Wednesday, May 30, 2012

ఎదురు చూపు..


విధిని నిందించడమేనా...

ఏమో ఈమె నుదుట సూరీడు
అస్తమించాడో
తనకు తాను
ఆత్మహత్య చేసుకున్నాడో??

కానీ ఓ నిండు జీవితాన్ని
కన్నీటి మబ్బుల మాటుకు
తోసేసి వాడు హాయిగా
పడమటింట నిదురోతుంటే..

ఏమీ చేయలేని నిస్సహాయత
గుండె కవాటాలని మూసేసింది
ఒక్కసారిగా...
ఇంత నిర్దయగా
వుండే సత్యమా
నీ నిజస్వరూపమిదేనా??

మళ్ళీ ఆమె కంట్లో
వెన్నెల నవ్వు
పూయించాలని
ఆర్తిగా ఎదురు చూపు!!!

(తిరుమలకు..)

Monday, May 28, 2012

ఆంధ్రప్రభ లో నా కవిత

ఈ రోజు ఆంధ్రప్రభ దినపత్రిక సాహితీ గవాక్షం పేజిలో నాకవిత...

Sunday, May 27, 2012

వేసవితనం...



నీ కంటి చివర
విసిరిన
నిరాకారాపు చూపు
నా నిలువెల్లా మంటల్లో
దహించి వేస్తుంది...

దేహమంతా సూదులతో
గుచ్చి
ఏసిడ్ పూత పూసినా యింత
గాయమయ్యేది కాదు..

నిలువెల్లా ఎడారి ఇసుకలో
పాతుకు పోయినా
ఇంత దాహమయ్యేది కాదు...

అంతలోనే
నీ పెదవి చివర
తళుక్కుమన్న చిర్నవ్వు
గుండెల్లో వెన్నెలని
పూయిస్తుంది....

Friday, May 25, 2012

వెన్నెల పయనం

కలలనన్నీ మోసుకుంటూ
జ్ఞాపకాల వెంట అడుగులేస్తూ
గుండెల్లో అగ్ని పర్వతాన్ని రాజేస్తూ
వెన్నెలనింత దోసిట పట్టి
ఉదయిస్తున్న సూరీణ్ణి ఆహ్వానిస్తూ
పచ్చదనాన్ని నేలంతా పరుచుకుంటూ
సాగుతున్న

అలుపెరుగని ప్రయాణం
ఊరి చివర
ఖండితుని శిరస్సులో
నవ్వునద్దేంత దాకా...

Wednesday, May 23, 2012

ఎప్పుడైనా నిన్ను నువ్వు...

ఎప్పుడైనా నిన్ను నువ్వు
వడిసెల రాయిని చేసి
విసిరి చూసావా??

ఎప్పుడైనా నిన్ను నువ్వు
కాగితప్పడవను చేసి
వాన నీటిలో ఈది చూసావా??

ఎప్పుడైనా నిన్ను నువ్వు
కాగితపు రాకెట్ గా చేసి
విసిరి చూసావా??

ఎప్పుడైనా నిన్ను నువ్వు
గాలిపటానికి తోకగా మార్చి
దారపు చివరంటా ఎగిరి చూసావా??

ఎప్పుడైనా నిన్ను నువ్వు
గులకరాయిని చేసి
నీటిలో కప్పగంతులేసి చూసావా??

ఎప్పుడైనా నిన్ను నువ్వు
రంగునీళ్ళగా మార్చి
హోళీ ఆడి చూసావా??

ఎప్పుడైనా నిన్ను నువ్వు
సీతాకోక చిలుక రెక్కపై
రంగు పొడిలా అంటుకొని చూసావా??

ఎప్పుడైనా నిన్ను నువ్వు
రిబ్బను ముక్కగా మార్చి
జడకుచ్చుగా చూసుకున్నావా??

ఎప్పుడైనా నిన్ను నువ్వు
వరికంకుగా చేసి
పిచ్చుక నోటికందించి చూసావా??

ఎప్పుడైనా నిన్ను నువ్వు
నాగలి కర్రుగా మార్చి
మట్టిగుండెలో్ చాళ్ళుగా మారి చూసావా??

ఎప్పుడైనా నిన్ను నువ్వు
సమ్మెటగా మార్చి
ఎర్రగా కాలిన ఇనుప కమ్మిపై పడి చూసావా??

ఎప్పుడైనా నిన్ను నువ్వు
డప్పుపై చర్మంగా మార్చి
నకజనకరి నాం దరువై చూసావా??

