Friday, July 29, 2011

దూరమయ్యిందెవరు??



నీవు నాకు దూరంగా వున్నావన్నది

నీ ఊహ మాత్రమే..


నీ అడుగుల లయ
నాకు వినిపిస్తూనే వుంది నేస్తం
నిశ్శబ్ధంగా నా చెవులకు...


మరి దూరమయ్యిందెవరు???

కొత్త చొక్కా....

ఎప్పుడు సంక్రాంతి పండగొస్తుందా
నాన్నకొత్త చొక్కా కొంటారా అని ఆశ...

సంసార సాగరాన్ని ఈదే ప్రయత్నంలో
ఏడాదికి ఒక కొత్త చొక్కా మాత్రమే కొనగలిగే స్తోమత...

అప్పుడప్పుడూ సంక్రాంతి రోజులులోనూ వాయిదా పడేది!
మళ్ళీ పుట్టిన రోజుకేసుకుందువులే అన్న మాట..
ఓ చిన్న ఏడుపు రాగంతో మనసు తేలికపడేది...

వేసుకున్నప్పుడు ఆ కొత్త చొక్కా వాసన
హృదయమంతా నిండి గాల్లో తేలిపోయే వాణ్ణి...

ఎవరన్నా బాగుందిరా అని అనరా అని
మనసు చుట్టూ చూసేది...

ఏమైనా కొత్త చొక్కా మజాయే వేరు కదా!
అందుకే వుతకడం వారం వాయిదా...
ఉతికితే పాతదే కదా మరి...

మళ్ళీ ఏడాది ఆగాలి కదా...
యిప్పటికీ అలవాటు మారలేదు మరి....

Tuesday, July 26, 2011

ఓ గురుతు




గురుతు

నిన్నో మొన్నో చూసినట్టుగా వుందిప్పటికీ...

నవ్వు అమావాస్య వేళ వెన్నెల
సంతకం

మాటాడుతుంటే సెలయేళ్ళ గల గలలకే అసూయపుట్టేలా కతల
ఊట...

చుట్టూ పూల రేకుల నవ్వుల
వాన....

గొప్ప నమ్మకమిచ్చే కరచాలనపు
స్పర్శ....

కలల పందిరి కింద వెన్నెల క్రీనీడల
సరాగం....

మనసంతా కమ్ముకున్న ఆనంద
తాండవం....

Friday, July 22, 2011

సన్నద్ధమౌతూ...

దూరంగా సుదూరంగా
గాలిలో అలా తేలియాడుతూ
వస్తున్న వేణు నాదం
పర్వత సానువులన్నీ చెవివొగ్గి ఆలకిస్తున్నాయి

గూడెంలో ఈ మూల లయగా
మోగుతున్న తుడుం...

చలిని దహిస్తూ
ఎర్రగా కాలుతున్న కొరకంచు.....

వెన్నెల దీపం చుట్టూ పదం పాడుతూ
జతగా కదులుతున్న పాదాలు.....

గుండెల్లో బాధను ఆత్మీయతను కలగలిపి
సన్నగా విడుస్తున్న ఊపిరి స్వరం తోడుగా...

రేపటి ఉదయానికి
వింటిని సవరించుకుంటూ అతడు....

Monday, July 18, 2011

ఉక్కపోత!



ఉక్కపోత
!
లోనా బయటా ఒకటే ఉక్కపోత...


ఒక చల్లని గాలితిమ్మెర కోసం

ఆత్రంగా కలియదిరుగుతున్నా...


మైమరిచి పోయేంతటి గాఢత కోసం

పలుచని పొరలన్నీ కోసుకుంటూ వెలుతున్నా...


అక్షరాలను అటూ ఇటూ పేరుస్తున్నా

రెండూ కలవక విరిగిపోతున్న వైనం కలవరపెడుతోంది...


నరాల దారాలగుండా వడుకుతూ అల్లుతున్న

సన్నని వస్త్రంలో గాలి దూరక ఉక్కపోత...

