Sunday, August 25, 2013
Monday, August 19, 2013
ఒక సమయం..
పక్షి రెక్కల టప టపల నుండి
రాలిన చినుకుల రంగు
దేహమంతా
సీతాకోక చిలుక రెక్కల నుండి
జారిపడిన పుప్పొడి
కనురెప్పల మీద
వరి పైరు మీదుగా వీచిన
గాలి పచ్చగా
పరిసరమంతా
తడిచిన మట్టి పరిమళం
కోనేటి మీదుగా
అలలు అలలుగా
రంకె వేస్తున్న కోడెద్దు కాలి
గిట్టల నుండి ఎగిరిన
ధూళి ఎర్రగా
సుదూరంగా వెదురు వనాల
నుండి గాయపడ్డ
రాగమేదో కోస్తూ
పడమటి కొండ గొంతులో
భారంగా సూరీడు
ఆత్మహత్య
ముఖం చూపలేని వెన్నెల
దు:ఖాన్ని దోసిలిలో
ఒంపుతూ
Thursday, August 15, 2013
సొతంత్రమొచ్చేసిందోచ్...
మీ వారసత్వం
కొనసాగుతూనే వుంది
నెత్తురింకిన నేలలో
ఇంకా తడిగా
జిగటగా
నాటి డయ్యర్
నేడు రాజయ్యాడు
తెలుపు నలుపుల
మిశ్రమంలో
కుట్ర కేసులూ
కొనసాగుతూ....నే
వున్నాయి
కోవర్టులు
అప్రూవర్లు
గిరీశాలు
మా చుట్టూ
కొలువుదీరే
వున్నారు
పేదరికం
పరారయిందని
వెన్నుకంటిన
కడుపుతో
గట్టిగా
చప్పట్లు
చరుస్తాం
ఆరోగ్యశ్రీలు
ఉపాధి హామీలు
ఆధార్ కార్డులు
పెన్షన్లు
రేషన్ కార్డులు
కేస్ట్ సర్టిఫికేట్ల
కోసం
మోకాళ్ళపై
నిలబడతాం
వాడి
కరకరమనే
ఖద్దరు
చొక్కా
ముందు
తలపాగా
నడుముకు
చుట్టి చేతులు
జోడిస్తూనే
వున్నాం
సూది బూట్ల
వైట్ కాలర్
వాడి ఎదుట
జీ హుజూరంటూనే
వున్నాం
మా
దేహమంతా
నిరోధ్
తొడుక్కునే
వున్నాం
ఏదేమైనా
ఏమైపోయినా
ఎవడు చచ్చినా
చంపబడినా
నడిరోడ్డుపై
అత్యాచారం
జరిగినా
మా
గూడు
పదిలంగా వుంటే
పదివేల
దణ్ణాలు
తిరుపతి
వెంకన్నకు
ప్రతి ఏడాది
మొక్కు చెల్లిస్తూనే
వున్నాం
ఏమైనా
ఎవరైనా
ఈ బతుకేందిరా
అంటే గింటే
మిడిల్ క్లాస్
కదటోయ్
ఇంతకంటే
ఏంజేయగలమని
హ్హి హ్హి హ్హి అని
పళ్ళికిలించేస్తాం
అప్పుడప్పుడు
మా సిగ్గులేని
ముఖాలతో
మీ ముందుకు
ఇలా
ఒక్కసారి
అని
తృప్తిపడనివ్వు
......
సొతంత్రమొచ్చేసిందోచ్!!!!
జై భారత్
ఇంక్విలాబ్ జిందాబాద్...
Saturday, August 10, 2013
కొకూన్స్...
ఇప్పుడంతా ఎవరి చేతులలో
వాళ్ళు బంధీలే
ఎవరి కౌగిలిలో వాళ్ళు ఊపిరాడక
ఉక్కపోతతో ఉరితనంలో
బిగియని బాహువుల మద్య గాలి
చొరబడక తల్లడిల్లుతూ ఊరడిల్లుతూ
సలపరమెట్టే గాయమే హాయిగా
పెచ్చులూడూతూ పగిలిపోతూ
ఒంటరి దాహార్తితో చౌరాస్తాలో
ఏకాకిగా పాదం పాతుకుపోతూ
రాలే ఆకుల నడుమ గూడు కూలి
గుడ్డు పగిలి ఎగిరిపోయిన
జంట పక్షి ఒంటరిగా నేల రాలుతూ...
Tuesday, August 6, 2013
Monday, August 5, 2013
Saturday, August 3, 2013
Thursday, August 1, 2013
రాతి బొమ్మల కొలువు...
మాటలన్నీ నిశ్శబ్దాన్ని కావలించుకొని
గొంతు దాటని స్వరమేదో మూగగా ఆలపిస్తూ..
పారుతున్న నదీ పాయ ఒక్కసారిగా
ఇసుక తిన్నెలోకి జారిపోతూ...
అరచేతుల గుండా ప్రవహించిన
విద్యుత్ వేలి చివరనే ఆవిరవుతూ...
ఒక్కో క్షణం వానలో తడిసిన
మట్టి గోడలా కరిగిపోతూ..
ఎండుటాకును తాకిన వాన
తడి జారిపోతూ…
జ్నాపకాలేవి మిగుల్చుకోలేని
నీ నిస్సహాయత...
నీ మౌనపు భారాన్ని మోయలేని
నా అసహాయత...
ఎదురెదురుగా కూలబడ్డ
రాతి బొమ్మల కొలువు...
(వాకిలి ఈ-పత్రికలో ప్రచురితం)
Subscribe to:
Posts (Atom)