ఎప్పుడైనా నిన్ను నువ్వు
కాలి గజ్జెలో మువ్వగా మార్చి
థింసా పాదం ఆడి చూసావా??

ఎప్పుడైనా నిన్ను నువ్వు
ఓ తూటాగా మార్చి
వాడి గుండెల్లో దూసుకుపోయి చూసావా??

Monday, May 21, 2012

కాసేపాగి వస్తాను..



ఆగండి కాసేపాగి వస్తాను..
చేతికంటిన ఈ రంగును
ఇక్కడ ఈ నలుపు తెలుపుల
బొమ్మకు యింత రంగునద్ది
వస్తాను..

ఎన్నాళ్ళుగానో యిలా
పాలిపోయినట్టు కాంతి విహీనమైన
ఈ బొమ్మకు ఈ రంగుపూసి
వెలుగులోకి తెద్దామని
ఇలా ఆగి వస్తా...

ఎవరో అసంపూర్ణంగా వదిలేసిన
రేఖా చిత్రంలా
ఆ కను రెప్పలకావల ఏదో
ఆశ నిరాశల వలయాలు
కాటుక రేఖలా అద్దీ అద్దనట్టు
సగం చెరిగి దోబూచులాడుతూ
గుండె లోలోతుల్లో సుళ్ళు
తిరుగుతున్నాయి...

ఆ నుదుటిపై
పొద్దు గుంకిన సూరీడు ఆనవాలుగా
చెరిగిన తిలకంలా రేఖామాత్రపు
గాయమో కాలమో వెక్కిరిస్తూ
ఎదలో ముల్లులా గుచ్చుతూ...

వాన వెలిసిన రాతిరి
నిర్మలంగా వెలుగుతున్న ఆకాశంలా
ప్రతిఫలిస్తున్న తేజస్సు ఏదో
ఆ చిత్రంలో వెంటాడుతూ
నా రంగులంటిన చేతిని
శుభ్రపరుస్తూ....

Friday, May 18, 2012

నేనిలా...


నిశ్శబ్ధం
ఒంటరిగా
కాలుతున్న వాసన...

చెవిలో ఏదో సైలెన్సర్ బిగించినట్టుగా
ఏదీ వినబడనితనం
ఒక్కోమారు బిగుతుగా...

కంట్లో రెటీనాపై నల్లగా ఓ తెర కప్పి
లోలోపల ఏవో శూన్య రేఖలు
బర బరా గీస్తున్నట్టు...

దేనికదే వేటికవే
ఓ నిశ్శబ్ధ యంత్రం చుట్టూ
మూగి గుస గుసలాడుతున్నట్టు...

దేహమంతా ఓ గుండ్రని
బంతిలా మారి దొర్లుకుంటూ
ఓ మూలన చేరినట్టు...,

గాలి వీయని తనంతో
అంతా మూగగా ఉగ్గబట్టి
రోదిస్తున్న వేసవితనం ముసురుపట్టినట్టు...

సెలయేళ్ళన్నీ బయలు దేరిన చోటనే
లోలోపలికి యింకుతూ
రాతి మూలల దాగినట్టు...

అలలన్నీ బంద్ చేసి
ఒడ్డుకందని దూరంతో
సముద్ర గర్భంలో నిదుర పోయినట్టు...

ఆకురాలిన కాలంలో
గొంతు మూగబోయిన
కోయిలలా పాటరానితనంతో
నేనిలా...




Tuesday, May 15, 2012

ఆహ్వానిద్దాం....



ఆహ్వానిద్దాం
దేహద్వారాలన్నీ తెరిచి
ఎండనూ వాననూ చలిని
తడి పొడిల సంగమాన్నీ
అన్నింటినీ
ఆహ్వానిద్దాం....

అవును
ఆహ్వానిద్దాం...
తలుపులు బార్లా తెరిచి
గుండె గది మూలలన్నీ తెరచి
అగరు బత్తీ పరిమళాన్ని
సన్నజాజుల వాసననీ
మల్లె పూల గుబాళింపునీ
గులాబీ రేకుల మృధుత్వాన్నీ
మొగలి రేకుల సువాసననీ
ఆహ్వానిద్దాం...

ఇప్పుడు
ఆహ్వానిద్దాం...
కనుల వాకిట మూయని
కన్రెప్పల తలుపులు తెరిచి
నలుపు తెలుపుల సంగమాన్ని
ఏడేడు వర్ణాల మిశ్రమ ఇంద్రధనస్సునీ
ప్రతిఫలిస్తున్న సమస్త వర్ణాల
ప్రతిబింబాన్ని లోలోపల
గోడలన్నీ అలికి ముగ్గు వేస్తూ
ఆహ్వానిద్దాం....

