Wednesday, February 29, 2012

వెతుకులాట.....!



ఇక్కడేదో పోగొట్టుకున్నాను అని మనసులో గుబులు...
దిగంతాలు వెతికినా కానరాదేమీ......

పోగొట్టుకున్నదేదో తెలియనిదే ఏమని వెతకను.....
ఆగని ఆరని వెతుకులాట.....

చేతిలో లాంతరు పొగ మారి మసక బారుతున్నా
దేహమే నేత్రమై వెతుకుతున్నా....

లోలోపల గాఢమైన సాంద్రమైన సంద్రంగుండా
అలల తెప్పలపై కదులుతూ....

అమేయమైన దీర్ఘ నిర్నిద్ర రాత్రుల గుండా
చీకటి సాలెగూడు తెరలను తెంపుకుంటూ.....

నేతగాని మునివేళ్ళ మధ్య గుండా
విడిపోతున్న దారాల ముడులులా....

సుడిగుండాల మధ్య నుండి
పైపైకి దూసుకు వస్తున్న వేటగానివోలె......

సన్నని వెన్నెల కిరణమొకటి రహస్య దారుల గుండా
ప్రభవిస్తూ....

Monday, February 27, 2012

అంతటా నువ్వే...



దిక్కులన్నీ చుట్టేస్తూ సుదూర తీరాలకేసి పరుగులు తీస్తూ అలసిపోయాను...
ఎందాకా వెళ్ళినా నువ్వే ఎదురవుతున్నావు!
నీలాల నింగిలో..
నిండుగా నిశ్చలంగా ఉన్న నీటి కొలనులో..
ఆవేశంగా ఎగిసిపడే కడలి కెరటాలలో..
అన్నిటా అంతటా నువ్వే!

గట్టిగా కళ్ళు మూసుకుని చీకటి లోయలోకి జారిపోయాను..
ఆశ్చర్యం!
అంతటి చిక్కటి చీకటిలోనూ నువ్వు స్పష్టంగా కనిపిస్తున్నావు..

శ్వాస మీద ధ్యాస నిలిపి ధ్యానం ఒడిలో సేద తీరాలనుకున్నాను..
చిత్రం!
నా ఊపిరి సవ్వడిలో నీ నామ జపమే వినిపిస్తోంది!

నా మనసుని శూన్యంలోకి నెట్టేయ్యడానికి విశ్వప్రయత్నం చేశాను..
విచిత్రం!
నీ జాడ లేని శూన్యమైనా నా చేతికి దొరకలేదు..

గుండె చిక్కబట్టుకుని చివరి ప్రయత్నంగా మౌనాన్ని ఆశ్రయించాను..
ఆ నిశబ్దంలో
నా గుండె చప్పుడులో నీ ఊసులు వేయింతలై వినిపిస్తున్నాయి!

నీ మీద నుంచి నా ధ్యాస మరల్చాలనే ప్రయత్నం
వృథాగా మిగిలిపోతోంది..

ఇలా బాధపడాలనే ఋణమేదో మనిద్దరికీ మధ్యన ఇంకా మిగిలి ఉంది!?
నాలో కరిగిపోయి కలిసిపోయిన బంధానివి నువ్వు..
నేనంటూ ఉన్నదాకా నీ నుంచి నేను తప్పించుకుపోలేననుకుంటా!

Thursday, February 23, 2012

వెన్నెలనెవరో దొంగిలించినట్టున్నారు!!



ఈ రాతిరి వెన్నెలనెవరో దొంగిలించినట్టున్నారు!

కొబ్బరి రెమ్మల చాటునుండో
మామిడాకుల పందిరినుండో
జామ చెట్టు కొమ్మలమీదుగానో
నంది వర్థనం రెమ్మల పరదాల మాటుగానో
వెదురుపూల రేకుల చాటునుండో
నీ మోమున పడిన
చల్లదనపు వెలుగుతనాన్ని
తస్కరిద్దామనుకు
ంటే!

వెన్నెలనెవరో
కొంగున కట్టుకు పోయినట్టున్నారు
....

Sunday, February 19, 2012

కలల తెరచాప












నమ్మవు
కదా నీవు!

ఏం చెప్పినా ఏదో అపనమ్మకం...
మనిషిని చేసావు అంటే
కళ్ళలోకి సూటిగా చూసి
రెటీనా పై వాలిన బొమ్మను కూడా
ఎక్స్ రే తీస్తానంటే ఎలా??

ఏమని చెప్పుకోను!
గుండె లయను
ఇసిజితో కనిపెట్టగలవా??
నీకు వినబడేది లబ్ డబ్ మాత్రమే
కానీ లోలోపల గదులన్నీ
బీటలు వారుతూ...

