Sunday, August 26, 2012

వెలుతురు పిట్టలు...

అలా ఓ చాప చుట్టలో ఎర్రటి ముద్దలా
నువ్వొచ్చి వెలుగుతున్నప్పుడు....

అంతా గుమిగూడి నీ పేరు చుట్టూ
ఓ గేయాన్ని ఆలపిస్తున్నప్పుడు...

అమ్మ తన కంటి ధారను రెప్పల మాటున
ఉగ్గబట్టి నీ కనుపాపలు ముద్దాడుతున్నప్పుడు...

నీ ఒంటి గాయాలను తడుముతు వేళ్ళ చివరి అంచుల
నాన్న వెన్నపూసవుతున్నప్పుడు...

ఆమె దు:ఖాన్ని గొంతులో సుళ్ళుతిరుగుతుండగా
నేలపై నీ పేరును ముగ్గు వేస్తున్నప్పుడు...

గోధూళి వేళ లేగ దూడ మూగగా
తల్లి పొదుగును చేరక దిగులుపడుతున్నప్పుడు...

తూర్పు వాకిట కాకులన్నీ గుంపుగా
నీ చావు అబద్ధమని చాటుతున్నప్పుడు...

వెలుతురు పిట్టలు నీ గుండెలపై
ఎర్ర వస్త్రం అలంకరిస్తున్నప్పుడు....

నెత్తురు చిమ్మిన ముఖంతో సూరీడు రేపటి ఉదయాన్ని
వాగ్ధానం చేస్తూ నేల తల్లి ఒడిలో వాలిపోతూ.....

12 comments:

  1. WOW! Superb!
    చాలా బాగుందండి వర్మ గారు. మీ కవితలన్ని పుస్తకం లా పబ్లిష్ చెయ్యండి..ఆ విషయం మరచినట్టున్నారు.

    ReplyDelete
    Replies
    1. థాంక్యూ జలతారు వెన్నెలగారూ...
      ఈ సంవత్సరాంతానికి వేసే ప్రయత్నంలో వున్నాను..మీ ప్రోత్సాహానికి సదా కృతజ్నున్ని...

      Delete
  2. చాలా బాగుంది వర్మ గారూ!

    నెత్తురు చిమ్మిన ముఖంతో సూరీడు రేపటి ఉదయాన్ని
    వాగ్దానం చేస్తూ నేల తల్లి ఒడిలో వాలిపోతూ
    అభినందనలు మీకు
    @శ్రీ

    ReplyDelete
    Replies
    1. మీ అభిమాన స్పందనకు ధన్యవాదాలు శ్రే గారూ..

      Delete
  3. వర్మాజీ, ఏమిచెప్పను బాగుంది అనలేను.
    కవిత బాగుంది కానీ ఓ త్యాగానికి ఓ ప్రాణం సమిది కావటం బాగుండదు కదా.
    ఓ ఆశయం కోసం , ఓ ద్యేయం కోసం అర్పణ కావటం అందరూ చేయలేరు.
    కానీ ఈ సూర్యులు ఎప్పుడూ అస్తమించరు. మళ్ళీ ,మళ్ళీ ఉదయిస్తారు.
    మీ అక్షరాలలో వేదన కనిపిస్తుంది. ఇలా రాలిపోయే తారకలెన్నో,
    ఆరిపోయే దీపాలెన్నో. వారివెనుక ఆశయం గొప్పదైతే అదే ఇంకో దీపానికి ఊపిరి పోస్తుంది....మెరాజ్

    ReplyDelete
    Replies
    1. వారి త్యాగాలను గుర్తిస్తూ మీరందించిన సందేశాత్మక స్పందనకు ధన్యవాదాలు ఫాతిమాజీ...

      Delete
  4. వెన్నెలదారిలో పచ్చికబయలంటి ప్రేమకన్నా ఆర్ద్రతతోకూడిన ఎరుపంటేనే మీకు మక్కువని చెప్పకనే చెప్పేస్తుంటారు అప్పుడప్పుడూ ఇలా:-)

    ReplyDelete
    Replies
    1. మీరలా నన్ను చదివి చెప్తే మరేమనగలను పద్మగారూ...:)
      మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు..

      Delete
  5. గుండె బరువెక్కి,మనసు తలుపు తట్టి పలికిన ఈ కవిత కదిలించింది.ఆ సంఘటనతో ఎంతో బాధకు గురయిన మనసే ఇలాంటి కవిత రాయగలదు .
    అమ్మ తన కంటి ధారను రెప్పల మాటున
    ఉగ్గబట్టి నీ కనుపాపలు ముద్దాడుతున్నప్పుడు...ఈ వాక్యం తల్లి పడే వేదనకు పరాకాష్ట .

    ReplyDelete
    Replies
    1. మీ ఆప్తవాక్యానికి ధన్యవాదాలు రవిశేఖర్ గారూ...

      Delete
  6. వర్మగారు....నిజంగా వెలుతురు పిట్టలు అనే జాతి ఉన్నాయాండి!





    ReplyDelete
    Replies
    1. ఆ జాతి వుందొ లేదో తెలియదు గానీ అలాంటి మనసున్న మనుషులున్నారు కదా మన మధ్య సృజన గారూ..

      Delete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...