తప్పని ఉక్కపోత.....

Wednesday, July 13, 2011

వానలో





చూరునుంచి వర్షం ధారగా...
మదిలో ముసురులాంటి ఆలోచనలతో
కమ్ముకున్న తెల్లని పొగ....

ఒక్కొక్కటి కాగితపు పడవలా
ఈదుకుంటూ మునిగిపోతున్న చోట
అలా తడుస్తున్న జ్నాపకాలు....

ఎవరో కుర్రాడు తపక్ తపక్ మంటూ
గుంటలో బురద స్నానం చేస్తున్నాడు...

వీధికుక్క కూచుందామన్నా కసురుకుంటున్న
మనుషులతో తడుస్తూ మూలుగుతుంది...

ఎక్కడా ఆగేందుకు లేక తడిచిన రెక్కలతో
బరువుగా ఎగురుతూ ఓ కాకి....

హఠాత్తుగా వచ్చిన వానతో ముద్దగా తడిచిపోయిన
పాత చెప్పులను సంచిలో కూరుకుంటూ
ఓ మూలకు చేరిన చమారీతాత....


డొక్కలో పేగులన్నీ పంటి బిగువున లాగి పట్టి
తడుస్తూ రిక్షా తొక్కుతూన్న రామయ్య...

ఆరిపోతున్న బొగ్గులను చక్రం తిప్పుతూ రాజేస్తూ
చాయ్ కాస్తున్న రహీమ్ భాయి....

ఇంతలో ఓ ఇంద్ర చాపం...
పరికిణీలో ఓ పిల్ల వానలో కూనిరాగం తీస్తూ
శుభా ముగ్దల్ ను మరిపిస్తూ....

Tuesday, July 12, 2011

అతడు

అతడెప్పుడూ ఒంటరి కాలేదు
అతడు సమూహ గానంలో స్వరమైనవాడు..

అతడు నడిచినంతమేరా
ఆకు పచ్చని వెన్నెల పరచుకుంది...

అతడి పిలుపుకు అడవి తల్లి
పులకించి ఎర్ర పూల వనమైంది....

అతడి నవ్వు గాయపడ్డ హృదయాలకు
వెన్నపూసై స్వాంతననిచ్చింది....

అతడు అందరి హృదయాలలో
పదిలమై పాటై గొంతులో జీరాడుతున్నాడు....

Sunday, July 10, 2011

ఆమె ఆదివారం



ప్రతిదినం సూరీడుతో పోటీ పడుతూ సాగే ఆమె
ప్రయాణం ఈ రోజు కాసింత నిద్ర కోరుకుంది....

నా టీ నేనే కాచుకున్నా
ఇందులో ఏదో తక్కువైంది...

పర్వాలేదు...
ఈ రోజు ఆమె విశ్రాంతి కోరుకుంది...

అలసిన దేహంతో పాటు
మనసుకూ కాసింత విరామాన్నిద్దాం...

Tuesday, July 5, 2011

కాసేపు నిశ్శబ్ధాన్ని పాటిద్దాం



కాసేపు నిశ్శబ్ధాన్ని పాటిద్దాం

అక్కడెవరో రంగుల్ని కలుపుతున్నారు
బొమ్మను పూర్తి చేయనివ్వండి...

కాసేపు నిశ్శబ్ధాన్ని పాటిద్దాం
ఆయనెవరో ఉలిని చేతుల్లోకి తీసుకుంటున్నారు
రాతిని బొమ్మగా మారనివ్వండి...

కాసేపు నిశ్శబ్ధాన్ని పాటిద్దాం
అనంత సాగరం ఆకాశంతో మొరపెడుతోంది
చెవి ఒగ్గి వినండి...

కాసేపు నిశ్శబ్ధాన్ని పాటిద్దాం
రాతిని కోసుకుంటు సెలయేరు ప్రవహిస్తోంది
గలగలలను వినండి....

కాసేపు నిశ్శబ్ధాన్ని పాటిద్దాం
అడవి అంతా వెన్నెల పరచుకుంటోంది
కాసింత దోసిలి పట్టండి....

