Tuesday, August 28, 2012

మట్టి తత్వం...

రా...
నడుస్తూ గుండె తలుపులు తెరుస్తూ
మట్టి మనుషుల మధ్యకు రా...

మట్టి వాసనను ముక్కు పుటాలనిండా పీల్చు
నీ ఆదిమతనం బయల్పడుతుంది...

మట్టి చేతిని ఆత్మీయంగా తాకి చూడు
నీ రాతితనం బద్ధలవుతుంది....

భుజం భుజం కలిపి భారాన్ని పంచుకో
నవమాసాల బరువు గుర్తుకొస్తుంది...

గొంతు విప్పి బిగ్గరగా మాట కలుపు
హృదయాంతరాళంలోని గాయం సలుపుతుంది...

మట్టి మనుషులతో నడయాడు
ఒంటరితనపు ఎడారి దూరమై నది నీ కాళ్ళను స్పృశిస్తుంది...

రంగులన్నీ పారబోసి మట్టి తనాన్ని అద్దుకో
మనిషితనం వెలుగు నింపుతుంది...

దేహమంతా చేయి చేసి చాచు

మట్టితనం నీలోని మానవతా పరిమళాన్ని విరజిమ్ముతుంది

16 comments:

  1. "మట్టి చేతిని ఆత్మీయంగా తాకి చూడు నీ రాతితనం బద్దలవుతుంది."
    మట్టి మనుషులతో నడయాడు
    ఒంటరితనపు ఎడారి దూరమై నది నీ కాళ్ళను స్పృశిస్తుంది...
    వర్మాజీ, అద్బుతమైన ఆవేదన, ఆర్ద్రత, మీరు కాక ఎవరు రాయలేరమో.. ఇంత బాగా అనిపించేలా రాశారు.
    బాగుంది, చాలా బాగా రాసారు......మెరాజ్.

    ReplyDelete
    Replies
    1. మీ ఈ మెచ్చుకోలు నాకు స్ఫూర్తినిస్తోంది ఫాతిమాజీ...ధన్యవాదాలు..

      Delete
  2. అన్ని వాక్యాలు ఆణిముత్యాల ఉన్నాయండి
    ప్రతి లైన్ ఒకో కొరడా ఝలిపించినట్లుందండి
    అభినందన మందారమాల అందుకోండి....


    ReplyDelete
    Replies
    1. సృజన గారూ మీ అభినందనలు పొందడం హాపీగా వుందండీ..థాంక్యూ వెరీ మచ్..

      Delete
  3. మట్టితనంలో ఉన్న స్వచ్చత ప్రస్తుతం మనిషితనం లో వెతుకు లాడాల్సివస్తుంది.
    మట్టి మనుషులతో నడయాడు
    ఒంటరితనపు ఎడారి దూరమై నది నీ కాళ్ళను స్పృశిస్తుంది.
    మంచి కవితా ప్రయోగం .

    ReplyDelete
    Replies
    1. రవిశేఖర్ గారూ మీరన్నది నిజమే..మనిషితనానికి దూరమవుతున్నాం అనేదే...
      మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు సార్..

      Delete
  4. చాలా బాగుంది వర్మ గారూ!
    మట్టి వాసనను ముక్కు పుటాలనిండా పీల్చు
    నీ ఆదిమతనం బయల్పడుతుంది...

    సహజత్వానికి ఎంత దూరంగా వెళ్ళిపోతే..
    అంత అసహజంగా ప్రవర్తిస్తాం...
    అభినందనలు మీకు...
    @శ్రీ

    ReplyDelete
    Replies
    1. మీ ఆత్మీయాభినందనలకు ధన్యవాదాలు శ్రీ గారూ...

      Delete
  5. ఈ మానవతావిలువల మట్టితత్వాన్ని అర్థం చేసుకోలేని మనిషి బ్రతికున్నా కూడా మట్టిలో కలిసినట్లే!
    ఇలాంటి అద్భుతమైన భావాలని పలికించడంలో మీది అందెవేసినచేయి...అభినందనలు!

    ReplyDelete
    Replies
    1. నిజమేనండీ పద్మార్పితగారూ...మట్టికి దగ్గరయ్యే దాకా దాని విలువ తెలియనితనం మనల్ని వెంటాడుతూ మనల్ని మనకు దూరం చేస్తోంది..
      మీ ఆప్త వాక్యం స్ఫూర్తిదాయకం నాకు...ధన్యవాదాలు...

      Delete
  6. వర్మ గారు!
    మట్టి తో జట్టుకట్టడం మనకు బట్ట కట్టడం తోనే మొదలు. మట్టి లో కలసినా వీడని బంధం కదా!!
    ప్రకృతి నుంచి దూరం గా బతికే వేల బతుకులకు.. జీవితం తుది మొదళ్ళను చూపించారు.. మెదళ్ళలో మట్టీ కాని దానిని అదిలించారు. మట్టి చేతులతో హత్తుకోవాలని.. [తెల్లచొక్కావేసుకున్నా సరే !! కాలం కలిపి నప్పుడు మరువకు నేస్తమా..:)))]

    ReplyDelete
    Replies
    1. తప్పకుండా సతీష్..మీ మల్లెలంటి నవ్వు అలా ప్రకాశిస్తుండనివ్వండి...అలాయి బలాయి చెప్పుకుందాం ఎన్నెన్నో జ్నాపకాల నెమలీకలను కాసిన్ని అక్షరాల బియ్యపు గింజలతో బతికించుకుంటూ...

      మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు...

      Delete
  7. తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు.మట్టివాసన గుభాళింపుకి అభినందనలు

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలతో పాటు మీకు కూడా తెలుగు భాషా దినోత్సవ శుభాభినందనలు భాస్కర్జీ...

      Delete
  8. మట్టివాసనలోని తత్వాన్ని చాలా బాగాచెప్పారు. అర్థం చేసుకుంటే ఎంతో ఔనత్యం ఉందని.

    ReplyDelete
    Replies
    1. నా ఆవేదనను అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు యోహాంత్...

      Delete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...