Saturday, September 29, 2012

మౌనం..


ప్రియమైన మౌనమా
నువ్వింత శిలాకారమా...

నిశ్శబ్ధం నిరామయతనం
సమాధితనం కాదా....

ఒంటరితనం వెంటాడే
ఖాళీతనంకంటే కరకుతనముందా....

సవ్వడి చేయని మువ్వ
గాలినికోస్తూ పగుల్లబారుతూ...

గడ్డకట్టిన కాలం అంచున
మంచుబారుతూ...

రెక్కరాలిన పువ్వొకటి
నొసటిపై మృధువుగా తాకుతూ...

ఈ నిషాద నీరవ నిశ్శబ్ధాన్ని
చీలుస్తూ తెగిపడిన తీగ...

గొంతుకడ్డంపడ్డ వాగ్థానం
ఉరిముడి పడుతూ ఊపిరిసలపనితనం..

Saturday, September 22, 2012

చిల్లర మాయం

అలికిడి వినపడకుండా
పిల్లి కాళ్ళ పంజాతో
నడి బజార్లోకి సరకు సరఫరా...

నీ జేబు చీల్చుకుంటూ
వాడి చెయ్యెప్పుడో చొరబడింది
ఖాళీ తనం నిన్నింక వెక్కిరిస్తుంది
కుక్క నోట్లో బొమికలా....

నీ బెటరాఫ్ పుస్తెలమ్మినా
తీరని బాకీతో నడి వీధిలో
నీ నెత్తిపై రూపాయి బిళ్ళ పెట్టి
అర్థ రూపాయికి పాట....

పొయి మీద పాలు పొంగక ముందే
ఆరి పోయిన గ్యాస్ బండ
కోటా పూర్తయి వెక్కిరించింది...

చిల్లర కొట్టు చిట్టెమ్మ
వాకిట్లో నుదుటిపై పాలిపోయిన
పసుపు బొట్టుతో నోట్లో తులసాకు....

ఒక్కోటీ అదృశ్యమవుతూ
ఏదీ మిగలనితనంతో
నీకు నీవే ఓ హాలోమెన్ లా
చివరాఖరకు ఆత్మను కోల్పోయి....

నువ్వింక మేల్కొనక పోతే
నీ కంటి రెప్పలను కత్తిరించి
కలలను కూడా LED తెరకు అతికిస్తారు...

సొంతమంటూ ఏదీ లేనితనం
నిన్ను ఓ బ్రాండ్ అంబాసిడర్
చేతిలో ఖాళీ కోక్ డబ్బాలా పీల్చి విసిరేస్తుంది....

దేహమంతా తొడగబడ్డ
విదేశీ కండోమ్ ను చీల్చుకు రారా
కాలం నిన్ను అనకొండలా మింగి ఉమ్మివేయక ముందే....

Wednesday, September 19, 2012

వాడు...

వాడు నవ్వడు
వాడు ఏడ్వడు
వాడు కదలబారే ఓ వానపాములా కనిపించే అనకొండ....

వాడి గాజు కళ్ళ చాటున
ఓ మహా విస్ఫోటనం దాగుంది...

వాడు కోట్లాది ప్రజల
ఆకలి మంటల మూలవిరాట్టు....

వాడికొక్కటే కోరిక
ఈ గొంతులన్నిటిపై డేగ కాళ్ళను గుచ్చాలని....

వాడికొకటే ధ్యాస
ఇక్కడి అమ్మ పాలను సంతలో అమ్మేయాలని....

వాడికి వున్నదొకటే లేపన శక్తి
పడిపోయిన మార్కెట్ మాయా రేఖల పురోగమనం....

వాడి మొఖాన అంటిన బొగ్గు మసిని
అందరి జీవితాలపై మండించి ఆనందించే కౄర రక్కసి...

వాడొక నిశ్శభ్ద డ్రాక్యులా
జనం మూలుగులను నొప్పి తెలీకుండా పీల్చేసే జలగ సిరంజీ....

వాడు అమ్మ గర్భంలో దాగిన పిండాన్ని
నోట కరచుకు పోయే తోడేళ్ళ గుంపు నాయకుడు

వాడు రణస్థలం నుండి కూడంకుళం దాకా అణు విస్ఫోటణం
చేయ చూస్తున్న రాకాసి డేగ ముక్కున వేలాడే శవం....

వాడొక ప్రేతాత్మ
వాడి అంత్యక్రియలనాడే ఈ దేశానికి కళ్యాణం....

Tuesday, September 18, 2012

'మట్టితనం' కవిత ఆంగ్లానువాదం..