కాసేపు నిశ్శబ్ధాన్ని పాటిద్దాం
అక్కడేదో విత్తనం మొలకెత్తుతోంది
చిగురును కాపాడండి...

కాసేపు నిశ్శబ్ధాన్ని పాటిద్దాం
ఎవరో విముక్తి గీతాన్ని ఆలపిస్తున్నారు
గుండె గది తాళం చెవి తీయండి....

Sunday, July 3, 2011

చెల్లి..

కొన్ని గురుతులు అలా
కోనేటి గట్టున కోవెల గూట్లో దాక్కున్న
పావురం కువకువలులా మది గూడులో
ఎప్పుడూ పిలుస్తూనే వుంటాయి....

వెనక్కి పరుగెత్తలేని నిస్సహాయత
ఓ నిట్టూర్పులా విసురుగా రాలేక
గుండె పొరలలో సుడి తిరుగుతూనే వుంటుంది...

తను నా తరువాత పుట్టిందన్న మాటే గానీ
మా నానమ్మ ప్రతి రూపమన్న అయ్య మాటతో
నేలను దింప బుద్ది కాక చంకలో పీతికాయలు మొలిచాయి...

తను మారాం చేస్తే ఏంజేయాలో తెలియని తనంతో
అమ్మతో తిన్న చీవాట్లు....
అంత ముద్దు చేయకురా అది ఎవరి మాటా వినకపోతే
తిడతారురా నన్ను అంటూ విసుక్కునే అమ్మ మాటే వినపడ లేదు...

వున్నంతలోనే తనని ఒక ఇంటి దానను చేసేయాలన్న
తొందరతో కట్టబెట్టి పంపినప్పుడు మా ఇంట్లోనే కాదు
నా కళ్ళలో కూడా దీపాలు ఆరిపోయాయి...

తానిప్పుడు ఆరిందలా పెద్దరికంతో మాటాడుతుంటే
మళ్ళీ మా నానమ్మ గుర్తొచ్చి
కళ్ళు వెలుగును నింపుకున్నాయి....

Friday, July 1, 2011

అంతర్లీనమయ్యే మహాకాయుడు..



నాన్నంటే నమ్మకమే కాదు
వెన్నంటే నేస్తం కూడా...

నిరంతర శ్రామికుడు..
తనకంటూ ఒక శిఖరాన్ని అధిరోహిస్తున్నట్లు
కనిపించే ఓ అమాయకపు ప్రాణి...
అది తాను చూపించే బాట మనకు...

నీ అసహనానికి, జుగుప్సకు బలి అయ్యే ఓ నిర్వేదపు సాక్షి...
ఎదగడం చేతకాని తీగకు తుది ఊపిరున్నంత వరకు
పందిరయ్యే పిచ్చి మాలోకం...

తన సరదాల ప్రపంచంలోంచి విడివడి
నీ అడుగుల సవ్వడిలో లీనమైన మహా స్రవంతి...
నీ నీడలో అంతర్లీనమైన మహా కాయుడు...

Thursday, June 30, 2011

అన్నపూర్ణా....


అన్నపూర్ణా అన్నపూర్ణా
ఏడ దాగినావమ్మా...


రైతై పుట్టిన
పుణ్యానికి
ఈ నేలమీద
మీసం మెలేయలేక పోయినా
కడుపు నిండా యింత వన్నం
తిందామన్న
ఆశతో వేసిన
పంట చేతికి రాక
అప్పుల ఊబిలోంచి ఎలా బయటకు దూకాలో
కాన రాక
కాలూ చేయీ ఆడక

పురుగుల మందే పరమాన్నమైనట్టు తిని

తాను మమ్మల్నిలా వొంటరి చేసి పోతే

ఇలా మిగిలిన పాపం వీరిదా?
నాదా?

Monday, June 27, 2011

కిటికీ..



కిటికీ పక్కన కూచొని ఎన్నాళ్ళయిందో...