తప్పనిసరిగా
ఆహ్వానిద్దాం....
తెల్ల బడుతున్న మీసాన్ని
ఎండబడుతున్న చర్మాన్ని
పరుగులెత్తిన కాల చక్రానికి పడ్డ
అడ్డంకుల ముళ్ళనీ
కనుగుడ్లపై అలుకుతున్న తెల్లపొరనీ
గుండె కవాటానికి పడుతున్న చిల్లునీ
నవరంధ్రాల గుండా లోనకు
లోలోనకు పొగచూరుతున్న కాలాన్ని
ఆనందంగానే ఆహ్వానిద్దాం...

రండి
ఈ మలుపులో
కాసింత విశ్రమించి
ఊపిరి పీల్చుకునే సాయం సంధ్యవేళ
ఆమె చేతిలో చేయి వేసి
కాసేపు ఇక్కడ
చిగురించిన ఈ చింత చిగురు
లేతదనాన్ని ఆమె వేలి చివర
స్పృశిస్తూ
అరి పాదాల గుండా పాకుతున్న
పచ్చిక మెత్తదనాన్ని
ఆస్వాదిస్తూ
ఆహ్వానిద్దాం...

రా నేస్తం...
ఎత్తిపట్టిన కత్తితో మృత్యువుతో
పెదవి చివరంటా తొణకని
చిర్నవ్వుతో యుద్ధం చేద్దాం...

Sunday, May 13, 2012

పొడుస్తున్న పొద్దులో..











ఒక్కోసారి
అంతే..

తను పెరిగి పెద్దవాడైనా
తన వెనకే నడవాలని
తన నీడనే వుండాలని
కోరుకుంటుంది మనసు...

కానీ
నా లాంటి
అమ్మలనెందరికో
పుత్ర వాత్సల్యాన్ని తీర్చే
కొడుకుగా నడుస్తూ
వెళతావని ఊహించలేదు...

నాకు నీ రాజకీయ ప్రకటన
అర్థం కాలే..
కానీ అర్థాకలితో నిదరోయే
ఎన్నో కాలిన పేగుల వాసన
దానిలో కనబడి
నిన్ను తలచిన ప్రతిసారీ
నా పేగు కదిలింది...

ముంగిట వున్న
మామిడి చిగురువేసి
పూత వచ్చి పిందెలన్నీ
పండ్లుగా మారిన ప్రతిసారీ
గుర్తుకొస్తూనే వుంటావురా...

పొలం గట్లపై
లేడి పిల్లలా దుంకుతూ
తల్లి ఆవు వెనక
పరుగుపెట్టే లేగ దూడ
లేత గిట్టల్ని చూసినప్పుడంతా
యాదికొస్తావురా...

తొలకరి చినుకు పడి
మట్టి పురిటి వాసన
వేసిన ప్రతిసారీ
నీ తొలి పిలుపు
మెదిలి కన్న
పేగు మెలిపెడ్తుందిరా..

నీవు చెప్పే మాటలన్నీ
పాడే పాటలన్నీ
వినబడీ చనుబాలధార
కడుతుంటే
కన్నీళ్ళింకినది గుండెల్లోకాదని
తెరిపినిస్తుంది...

ఒక్కొక్కరు ఒక్కో మాటాడుతూ
తూట్లు పొడవాలని చూస్తుంటే
నీ గుండెనిబ్బరం చూసి
అమ్మనైనందుకు
గర్వంగా వుంటుంది...

నీవలాగే
నిరంతరమూ ఎక్కుపెట్టిన
విల్లులా నిలిచి
పోరుసల్పాలని
ఆశపడుతూ
పొడుస్తున్న
పొద్దులో వెతుకుతు...

Wednesday, May 9, 2012

దిగంతాలకావల...



దిగంతాల చివరాఖరు అంచుపై
నువ్వూ నేనూ..

ఏ మాలిన్యమూ అంటని
ఏ కాలుష్యమూ సోకని
ఏ కాఠిన్యమూ తాకని
నవ్వుల కాంతులు పూయిస్తూ..

దేహమంతా సంతోషపు
రెక్కల సవ్వడి వీవెనగా...