కన్నీళ్ళను కూడా లిట్మస్ పరీక్ష చేసే
నీకు!
అనుబంధాన్ని అంతరంగాన్ని
ఆవిష్కరించే ప్రయోగశాల వుందా...

మూగబోతున్న ఎద చివరి మాటగా
నీవు తప్ప తోడు లేదని
గుండెలోతుల్లోంచి పలికిన మాటను
కూడా శల్య పరీక్షకు గురిచేసినా
గొంతు మారదే...

ఎందుకంటే ఏం చెప్పను!
ఎలా చెప్పను!
ఒక్కసారిగా తెగిపోయిన
వయొలిన్ రాగమాలపించడం
ఎంత వ్యధభరితమో తెలియనిదా నీకు??


నాకు ఆది అంతం నీవే
పగిలిన గుండెను అతికేట్టుగా
మమతతో పో......రా....అంటూ
రా రమ్మనరాదా!!
కలల తెరచాపలో తోడుగా...


(19.2.2012 11PM)

Friday, February 17, 2012

తను.... నేను.....









తను
...

ఎందుకంటే ఏమి చెప్పను?
ఎన్నో చెప్పాలనుకుంటాను
ఏదేదో చెప్పేస్తూ ఉంటాను
చెప్పాలనుకున్నవి చెప్పను
మిమ్మల్ని విసిగిస్తూ వాగేస్తాను
మార్చుకోవాలనే ప్రయత్నిస్తాను
రేయంతా మనసుని మభ్యపెడతాను
మొరాయిస్తున్న మనసుని జోకొడతాను
ఉదయాన్నే కాస్త మౌనం దాలుస్తాను
నిముషంలో నిర్ణయం మార్చుకుంటాను
ఎందుకిలా అనడిగితే ఏమని చెప్పను?
ఇది ఎందుకో ఏమో అని ఎలా చెప్పను?

నేను...


నేను అంతే
మాటాడుతూ ఒక్కసారిగా మూగగా ఐపోతుంటాను
మాట రాని మౌనమేదో కమ్ముకుని
నాలో నేను దాగిపోవాలని
ఓ విఫలయత్నం చేస్తుంటాను

కానీ
నీ ఊహ గుహాంతర్భాగంలోంచి
దూసుకొచ్చిన వేట పులిలా కమ్ముకొని
ఒక్కసారిగా ఆవహించి
నిలువనీయదు కదా...

అది తప్పో ఒప్పో
మనసు ఒప్పుకోదే..

ఇది తప్పొప్పుల మీమాంస సమయం కాదని
హృదయ లయలలో ఓ రాగం సన్నగా
మీటుతుంది...

ఇంక ఉప్పొంగిన నెత్తురు
లావాల విరజిమ్మి ఒక్కసారిగా
ముందుకు నెడుతుంది....

అప్పటికి నీవు అప్పుడప్పుడు
ఎగరేస్తున్న ఎర్ర జెండా కంటికి
అగుపడదే....

ఇలా చెప్పుకుంటూ పోతే
హృదయం తేలికవుతుందా...

లేదే...
మరింత గాఢమైన వనంలోకి
చొరబడ్డ దారితెలియని జింకపిల్లలా
విల విలలాడుతూ
దాహార్తితో
నీ ముందు దోసిలితో...


(ఓ రెండు హృదయాల సంభాషణ)

Wednesday, February 15, 2012

పరిమళిస్తున్న జ్ఞాపకం నాన్న..



పిలిస్తే పలికేంత దూరంలో లేకున్నా
మీ ప్రేమ దేహమంతా పరిమళిస్తూనే వుంది...

చీకటిలో లాంతరులా
మీ వెలుగు వెన్నంటే వుంది..

మీరు పిలుస్తున్నట్టై
ఒక్కసారిగా వెంటాడుతున్న
ఒంటరితనం...

ఇంతలో
చల్లగా నుదుటిపై
మీ చేతి స్పర్శ...

నాన్న నాకు
ఓ అనంతమైన
విశ్వాశపు శ్వాశ...

Sunday, February 12, 2012

వల్మీకం..




ఔను

ఇప్పుడు నిలుచున్న చోటనే
ఓ కందకం తవ్వబడుతోంది...

కట్టుకోని కళ్ళగంతలు
చూపును మూసివేస్తూ
లేని గుడ్డితనం నటిస్తూ...

ఎక్కడికక్కడ సంకెళ్ళు
తగిలించుకుంటూ ఒరిసిన
బాధను ఆస్వాదిస్తు....

ఎవరికి వారే ఓ వల్మీకమై
దాగిపోతూ చెదపట్టుతు...

చెవులలో హోరును
గుండెకి చేరకుండానే
నియంత్రిస్తు...

దేహమంతా కప్పుకున్న
రబ్బరు తొడుగుతో
స్పర్శ కోల్పోతూ....