అలా తెరిచిన కిటికీ ఓ బుల్లితెరలా
మారి ఎన్నెన్ని దృశ్యాలతో నిండుకుంటూ
ఖాళీ అవుతూ ఓ ఆబ్ స్ట్రాక్ట్ పెయింట్ లా
గజిబిజిగా మారి మస్తిష్కంలో
అటు యిటూ తెలియని రంగుల పూతలా...

ఎక్కడో మాసిన నూనె గుడ్డ కాలిన వాసన...
మబ్బు కమ్మిన సగం కోసిన వెన్నెల క్రీనీడ
ఊచలలోంచి వచ్చి చినిగిన చేతి సంచిపై పడుతోంది...

అట్ట వూడిన పుస్తకం అంచులు
కొరుకుతూన్న పురుగు రెక్కలొచ్చి
పక్కకు ఒరిగి పోయింది....

కాలిన సిగరెట్టు వేలి చివర చురుక్కు మంటూ
కాగితంపై పడ్డ నుసి నల్లని మరకను పూసింది...

చివరి సిరా చుక్క రాయనంటూ
కాగితం అంచున ఒలికిపోయింది...

Wednesday, June 22, 2011

కర్తవ్యం



కాలం యింత నిర్దయగా
తలారి పాత్ర వహిస్తుందా?

ఒక్కొక్కరినీ తన మట్టిపొరలలో
కప్పెట్టుతూ మనల్నిక్కడ
ఒంటరి పక్షులను చేయచూస్తోంది...

కానీ..
ఆ మట్టి పరిమళాన్ని
దేహమంతా పూసుకొని
ఎత్తిపట్టిన ఝెండా రెపరెపలలో
కాంతి యోధులమై
విజయ ఢంకా మోగించి
క్రాంతిని సాధిద్దాం
ఉదయరాగాన్ని
ఆలపిద్దాం....

ధిక్కారం

అతుకుల బొంతలా
ఒక్కో పొరా మాసిన గుడ్డతో
నెత్తురోడిన గాయాలను కప్పుతూ
మరకలను దాచలేని నీ నిస్సహాయత బయటపడుతూ
నీ మోసకారితనం బయల్పడుతూ
అసలు రంగు మాకెరుకవుతూ
నక్కిన నీ రూపు భళ్ళున తెల్లారుతూ
నగ్నంగా మాకెదురైన ఈ వేళ
నీ మాటకారితనం ఇంకెన్నాళ్ళు...

ఉరితాడుగా మారిన గడ్డిపోచ
నీ మెడకు చుట్టుకుంది
చూడు...

Saturday, June 18, 2011

నాన్నా నేనూ ఓ రాత్రి

కతలు నెమరువేసుకునే వేళ
కలలు కుప్పబోసుకుని ఏరుకునే వేళ
మీరు నేను
కూచున్న ఆ కొబ్బరాకుల చివుళ్ళ లేలేత
వెన్నెల చారలు కప్పుకున్న రాత్రి
మీ ఒడిలో తలపెట్టి నేను
నా తలలో మీ వేళ్ళు ఆప్యాయంగా నిమురుతుండగా
మీ కత వింటూ ఉంటే
ఆ రోజు అలెగ్జాండర్, నెపోలియన్ చిన్నబోయారనిపించింది...

జీవితపు సుడిగుండాలను దాటుకొని
సంసార సాగరాన్ని ఈదిన మీ బాహువుల బలం
వరమివ్వమని వేడుకుంటున్నా...

ఎందుకో మీరంటే భయం వేసేది చిన్నప్పుడు
కానీ పెరుగుతున్న తనంలో దాని వెనక
దాగిన మీ ప్రేమ అవగతమై
మీ కళ్ళలో ఎరుపు జీరల వెనక దాగిన
కన్నీటి పొర ఇప్పుడు సుస్పష్టంగా గోచరమై
నా కళ్ళనిండుగా కన్నీటి సుడులు....

