Sunday, August 5, 2012

ఊరు...



ఊరు విడిచి వెళ్ళ బుద్ది కాదెందుకో..

అవును పురిటి వాసనేసినప్పటినుండీ
అలవాటైన ఈ నేల ఈ గాలి ప్రతి శ్వాశలోను
ఇంకి దేహమంతా పరిమళిస్తూంది....

ఇవే ముఖాలు ఇవే మాటలు
అవే యాస అవే జీవితాలు
అవే అనుబంధాలు అవే స్నేహాలు
అవే కోపాలు అవే తాపాలు
అవే కొమ్మలు అవే కొండలు
అవే నదులు అవే రహదారులు
అదే రుచి అదే కమ్మదనం
అదే అమ్మతనం
అలా అంటుకు పోయిందెందుకో...

తెగని ఈ బంధం
ఎడబాటుకు ఓర్వలేదెందుకో
ఈ నెమ్మదితనం ఈ అమాయకత్వం
అలా గుండె చుట్టూ వెలుతురు గూడు కట్టుకున్నది...

ఏదో వలస పక్షిలా అద్దె రెక్కలతో ఎగిరి
ఆ నగరపు జనారణ్యంలో ఒక్కసారి
తిరిగి వచ్చినా ఇమడలేనితనం...

ఏదో పరాయితనం వెంటాడుతూ
పరుగులు పెట్టిస్తున్న ఆ పయనం
నిలవనీయదు ఆ కాంక్రీటు జంగల్ మధ్యన....

ఈ కాకి పిలుపు లేని ఉదయం తెల్లారనీయదు...
ఇక్కడి ఆవు అంబా అంటూ ఆప్యాయంగా
నాలుక చాపుతూ లేగ దూడను సాకేతనం అగుపడక
పాకెట్లలో బందీకానితనం పరుగులు పెట్టిస్తుంది....

ఇక్కడి వేప పుల్ల తీయదనం
పెదవుల చివరంటా రుచిస్తూ స్పృశిస్తూంది...

ఆకలి దప్పు;లు సహజంగా స్వీకరించే గుణం
ఎందుకో అడుగు బయటపడనీయదు...

ఈ నేలతో పేగు బంధం విడదీయరానిదిగా
ఏదో ఋషిత్వాన్ని ఆపాదిస్తూ
ముందరి కాళ్ళకు బంధం వేస్తూంది....

ఈ అమ్మతనం దూరం కానీయకు...


6 comments:

  1. వర్మాజీ, అత్మీయగా అనిపించే అమ్మతనాన్ని గుర్తుచేసిన మీ కవిత చాలా బాగుంది." నవ్య" లో మీ "కలలనేత " కవిత బాగుంది,

    ReplyDelete
  2. ఇంత అనుబంధం పెంచుకున్నా ఊరుని వదలమని మేముకూడా అనములెండి:)

    ReplyDelete
    Replies
    1. Aunaa antenaa.. Adigite mee urochestaanani bhayamaa..:) thanq Aniketh

      Delete
  3. బాగా అనుభంధం పెంచుకున్న ఊరి మీద బాగా మమకారం ఉండి, వదలబుద్ధి కాదు..

    ReplyDelete
  4. మీరు వ్రాసింది అక్షరమక్షరం నిజం.పల్లె కన్న తల్లి లాంటిది.మీ కవిత అత్యంత సహజంగా సాగింది.

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...