Soil-ness (మట్టితనం)

Come to us
opening heart's windows, walking,
come and join with us, the muddy men

Fill your nostrils with this smell of soil
that your ancientness buried in remote nerves
shall be woken

Touch my telluric hand with dearest respect
that your static-ness will burst
into many pieces of sand

Let us share our shoulders and carry the weight
so the pain of your mother, while pregnant
can be known

Let us raise our throat and cry together
that the inner pain will be blessed

Be with us, with the muddy people
the desert of loneliness will be vaporized
and a river licks your feet

Spill all your colors and
dip your paint brush into this ground color
that the humaneness within will burn bright

Stretch your body like hand
that the the fragrance of humanity spreads

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

Original~ Kumar Varma Kayanikorothu

Translation~ Ro Hith
(నాకు ఫేస్ బుక్ లో మిత్రుడైన రోహిత్ అనువదించారు..ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటూ)


Monday, September 17, 2012

ఓదార్పు సంతకం...


అలసినప్పుడు
గాలి తిమ్మెరలా తాకుతావు...

దాహం వేసినప్పుడు
అమృతపు చినుకువై కురుస్తావు...

ఒంటరితనం ఆక్రమించినప్పుడు
భుజంపై చేయివౌతావు....

అడుగు పడని నడకలో
జతగా పాదం కలుపుతావు....

గొంతు పెగలని పాటలో
రాగమై పల్లవిస్తావు....

వర్షించే కను రెప్పలపై
ఓదార్పు సంతకమౌతావు....

నలుపు తెలుపు కలల తెరపై
రంగునద్ది జీవం పోస్తావు....

నేస్తమా చివరి ఊపిరిదాకా
ఈ తడి ఆరనీయకు...
.

Sunday, September 16, 2012

కనబడుట లేదు....

అవును నువ్వు కనబడక
ఇలా గోడ మీద బొమ్మవయ్యావు....


నీ కన్న పేగు ఎన్ని పస్తులుందో!
నీ తండ్రి చేతిలో పని పడక గుండె నరం కోత పెడుతుంది....

నీ ఇంటి గుమ్మం
కన్నీరు కారుస్తూ తెరచుకున్న కంటి రెప్పయింది...

బాబూ!
నీ చిరునామా లేని నడక ఎందాక?

ఏ నిరాశ మబ్బు నిన్ను కమ్ముకొని
నిర్వేదపు సుడిగాలి నీ రెక్క పట్టుకు ఈడ్చుకు పోయిందో...

కనడని నీ రూపం
యిలా గోడపై చిత్రమై నా కలంలో కన్నీటి సిరా అయింది...

రారమ్మంటున్న
నీ ఆత్మీయుల పిలుపు నీ ఎదకి చేరాలని ఆశిస్తూ....

(
ఇలా గోడమీద కనబడుటలేదు అన్న ఫోటో చూసినప్పుడంతా మనసులో కలిగే భావం)

Thursday, September 13, 2012

నిశ్శబ్ధాలాపన..


ఒక్కో అక్షరమూ దేనికదే విడివడి
అంటిన రక్తపు మరకల జిగురును వదిలించుకుంటుంటే...

మగ్గంపై నేస్తున్న నార వస్త్రంలా
ఒక్కో దారప్పోగూ దేనికదే చిక్కుముడిలా...

అద్దుతున్న ఏ రంగూ
కుంచెనుండి కాగితంపై ఒలకక....

ఒడ్డున కాలికంటుతున్న ఇసుక రేణువుల్లా
దేనికదే శిలలా కరగనితనంతో...

దోసిలి సందులలోంచి ఒక్కో నీటి బొట్టూ
జారిపోతూ తడి ఇగిరిపోతూ....

గాలి వీయనితనమేదో
గుండె అరలలో ఉక్కపోతను ఆరబెడుతూ...

మూగబోయిన గొంతు నుండి సన్నని జీరలా
ఓ రాగం తనలో తానే ఇంకిపోతూ నిశ్శబ్ధాన్ని ఆలపిస్తూ...

Sunday, September 9, 2012

దేహపు విల్లు...

తప్పొప్పుల తడిక చాటున దాగి
లోలోపల అగ్ని పర్వతాన్ని
ఉఫ్ మంటూ ఊదేసే వృధా ప్రయత్నమెందుకు....

మనసు నిండా నిండిన భావాన్ని
వ్యక్త పరచడానికి సాకులు వెతుక్కోక
మూసిన కున్రెప్పలను తెరచి చూడు
కనుల నిండా ఇంద్ర ధనస్సులే....

కలల్లో కలవరిస్తూ పలవరిస్తూ
మనసు ఐ మూలల దాగిన
కోరికల బుసలను తలపై మోదుతూ
చంపేయడమెందుకు??

రానీయనీ లోలోపలకి
ఎంత ఆస్వాదించ గలిగితే
అంత జీవితాన్ని ఆమూలాగ్రం
పిడికిట పట్టి గుండెల్లో పొదువుకోవాలి.....

నీ చూపు మేరా పరచుకున్న పచ్చదనాన్ని
వెచ్చని సూర్య కిరణాల ప్రతిఫలనంలో
మెరుస్తున్న ఆ లేలేత అందాలను
కంటి వెనకాల వెండి తెరపై బంధించి చూడు....

దేహాన్ని విల్లులా సారించి
నీ కోరికల బాణాన్ని సంధించు
అణువణువు ఆస్వాదించు
నేడున్న క్షణం మరుక్షణం మాయమవుతున్న
కాలబలం నిన్ను వెంటాడక ముందే....