Thursday, February 9, 2012

ఆమె నవ్వుతోంది...



ఆమె నవ్వుతోంది

ఎదురుగా కూర్చొని కాసిన్ని
పల్లీలు నములుతూ నీవు
లేకుండా వుండలేను అంటే...

ఆమె నవ్వుతోంది
కాలికింద ఇసుకను కోస్తూ
ఓ అల అలా వెళ్ళిపోతుంటే
చూస్తూ...

ఆమె నవ్వుతోంది
విసురుగా వచ్చిన గాలి
ఆమె ముంగురులను తాకి వెళ్తే
అసూయగా చూసిన నా కళ్ళలోకి చూస్తూ...

ఆమె నవ్వుతోంది
నువ్వు నా చేయి వదిలితే
సూరీడుతో పాటు అలా ఆ కొండ
వెనక్కి చేరుకుంటానంటే....

ఆమె నవ్వుతోంది
కాసింత వెన్నెలని దోసిలితో పట్టి
నీ నుదుటనలంకరిస్తానంటే....

ఆమె నవ్వుతోంది
ఊపిరాగిన క్షణం కూడా
నీ పేరే తలుస్తానంటే...

ఆమె నవ్వుతోంది
నా చేతులలోంచి
జారిపడిన ప్రేమలేఖ చూసి...

ఆమె నవ్వుతోంది
ఒంటరిగా నే నడిచి
వెళ్తుంటే....

Tuesday, February 7, 2012

అలలా.....


ఎందుకో ఏమో
తుళ్ళిపడిన మనసు
అలలా ఆంక్షల ఒడ్డుకు కొట్టుకొని
విరిగి పడి పోవడం
ఎంత
వి
షా
దం...

పాల నురుగులాంటి అల
కడలిలో
కనుమరుగు కాకూడదని
పున్నమి
వె
న్నె

నవ్వులాహ్వానం...

Saturday, February 4, 2012

వెన్నెల నీడల మాటున...


చుట్టూ పరచుకుంటున్న వెన్నెల
నా గదిలోకి మాత్రం క్రీనీడగానైనా
రాక గుండెల్లో పరచుకున్న
చీకటి భయం....

కాళ్ళు మునకేసుకొని గొంతు వరకు
ముడుచుకున్నా రాని కునుకు...
నీడలైనా కానరాక ఒంటరితనపు
గుబులు....

టక్ టక్ బూట్ల శబ్ధం తప్ప
వినపడని మువ్వల శబ్ధం....
వెచ్చని స్పర్శ కరవై
బరువెక్కిన కంబలి...

ఆత్మీయతనిండిన పలకరింపుతో
పాటు ఓ వెచ్చని కరచాలనపు
స్పర్శకోసం ఆర్తిగా...

తొలిపొద్దు కిరణపు వెచ్చదనం
కోసం ఈ బిడారిలో
కంటిపాపల చుట్టూ పాతబడిన ఇనుప
చువ్వల గుండా ఎదురుచూపు....

ఎగిరే పిట్టను చూసి
రెక్కలు లేని నిస్సహాయత
అరికాళ్ళను భూమిలో సజీవంగా
పాతిబెడుతూ నిర్వికారంగా.....

రోజూ మనుషుల లెక్కింపుతో
తెల్లారుతూ పొద్దుగుంకుతూ
సజీవ సమాధి....

(జైలు పక్షులకు ఆవేదనతో..)

Friday, February 3, 2012

సరిహద్దులకావల!!!




ఎప్పుడూ మెడపై ఓ అపనమ్మకపు

కత్తి వేలాడుతూనే వుంటుంది!
దీనికంటే ఉరి నయం కదా...

మనుషుల మధ్య ఓ
తెల్లని పొరలాంటిదేదో మసకగా
ఏర్పడి వేరుచేయడం
ఎంత విషాదమో కదా..

చిర్నవ్వుల మధ్య
ఏదో దాగున్న నిశ్శబ్ధం మౌనంగా
రోధిస్తుంటే భాధే కదా..

కలకూ కలకూ మధ్య
మెలకువలో ఓ ఉలికిపాటు
తెరచాపనెవరో చించిపారేసి
నడిసంద్రంలో నావను ముంచేసినట్టు

దూరానికి దూరానికి మధ్య
గీసిన సరిహద్దు రేఖల కావలి
కాదా ఈ నిట్టూర్పు!

Wednesday, February 1, 2012

ఆమెను....


ఆమెను
అనువదించే
సాధనముంటే ఎంత బాగుణ్ణు!!

అనుభవమొక్కటే
తుది కాకూడని
అనంత సాగర మధనం!!

చివరిగా
ఊపిరి నిలిపిన చోట
మొలకెత్తుతూనే వుంటుంది!!
Related Posts Plugin for WordPress, Blogger...