ఏటికెదురీదడం
తలవంచక బతకడమే నేర్పిన
మీ బాట ఎప్పటికీ శిరోధార్యం.....

Wednesday, June 15, 2011

వెన్నెల ఖడ్గం..



పున్నమి వెన్నెల చుట్టూ
కమ్ముకుంటున్న నల్లని మబ్బుల చాటున
మాసిపోయిన చందమామ
ఈ రేయి అమవాస కానీయకు...

గుండెలలో నింపుకున్న ప్రేమ
వెండి వెన్నెలలా తన కళ్ళలో చూడాలన్న
ఆతురతను కాల మేఘం చాటుకు పోనీయకు...

రా... ఈ రాహువును సంహరించి
తిమిరాన్ని జయించి
వెన్నెల ఖడ్గాన్ని బహూకరిద్దాం...

Tuesday, June 14, 2011

ప్రవహించే ఉత్తేజం చే..


నువ్వందించిన స్ఫూర్తి
నేటికీ మా నర నరాల్లో లావాలా ప్రవహిస్తోంది...

ఆచరణలో నీవు చూపిన తెగువ
నేడు వినీలాకాశంలో అరుణతారై మెరుస్తోంది...
...
నీవభ్యసించిన వైద్య విద్య సామాజిక శస్త్ర చికిత్సగా
మార్చి విజయాన్ని ప్రోది చేసి చూపించిన
ధీరుడువి నీవు...

నువ్వొక ప్రవహించే నిరంతర ఉత్తేజానివి...

గలగల పారే సెలయేరు లాంటి నీ నవ్వు
మా హృదయాలలో పదిలం...

నీ వొరిగిపోతూ అందించిన జెండా
శత్రువు గుండెల్లో నేటికీ దడపుట్టిస్తోంది...

చే నీ రూపం
నీ పోరాట పటిమ
ప్రపంచ యువతరాన్ని నిరంతరం
మేల్కొలిపే రణన్నినాదం....

(నేడు చేగువేరా 84 వ జయంతి)

Sunday, June 12, 2011

ఉల్కలా...



పులి మీద స్వారీ చేస్తే
ఎప్పుడో ఒకప్పుడు నిన్నే తినేస్తుంది..
గుఱమో, ఒంటో, గాడిదే నయం...

అయినా స్వారీలెందుకు
నడిచిన తాబేలే గమ్యాన్ని చేరుతుందన్నది కదా నీతి...

నేల మీదున్నవాడ్ని ఎవ్వడూ తోసేయజాలడు..
ఎదుటి వాడి మాడు పగలగొట్టి తిని బలిసే వాడు
చలి చీమల చేత చిక్కక మానడు...

అధికారం కోసం ఆత్మను బలి చేసే వాడి
నవ్వులో ప్రేత కళే...

తన మంది కోసం పని చేసే వాడు
ఉన్నా ఒకటే లేక పోయినా ఒకటే...

పది మంది కోసం చచ్చేవాడే
నాకాదర్శం...

ఉపగ్రహంలా తిరుగుతూ
కుళ్ళి కృశించి నశించే కంటే
ఉల్కాపాతంలా
ఒక్కసారి మెరిసి నేలను
చేరడమే నా దృక్పథం...

Saturday, June 11, 2011

తొలకరి వేళ...


తొలివేకువ కిరణంలోని మెరుపును నేనే
తొలి మొగ్గ తొడిమను నేనే
తొలి పుష్పం రేకులోని మృధుత్వాన్ని నేనే
తొలకరి చినుకులోని చల్లదనాన్ని నేనే
తొలి చినుకు పడిన మట్టి పరిమళాన్ని నేనే
తొలి సాగుబడిలోని సాలును నేనే
తొలి విచ్చుకున్న విత్తన మొలకను నేనే
తొలి సారి విరగ కాచిన వరి వెన్నును నేనే
తొలిసారిగా ఆకుపచ్చ చందమామ మోముపై విరిసిన చిరునగవును నేనే...


Related Posts Plugin for WordPress, Blogger...