మనకు మనమే
రారాజుగా
ఈ ఆకాశపుటెడారిలో
ఆర్థ్ర వర్షపు జల్లులలో
తడుస్తూ
దాహార్తిని తీర్చుకుంటూ....

ఎలుగెత్తి స్వేచ్చా నినాదం
ఆద్యంతాలు పిక్కటిల్లేలా
చేస్తూ...

ఒక్కో అణువూ
దేనికదే విడివడి
దానికదే ఏకమవుతూ
సాగుతున్న
ఈ అనంత పయనంలో
సమూహంలో
ఒంటరి బాటసారిగా....

Monday, May 7, 2012

అభ్యర్థన...












వెతికే
నా కంటి చూపు లోతు తెలియనిదా
నీ కనురెప్పల కావల దాగిన
నా మనోచిత్రానికి...

నీ ప్రేమ కోసం ఆర్తిగా వేచివున్నానని
ఆ తపనలో దాగిన నా ఎద లయ
విన్న నీకు తెలియనిదా...

నా మాటలన్నీ నీ మౌనాన్ని
బద్ధలు చేసి నీ గుండె తలుపును
తట్టి నీ దరికి చేరడానికే కదా...



నీవు పలుకని ప్రతి క్షణం
నా దేహమంతా చీకట్లు ముసురుకున్నట్టు
అమవాస వెలితిలో భారంగా
రథచక్రం కుంగిన కర్ణునిలా
కూలబడ్డ నా వంక చూసి
చులకనైనది ఎవరో తెలియదా,,,


సఖీ ప్రియా
కలసిన మనసుల మధ్య
మౌనరాగాల నేపథ్య సంగీతంలో
ఇన్నిన్ని ప్రశ్నల బాణాలతో
గుండెను గాయం చేయాలా??

నా కన్నీటి దోసిలిలో
ఓ వెండి వెన్నెల పూర్ణిమలా
నవ్వుతూ కానరావా...


మన్నెం వీరునికి నివాళి..

Wednesday, May 2, 2012

నాతో ఆమెతో నేను

నాతో ఆమె
ఎందరిలో వున్నా....
నీ సవ్వడే వినిపిస్తుంది!

పనిలో నిమగ్నమైన ....
నీతో మాట్లాడాలనిపిస్తుంది!

ఓపిక లేకున్నా ....
నిన్ను కలవాలనిపిస్తుంది!

ఇంతవరకు నిన్ను చూడకున్నా....
నీకు సన్నిహితంగా మెలగాలనిపిస్తుంది!

అర్థం లేని ప్రశ్నలే అని నీవన్నా....
ఎన్నెన్నో ప్రశ్నలకు జవాబులు నీవేగా తోస్తుంది!

అలసిన వేళ నిద్రపుచ్చాలని....
నిదురోతుంటే తట్టిలేపాలనిపిస్తుంది!

నీతోనే ఇలా సాగిపోవడం తప్పని తెలిసినా....
మనసు ఇలా నన్ను వెంటాడి వేధిస్తూనే ఉంది!

నీవు నాదరి లేకున్నా, నాలోనే ఉన్నట్లు....
ఏదో తెలియని అనుభూతి నన్ను గిలిగింతపెడుతుంది!






ఆమెతో నేను...

మౌనంగా నీ అంతంరంగ చిత్రాన్ని
నలుపు తెలుపుల సమ్మేళణం చేస్తూ
ఇలా నీ ఎదురుగా నిర్నిమేషంగా...

ఇంత హడావిడి జీవన పరుగులోనూ
ఒకింత సేదదీరి ఊపిరి పీల్చుకోవాలనిపించేది
నీ చెంతనే కదా...

ఏదో బతుకు ఓ బండరాయిలా
దొర్లుకుంటూ మీద ఒరిగిపడుతున్న వేళ
నీ నీడ చాటున దాగి రహస్యంగా
ఓ గుక్కెడు నీళ్ళు తాగాలనిపిస్తోంది...

ఇది తప్పు ఇది ఒప్పు అని
కానరాని లక్ష్మణ రేఖ ఏదో
మన మధ్యన భగ్గుమని లేస్తూ ....

నిన్నో ఒడ్డుకు నన్నో తీరానికి
విసిరేయ జూస్తున్నా...

అందని చేతి వేళ్ళను
తాకాలని మదినిండా
తీరని అభిలాష వెంటాడగా...

స్మృతులన్నీ ఏక్ తారగా
ఆలపిస్తున్న యీ నా మౌన గీతం
నీకే అంకితం...
Related Posts Plugin for WordPress, Blogger...