Saturday, September 28, 2013
Wednesday, September 25, 2013
విశ్రమించనివ్వండి...
అక్కున చేర్చుకోవాలన్న అక్షరాలే మరల మరల దూరంగా నెట్టేస్తుంటే
ఖాళీ అయిన వేళ్ళ మద్య ఇంత ఒంటరితనం ఒలికిపోతూ
చీకట్లను కప్పుకున్న గాలి తెరలు తెరలుగా వీస్తూ
నగ్న దేహాన్ని పూడ్చి పెడుతూంది
కాసింత ఖాళీ జాగాలో కూరుకు పోతూ
ఒకింత విశ్రమించనివ్వండి...
మానని గాయమేదో సలపరమెడుతూ చారలు దేరిన
నెత్తుటి పగుళ్ళ మద్య గడ్డకట్టిన జిగటగా వేలాడుతూ
చుట్టూ పలుచనవుతున్న జీవావరణంలోంచి తనను
తాను వెతుక్కునే లాంతరు కోసం ఆత్రంగా వేచి చూస్తూ
ఉరితాడు పేనిన చేతుల మద్య ఒరిపిడికి విరిగిన
మెడలో మూలుగు చెప్పిన రహస్యమేదో తెలియాలిప్పుడు
కాసింత ఖాళీ జాగాలో ఒరిగి పోతూ
ఒకింత విశ్రమించనివ్వండి...
Sunday, September 22, 2013
రావా....
దూరాన్ని టుప్ టుప్ మని దారప్పోగులా తెంపి
నువ్వొక్కసారి కనులముందు నిలవగానే
మా ఇంటి ముంగిటి గులాబీ నవ్వుతూ ఎరుపెక్కింది...
నువ్వొక్కసారి కనులముందు నిలవగానే
మా ఇంటి ముంగిటి గులాబీ నవ్వుతూ ఎరుపెక్కింది...
తడిచిన ఆకుల చివుళ్ళనుండి నీపై కురిసిన
చినుకుల తుంపరతో నువ్వొక్కసారి నవ్వుల వానవయ్యావు...
కాసిన్ని జాజులు కొన్ని మల్లెలు కలగలిసిన
గమ్మత్తు నైట్ క్వీన్ సువాసనేదో కమ్ముకుంది పరిసరమంతా...
వాన వెలిసాక ఇంద్రధనస్సులా ఒక్కసారిగా
వర్ణాలన్నీ ఏకమై నేతంచు జరీలా చుట్టూ విరబూసాయి...
రావా నేస్తం!
మరలా ఒక్కసారి ఈ ఆత్మను కోల్పోయిన దేహంలోకి
కాంతిపుంజంలా మరో జన్మ ప్రసాదిస్తూ...
వాన వెలిసాక ఇంద్రధనస్సులా ఒక్కసారిగా
వర్ణాలన్నీ ఏకమై నేతంచు జరీలా చుట్టూ విరబూసాయి...
రావా నేస్తం!
మరలా ఒక్కసారి ఈ ఆత్మను కోల్పోయిన దేహంలోకి
కాంతిపుంజంలా మరో జన్మ ప్రసాదిస్తూ...
Thursday, September 19, 2013
పద్మార్పిత గారికి శుభాకాంక్షలు...
అంతరంగంలోని
అంతర్ముఖాన్ని
పద కవితా చిత్రాల ద్వారా
అందంగా
ఆనందంగా
ఆత్మీయంగా
ప్రేమగా
ఆవిష్కరిస్తూ
300ల భిన్న విభిన్న
జీవన కోణాలను
అనతికాలంలోనే ప్రచురించిన
పద్మార్పిత గారికి శుభాభినందనలతో..
Wednesday, September 18, 2013
Sunday, September 15, 2013
కవిత్వంతో నా పయనం...
కవిత్వంతో నా పయనం:
కవిత్వం నన్ను నేను సంభాళించుకొని సంగ్రహించుకొని కొనసాగడానికి ఉపకరణమవుతోంది.
కాస్తా నిశ్శబ్ధాన్ని ఏరుకొని పొదువుకొని పొదగడానికి వీలు కల్పిస్తుంది.
చుట్టూ వున్న వాతావరణంలోని జీవావరణంలోని రణగొణధ్వని కృత్రిమత్వం అమానవీయత
అసహజత్వంలనుండి దూరం కావడానికి నా రాతల ద్వారా మిత్రులతో సంభాషించడానికి
ఇదొక సాధనంగా మాత్రమే నేను చేస్తున్నా.
పశుల కాపరిగా వున్న ఒంటరి పిల్లాడు తన ఒంటరితనాన్ని దూరం చేసుకునేందుకు చేతిలోని వెదురు కర్రను ఊదుతూ తనను తాను మరచినట్టుగా.
Thursday, September 12, 2013
ముసురు...
ఆలోచనల తేనెటీగల ముసురు
పట్టులో మాయ మవుతున్న తేనె
ఆకు చివర చీమల ఉసుళ్ళ పట్టు
పగలని గుడ్డులో పిల్ల చీమ విల విల
తెలవారని రాత్రిలా రోజు దీర్ఘ నిశ్వాశ
ఎగబాకుతున్న చెద మెదళ్ళని తొలుస్తూ
బొంత కుట్టులో కప్పని చిరుగు పోగు
రాలిపడని పండుటాకు చివర నీటి బొట్టు
అసంగత సంగతాల మేళవింపు
Subscribe to:
Posts (Atom)