

Wednesday, October 17, 2012

అభినందన ముద్ర...


 
రేయంతా నీ ధ్యాసలో గడిపి
గుండె ఊసులన్నీ నీ మదిలో వేసి
నీ పెదవి మౌనాన్ని ఓ అభినందన ముద్రతో మేల్కొలిపి
నా ఆశ తీరగా నిను అల్లుకొని
నీ మెడవంపున చిగురించిన
కోరిక నరాన్ని పంటితో పట్టి చక్కిలిగిలి పెట్టి
వలపునంతా వడపోస్తూ
స్వరరాగమెట్టు ఎక్కుతూ దిగుతూ
అల్లరి వల్లరి పల్లవిగా నీ గొంతులో పలుక చేరరాగా


పో
రా,,, 
అంటూనే
గుండెలో ఒదిగిపోయిన
నీ పాపిట చుంబన సింధూరమై
మధుర ఉదయ గీతికనాలపించనా.....

Monday, October 15, 2012

అంటు....


నువ్వు ముక్కలుగా నరికి పారేసాననుకున్నావు
కానీ అంటుకట్టే మా చేతుల్లో మళ్ళీ మళ్ళీ ప్రాణం పోసుకుంటునే వుంది...

ఒక్కో గాయానికి వరుసగా పసరు మందేదో
కట్టు కట్టినట్టు తెగిన చోటల్లా చిగురు వేస్తూనే వుంది...

గొంతును చీలుస్తూ దిగబడ్డ చోట
మరల పాట కడుతూనే వున్నాం....

నువ్వు విరిచి పారేసాననుకున్న పాదాలన్నీ
నేడు కదంతొక్కుతూ దండయాత్రకై కదలబారుతున్నాయి....

(లక్ష్మీపేట బాధిత దళితులతో కలసి నడచిన వేళ...)

Thursday, October 11, 2012

సమ్మెతనం!!!

 ఒక్కోసారి ఎక్కడికక్కడ సమ్మెతనం
సమ్మెటలా గుండెపై బరువుగా....

దగ్గరయినది దూరంగా నెట్టేస్తున్నట్టు
సుడిగాలేదో చుట్ట చుట్టుకుపోయి పారబోసినట్టు....

నేలనానిన పాదాలు ఎక్కడివక్కడే
ఊబిలో కూరుకు పోతున్నట్టు కదలనితనం....

రాతిరేదో దిగాలుగా కమ్ముకొని
ఇన్ని నిప్పు ఉసుళ్ళు నెత్తిన కుమ్మరించినట్టు....

పగలంతా ఓ పక్కకు ఒరిగిపోయిన
ద్వీపంలా మునగీ మునిగనట్టు ఊపిరిసలపనితనం....

ఆకు చివురును వేలాడిన
సాలీడు తీగనంటుకున్న కీటకంలా త్రిశంకు స్వర్గంలో....

గాలి ఆడనితనంతో దేహమంతా
చెమట కమ్ముకొని కొలిమి తిత్తి చివురులా...

నీ రాక కోసం ఈ ఎడారినంటిన ఎదలో
ఓ మాట చినుకరింపు కోసం....

Wednesday, October 10, 2012

శిల్పతనం....


నిదుర రాని నీ కనురెప్పల వాకిట
కలల తేరులో వేచి చూస్తున్నా...

మనసున నిండిన నీ రూపం
హృదయాకాశంలో వెన్నెల పరువం...

తాకని నీ వేలి చివరి జ్వాల
గుండె అంచుల రాగదీపం....

దారం కూర్చని సన్నజాజులు
నీ మెడ వంపులో ముత్యాల హారం....

దేహమంతా ఎగసిపడే అగ్నిపర్వత
సానువులా నీముందు....

హిమాలయమంత నిబ్బరంగా
నిశ్చలంగా నీవు....

కదలని ఈ శిల్పతనం
కరగిపోదా నీ చిరునవ్వు కానుకగా...

Sunday, October 7, 2012

గోడ గొంతుక...

అప్పుడలా...

గోడ పక్కగా నడుస్తూ వెల్తున్నప్పుడు
కనుల ముందు వార్తా పత్రికనో పాఠశాలనో నడయాడేది....

గోడ ఎక్కడో ఒరిగి పోయిన వీరుని చివరి పిలుపు
ఎర్రగా చెక్కి లోలోపల మంటను రగిల్చేది.....

గోడలన్నీ నినాదాల గేయాల బాణీ కడుతూ
తొలి పొద్దు పొడుపున వేకువ గీతాలయ్యేవి....

గోడ యుద్ధ నగారా మోగించే వాయిద్యమై
సరిహద్దులను చెరిపే గొంతుకయ్యేది...

గోడ తెల్లవారి వాడి కంట్లో సూదిలా దిగబడి
గుండెల్లో గుబులు పుట్టించేది....

గోడ అమ్మ పిలుపై కన్న పేగు తీపిని
తట్టి లేపి ఉలిక్కిపడేది....

వేలి చివరలన్నీ రంగు కుంచెలయి
వేల గొంతుకల పిలుపులయ్యేవి....

రెమ్మో కొమ్మో చివరికి బీడీ కూడా కుంచె అవతారమెత్తి 
చిట్లిన వేలి చివరి రక్తపు బొట్టు నినాదమయ్యేది....

ఎర్ర టోపీ వాడికి మస్కా కొట్టి
గోడ చలి రాతిరి వెచ్చని టీ గొంతులో పోసేది....

ఒక్కోసారి వీపును చీరిన లాఠీ
గొంతులో గట్టిగా ఓ మూల్గుతో తిట్టై నవ్వేది....

గోడ ఆత్మీయ మిత్రునిలా
ఆలింగనం చేసుకొని సేదదీర్చే రావి చెట్టయ్యేది....

నేడు...

ఏ గోడ చూసినా బలత్కారంగా నగ్నంగా సిగ్గులేనితనంతో
నిలబడి కనురెప్పలకు మేకులు దిగ్గొడుతోంది.....

గోడలన్నీ వాడి సరకుల బ్యానర్లై నిర్లజ్జగా
అమ్మతనాన్ని సరుకు జేసే సంతలా కూలబడుతున్నాయి....

గోడలకన్నీ మళ్ళీ గొంతునిచ్చి నినదించే
వేకువ కోసం ఆత్రంగా ఆర్తిగా...

Saturday, October 6, 2012

ఏమవుతావో!!


నాకేమవుతావో నువ్వని
చిలిపిగా అడిగితే ఏమని బదులీయను...

నాలో సగమైనావని
నా ఊపిరిలో భాగమైనావని
నా కనులలో కాపురమున్నావని
నా ఎదలో కొలువైనావని
నా మనసునిండా నువ్వే వున్నావని చెప్పనా?

నీ ఎడబాటు భరించలేనంత బేలగా మారానన్నది
నీ గుండెకు తెలియదా చెలీ...

మన పరిచయం చిగురించిన నాటి నుండి
ఓయ్ అన్న నీ పిలుపు గుండెలో అల్లరి చేస్తుంది...

ప్రియతమా!
నీ ఊసుల ఊహల ఊయలలూగు ప్రతి క్షణం నాకు పరవశమే...
Related Posts Plugin for WordPress, Blogger...