Sunday, June 14, 2009

ఒకటే జననం ఒకటే మరణం


తల్లి గర్భంలో ఒకే పిండాన్ని పంచుకు పుట్టారు
ఉమ్మనీరులో చేయి చేయి కలిపి ఈదులాడారు
ఒకే పేగు బంధంతో తొమ్మిది నెలలూ
కలిసి పంచుకున్నారు
ఎవరు ముందు క్షణం ఈ లోకంలోకి
మాయ పొరను చీల్చుకు వచ్చారో!
ఒకే రొమ్ము పంచుకుని పెరిగిన తీపి
జ్ఞాపకాలను మరువలేకున్నాం
బాల్యమంతా ఒకరికి ఒకరు పోటీపడి

అమ్మతో దోబూచులాడిన క్షణాలు
ఇంకా మా మదిలో కదలాడుతూనే వున్నాయి
నాన్న తెచ్చిన బూందీ పొట్లం పంచుకు తిన్న

తీపి గురుతులు మరువలేకున్నాం
ఇద్దరూ ఒకే పుస్తకాన్ని చదువుకున్న

జ్ఞాపకాల తడి ఇంకా అరనేలేదురా
మీ దేహాలు వేరయినా విజ్ఞానంలో కూడా
ఏకత్వాన్నే నిలిపారు
ఒకే సైకిల్ పై ప్రతి రోజూ కాలేజీ పయనమయ్యే మీరు
మృత్యు ఒడిలోకి ఒకే సైకిల్ పై వెళతారు అని
ఎలా కలగనగలం కన్నా?
(నిన్నను అనకాపల్లి - చోడవరం రోడ్డులోని ఏలేరు కాలువ గట్టుపై జరిగిన ట్రాక్టర్ గుద్దిన ఘటనలో సైకిల్ పై వస్తున్న కవల సోదరులు రాంకిశోర్, లక్ష్మనకిశోర్లు మృత్యువాత పడ్డారన్న వార్త చదివి. వారిద్దరి జన్మదినం ఈరోజని తెలిసి గుండెలు పిమ్దినట్టాయి. ఇంటర్లో ఇద్దరూ ప్రధమ శ్రేణిలో పాస్సయ్యారు.)

1 comment:

  1. ఏకోదరులు ఏక కాలంలో జననం పొంది మరణంలోనూ కలిసేవున్నారు. మీరు స్పందించటం ఆ వ్రాసిన పద్దతి కంటిచెమ్మని కదపటం, ఇదేనేమో మనకు తెలియని ఆ లోకాలకు ఒకరు మళ్ళారు అని తెలిసినపుడు మనసున్న మనిషిలోని కదలిక.

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...