Wednesday, November 28, 2012

గాలి గోపురం..

ఓ చిన్న పొరపాటో తడబాటో
ముక్కలై గుచ్చుకుంటుంది....



తీరం చేరనీయని
ఆవేదన మిగులుతుంది....



ఉబకని కన్నీరు ఎద సంద్రంలో
తుఫాను సృష్టిస్తుంది....



నిలిచిన గాలి గోపురం
ఒక్కసారిగా ఒరిగి పోతుంది....



దిగులుతనం దీపపు సమ్మె క్రింద
నీడలా మిగులుతుంది....



కాలికింద నేల ఊబిలా
లోలోపలికి ఇంకిపోతుంది....



చినిగిన తెరచాపను అంటిన
కలల రెపరెపల రంగుల కాగితం...

ఎద తడపని వాన చినుకు
ఇగిరి పోయి బీడవుతుంది....



మళ్ళీ నీ చిరునవ్వే కదా
నాలో వెన్నెల కురిపించేది నేస్తం...

Saturday, November 24, 2012

దీప కాంతి..


నువ్వొక్క పరిచయానివేనా?
నువ్వొక్క పలకరింపువేనా??

అలా వచ్చి ఇలా వెల్లిపోయే
ఉదయపు వాన తుంపరవా?

అలా మెరిసి ఇలా మాయమయ్యే
మెరుపు విల్లువా?

అలా గాలిని కోస్తూ సుదూరాన
వినపడే వెదురు గానానివా?

అలా చల్లగా మేనును తాకి
యిలా మరలిపొయె సమీరానివా?

కాదు నేస్తం!
కలలా కరిగిపొయే కాలానివి కాదు...


నా ఎద ప్రమిదలో నిత్యం వెలిగే
దీప కాంతివి నీవు...

(నా ఎదను తట్టిలేపిన ఓ మైత్రి బంధానికి ఏడాది పూర్తయిన వేళ ఈ అక్షర మాల)

Thursday, November 22, 2012

నిప్పు రేఖలు...

 దేహాత్మలను దహించే అగ్ని 
నీ కళ్ళలో వుందని ఇప్పుడే తెలిసింది
కాస్తా ఆరకుండా అలా జ్వలించనీ...

ఎగసి పడే ఆ నిప్పు రేకల చివర
అలా నిలిచి నిలిచి దహించి పోనీ...

మాటల నివురు కఫన్ కప్పుకోకుండా
ఈ ఏడు పొరలు దాటి లోలోన
ఆపాద మస్తకం దహించి పోనీ...

కరువుదీరా ఈ కమురు వాసనను
శ్వాసించనీ...


పరిమళమేదీ అంటక మండుతున్న
నిప్పు నాళిక చివర దహించి పోనీ...


మనసు ఐమూలలన్నీ మంటలలముకొని
యుగాల మసిబారినతనాన్ని ధహించనీ...


రాజుకున్న దేహపు కాష్టం
కదలబారకుండా దహించనీ....

Monday, November 19, 2012

రా రా రష్యా రా రా..

రష్యా రష్యా రష్యా

అవును చాలా కాలమైంది నీ పేరు విని
ఎందుకో నువ్వో మాసిపోయిన జ్ఞాపకం  కాదని
నీ పేరు వింటే యిప్పటికీ నాలో అదే ఉద్వేగం...ఉత్తేజం...


సోవియట్ రిపబ్లిక్!
తలెత్తి చూస్తే ఓ అరుణ పతాక రెపరెపలు...

ధరిత్రి నిండా అరుణార్ణవం...

గుండెనిండా నిబ్బరం
పాదాలు నేలకు గట్టిగా ఆనుకొని నిలబడే నిబ్బరత్వం...

అటూ ఇటూ లక్షలాది చేతుల మానవ హారం నా చుట్టూ వున్నట్టు...

నిన్నొక మాయ పొర కమ్మి మాకు
దూరమయ్యావన్న బాధ...

కానీ నువ్వెప్పుడూ ఓడి పోని బోల్షివిక్ వే
నీ కలష్నికోవ్ ఎప్పుడు గర్జిస్తూనే వుంటుంది...

