Saturday, January 28, 2012

వెలుతురు పిట్టల పిలుపు!!



నువ్వు నూనూగు మీసాల నూత్న యవ్వనంలో
గోడలపై ఎర్ర రంగు నినాదాలు అంత దస్తూరీగ రాస్తూన్నప్పుడు
విప్లవం వర్థిల్లాలని జెండా చేతబట్టి వడివడిగా ర్యాలీ అవుతున్నప్పుడు
నిన్ను చూసి మురిసిపోయాను....

ఈ కుర్రాడు ప్రతి పని చక్కగా ముగ్గువేసినట్లు చేస్తాడని అంతా అంటూన్నవేళ...
పాటకు భావయుక్తంగా గొంతు కలుపుతూ అడుగువేస్తున్నవేళ..
కంఠనాళాలన్నీ బిగబట్టి ప్రసంగిస్తుంటే కళ్ళలో నిప్పులు కురుస్తూ నువు మండుతున్న వేళ...
పచ్చని చిగురాకు పట్ల ప్రేమగా నువ్వు నిమురుతున్న వేళ....
ఇక్కడి ప్రకృతి పులకించి పోవడం కళ్ళారా చూసా రఘూ....

నిన్ను నీ అంతరంగ సంఘర్షణను సరిగా అర్థంచేసుకున్నామో
లేదోనని ఇప్పటికీ ఎక్కడో అపరాథ భావం వెంటాడుతునే వుంది...
నిజమయ్యా వాడు ఎన్ని ’అమ్మ పిలుపులు’ ’జన్మభూమి పిలుపులు’
పిలిచి ఎరగా తల్లి ప్రేమను వేసినా నీవు మడమ తిప్పక
అంతే పట్టుదలతో ట్రిగ్గర్ పై బిగుసుకున్న నీ చూపుడు వేలు చూసి
వాడు సిగ్గుతో వెన్ను చూపాడు....

అందుకే నీ తోవ అంత వెలుగు పరుచుకుంది రఘూ....
నిన్ను మట్టుబెట్టనీకి ఎన్నెన్ని రంగులు మార్చినా...
కాలిలో గాయమైనా వెన్ను చూపని నిన్ను చూసి
వాడు నీ పేరంటేనే వెన్నులో చలికి వణికిపోయాడు....

చివరికి బూటకపు  గణతంత్ర  వేడుక వేళ
నీ చావును బహుమానంగా ఇచ్చి
వాడు మురిసిపోతున్నాడు....

కానీ...
వెలుతురు పిట్టల పిలుపు
మా చెవులలోనే కాదు
గుండెల్లో గూడేల్లో గూడు కట్టుకున్నది రఘూ....

(తే 26-01-12 న ఒరిస్సా సరిహద్దు నారాయణపట్న బ్లాకు పరిథిలోని పొడపొదర అడవులలో బూటకపు ఎదురుకాల్పులలో సహచరితో పాటు అమరుడైన రఘు స్మృతిలో)

4 comments:

  1. నివాళి మీలో అతని ఎడల అభిమానాన్ని తెలిపింది.
    విచారకరమే అయినా తెలిపిన విధానం బాగుంది.
    ఆత్మకు శాంతి కూర్చమని మది ప్రార్ధిస్తున్నది.

    ReplyDelete
    Replies
    1. మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు పద్మార్పితగారు...

      Delete
  2. మా చెవులలోనే కాదు
    గుండెల్లో గూడేల్లో గూడు కట్టుకున్నది రఘూ....

    గూడు కట్టుకున్నారంటే ఎంత ఆత్మీయత కలిగిన వ్యక్తో తెలుస్తోంది! ఆయన ఆత్మకి తప్పకుండా శాంతి చేకూరుతుంది!

    ReplyDelete
  3. మీ అభిమాన ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలు రసజ్ఞ గారూ...రాజ్యహింసకు బలైన మరో విప్లవకెరటం రఘు...

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...