Tuesday, May 15, 2012

ఆహ్వానిద్దాం....



ఆహ్వానిద్దాం
దేహద్వారాలన్నీ తెరిచి
ఎండనూ వాననూ చలిని
తడి పొడిల సంగమాన్నీ
అన్నింటినీ
ఆహ్వానిద్దాం....

అవును
ఆహ్వానిద్దాం...
తలుపులు బార్లా తెరిచి
గుండె గది మూలలన్నీ తెరచి
అగరు బత్తీ పరిమళాన్ని
సన్నజాజుల వాసననీ
మల్లె పూల గుబాళింపునీ
గులాబీ రేకుల మృధుత్వాన్నీ
మొగలి రేకుల సువాసననీ
ఆహ్వానిద్దాం...

ఇప్పుడు
ఆహ్వానిద్దాం...
కనుల వాకిట మూయని
కన్రెప్పల తలుపులు తెరిచి
నలుపు తెలుపుల సంగమాన్ని
ఏడేడు వర్ణాల మిశ్రమ ఇంద్రధనస్సునీ
ప్రతిఫలిస్తున్న సమస్త వర్ణాల
ప్రతిబింబాన్ని లోలోపల
గోడలన్నీ అలికి ముగ్గు వేస్తూ
ఆహ్వానిద్దాం....

తప్పనిసరిగా
ఆహ్వానిద్దాం....
తెల్ల బడుతున్న మీసాన్ని
ఎండబడుతున్న చర్మాన్ని
పరుగులెత్తిన కాల చక్రానికి పడ్డ
అడ్డంకుల ముళ్ళనీ
కనుగుడ్లపై అలుకుతున్న తెల్లపొరనీ
గుండె కవాటానికి పడుతున్న చిల్లునీ
నవరంధ్రాల గుండా లోనకు
లోలోనకు పొగచూరుతున్న కాలాన్ని
ఆనందంగానే ఆహ్వానిద్దాం...

రండి
ఈ మలుపులో
కాసింత విశ్రమించి
ఊపిరి పీల్చుకునే సాయం సంధ్యవేళ
ఆమె చేతిలో చేయి వేసి
కాసేపు ఇక్కడ
చిగురించిన ఈ చింత చిగురు
లేతదనాన్ని ఆమె వేలి చివర
స్పృశిస్తూ
అరి పాదాల గుండా పాకుతున్న
పచ్చిక మెత్తదనాన్ని
ఆస్వాదిస్తూ
ఆహ్వానిద్దాం...

రా నేస్తం...
ఎత్తిపట్టిన కత్తితో మృత్యువుతో
పెదవి చివరంటా తొణకని
చిర్నవ్వుతో యుద్ధం చేద్దాం...

2 comments:

  1. వర్మా సార్, ఎంత ఆర్దత ఉందొ మీకవితలో , జీవిత చరమాంకాన్ని ఎంతగా విశ్దీకరించారో . మీ కవితలు చాల బాగుంటాయి

    ReplyDelete
    Replies
    1. మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు బేగంజీ..

      Delete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...