కుళ్ళి కృశించి నశించే కంటే
అగ్నిశిఖలా కాలుతూ మెరుస్తూ
ఆకాశమంతా ప్రకాశిస్తూ
క్షణకాలమైనా బతికి చూడు....

గుండె నిండా ఊపిరి తీసుకొని
అడుగు వేయి
చీత్కరించిన లోకమే
నీకు దాసోహమవుతుంది....

Friday, September 7, 2012

గోరంత రంగుని....

ఖాళీతనాన్ని నింపుకున్న కళ్ళు
చూపు తిప్పనివ్వక
కాసింత రంగునొలకబోసాయి....


అప్పుడప్పుడూ ఇలా
కొంత రంగునద్దుకోవడం
కొత్త ఊపిరినిస్తుంది కదా...


రా..
ఇలా కుంచెనంటిన
వెచ్చదనాన్ని
గోరంతైనా గుండెనింపుకుందాం...

( ఈ ఆర్ట్ చూడగానే కలిగిన భావం)

Thursday, September 6, 2012

మువ్వల సవ్వడి...

నీ మనసు
నీ వేలి చివర మెరుస్తోంది...

అలా తాకగానే
గుండెలో పరిమళిస్తూ....

రారమ్మని నీ పిలుపు
నీ ఊపిరి స్వరంలో వినిపిస్తోంది...

ప్రియా!
అలిగిన వేళ
నీ అరిపాదంపై నా కన్రెప్పల
స్పర్శతో చక్కిలిగిలి కానా??

రహస్యాలన్నీ పాతరేసి
మనసు ఐమూలల దాగిన
భావ ప్రకంపనలను పంచుకో చెలీ...

నీ పాపిట తాకిన
నా పెదవినంటిన సింధూరం
నీ కళ్ళలో జ్వలిస్తూ
వెచ్చని ఆవిరిలూదుతోంది....

నా గత జన్మల బాకీనంత తీర్చగ
నా గుండె లయలో ఆలాపన కావా??

రాగ రంజితమైన వేళ
వెన్నెల స్నానమాడుతూ
నీ కాలి మువ్వల సవ్వడినవుతా....

Monday, September 3, 2012

డర్టీ పిక్చర్...

కాళ్ళకు కలల చక్రాలు తగిలించుకొని
మోహపు దుప్పటి కప్పుకొని
నింగిలో తారలా మెరవాలని
మెరీనా వైపు ఎఱంచు నల్ల పరికిణీతో పరుగులిడి
నీటిని వీడిన చేపలా
కంగారుగా వచ్చి
వెండి తెరపై దేహపు కళ్ళను పరిచి
ఎందరికో నిద్ర లేని రాత్రుళ్ళు పంచి
నీ నవ్వు నడుము వంపు వయాగ్రాలా మింగిన
ఈ లోకం నిన్ను దహిస్తూ శాపగ్రస్తురాలైంది...

నిద్రకు వెలియై మనసు మంచు గడ్డ కట్టి

అసూయపు కత్తులతో వెన్నంతా గాట్లుపడి
ఒక్కదానివే కుప్పలా పడి
నేలలో ఇరిగిపోయిన నీ ఉచ్వాశ నిశ్వాశల వేడికి
వీడ్కోలు కనీటి వీడ్కోలు ఓ అప్రియ నేస్తమా...

(నిన్న డర్టీ పిక్చర్ చూసి కళ్ళు చెమర్చి యిలా సజీవ నటి సిల్క్ స్మితకు నీరాజనాలతో....జయహో విద్యాబాలన్)

Saturday, September 1, 2012

నిప్పు ఊట..

నా ఆలోచనలెవరో దొంగిలిస్తున్నారు
ఒక్కొక్కటిగా....

తెరచిన కిటికీ గుండా ఓ మబ్బు తెరలా
లోలోన కురుస్తూ....

లోలోపల తడి గుండె మంటకు
ఆవిరవుతూ ఎండకాస్తూ....

రాతిరంతా ఓ మాట నిప్పు ఊటలా
భగ్గుమంటూ...

కప్పుకున్న కలల దుప్పటి
కమురు వాసనేస్తూ....

గుండెల కుంపటి మంట
కనురెప్పలను ఆరబెడుతూ....

దాచుకున్న నెమలీక ఒక్కోటీ
బూడిదౌతూ....

నాకు నేనుగా అల్లుకున్న కతల
పుటలు జ్వలిస్తూ....

ఆలోచనల కొలిమి తిత్తి ఎగదోస్తున్న
నిప్పురవ్వల చిగుళ్ళు నర్తిస్తూ....

కుంచెకంటిన రంగు చిత్రానికి
మంటనద్దుతూ....

కమ్ముకుంటున్న కారు మబ్బుల చినుకు
నిట్టూర్పుల ఆవిరౌతూ....


నా చుట్టూ చితి మంటల
ఊలలు నాదమౌతూ నన్నావహిస్తూ...
Related Posts Plugin for WordPress, Blogger...