Friday, April 26, 2013

మెలకువను మింగిన రాత్రి..

కనురెప్పల కావల దాగిన ప్రతిబింబాలను
నలుపు తెలుపు రేఖా చిత్రాలుగా మార్చుకొని...

గాలిపటాన తోక చివర అతికించి
నల్లని ఆకాశాన ఎగురవేద్దామని...

తోకను కత్తిరిస్తూ ఓ తోక చుక్క తన దేహ
కాంతిని ఓ క్షణమిచ్చి మాయమయింది...

ధడాలున నేలనంటుతూ కల చెరిగిపోని
వర్ణ చిత్రంగా ఆ పచ్చ గడ్డి కొసలపై మెరుస్తూ....

రాతిరంతా కురిసిన వాన
తడి ఆరని బురద మట్టిలో ఇంకిపోతూ...

రెక్క తెగిన పక్షి ఒకటి ఈ కాగితాన్ని
ముక్కున కరచి కుంటుకుంటూ...

చిరిగిన జెండా గుడ్డనే ఎగురవేస్తూ తూటా
దిగబడ్డ కాలితో ఓ యువకుడు పరుగులెడుతూ...

నెత్తురంటిన ముఖంతో ఖిన్నుడై
ముఖం చాటేసిన చందమామ ఆకు చాటున దాగుతూ...


ఈ  రోజు వాకిలి ఈ-పత్రికలో ప్రచురితమయింది..


2 comments:

  1. చిరిగిన జెండా గుడ్డనే ఎగురవేస్తూ తూటా
    దిగబడ్డ కాలితో ఓ యువకుడు పరుగులెడుతూ...
    నెత్తురంటిన ముఖంతో ఖిన్నుడై
    ముఖం చాటేసిన చందమామ ఆకు చాటున దాగుతూ...
    మీ శైలికి దర్పణం....బాగుందండి.

    ReplyDelete
    Replies
    1. చాన్నాళ్ళకి మీ స్పందన పొందడం ఆనందంగా వుందండీ ప్రేరణ గారూ.. అభివందనాలు..

      Delete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...