నువ్వొక ఆదర్శం
నువ్వొక ఆశయం
నువ్వొక స్వప్నం

నువ్వొక అమర వీరుని చిరునవ్వువి
నువ్వొక గోగు పూవు ఎరుపుదనానివి
నువ్వొక మందుపాతరలోని రజానివి...

రాజుకుంటూనే వుంటావు
మరల మరల నీ పేరు తలుస్తూనే వుంటాం...

సమ సమాజ నిర్మాణ పునాదికి
నువ్వొక ఊపిరిలూదే ఉత్ప్రేరకానివి...

రా రా రష్యా రా రా...
మరల మరల ఈ పల్లెలోకి పట్నంలోకి అడవిలోకి కొండ కోనల్లోకి నదీ నదాలు సముద్రాంతర్భాగంలోకి..

నువ్వొక తీరని దాహం
నువ్వొక తీరని మోహం...

ఉప్పెనలా ఉరుములా మెరుపులా
రా రా రష్యా రా రా...

(అక్టోబర్ సోవియట్ రష్యా విప్లవానికి జేజేలు పలుకుతూ...)

Saturday, November 17, 2012

ఇనుపతనం..

 అలా కాలం మంచు పట్టి
గడ్డకట్టి పలకలా మారి...

ఏదో శాపానికి గురైనట్టు
ఆవహించిన ఇనుపతనం...

ఒకరికొకరు ఒదిగి
ఒడిసిపట్టుకున్నా కరగనితనం...

రాజుకున్న రాక్షసి బొగ్గు
నివురు గప్పి తెల్లబోయినట్టు...

ఆకు సవ్వడి లేక
ఆగిన గాలి కెరటం...

చవితి చంద్రునిలా
వెన్నెల మసకబారి...

గురుతులన్నీ నెమలీకకంటిన
బియ్యపు గింజలా...

గుండె బరువును భుజం
మార్చుకునే చెలిమి కోసం...

Tuesday, November 13, 2012

ఒలికిపోతూ...


ఎక్కడో ఒక మలుపు దగ్గర
ఆగిపోవడమేనా??

మొదలుపెట్టిన గీత అలా
ఓ అసంపూర్ణ రేఖా చిత్రంగా!

కుంచెనంటిన రంగు చివరంటా
అలా ఆరిపోతూ!!

గొంతుపెగలని రాగమేదో
సుళ్ళు తిరుగుతూ లోలోపల!!

హృదయంలో అలంకరించిన 
చిత్రం పగిలిన అద్దంలో!!

పొగ మారిన నా ప్రతిబింబం
నీ కన్నీటి చుక్కలో ఒలికిపోతూ!!

Thursday, November 8, 2012

ఒక్క క్షణం...

అవును
ఒక్కోటి
అలా విడిచి వెళ్ళాలనుంటుంది...

మూసిన ద్వారాలన్నీ
భళ్ళున తెరుస్తూ....

గానుగెద్దులా కళ్ళకు గంతలు కట్టుకొని
ఈ నూనె బావి చుట్టూ తిరుగుతూ
ఇదే జీవితమంటూ నిలబడేకంటే...

ఎవడన్నాడు
ఇది బాధ్యతా రాహిత్యమని??

ఎవరికి వారే ఒక గాలిపటంలా
ఎగరాల్సిన చోట
అంతా తోక కత్తిరించినట్టు
ఎటూ ఎగరలేనితనంతో...

తరగని దూర తీరాల వెంబడి
ఇసుక తిన్నెల మూపురాలను కూలుస్తూ...

గుండె నిండా
స్వేచ్చా గాలులు శ్వాశిస్తూ...

చెలమ ఊటల దోసిలి పడుతూ
దాహం తీరా ఆస్వాదిస్తూ....

గొంతెత్తి దిగ్ధిగంతాలను ఏకం చేస్తూ
నాభిని చీల్చుకుంటూ వచ్చే
ఆదిమ రాగాన్ని ఆలాపిస్తూ....

దాగి వున్న
అనేకాలను ఏకంచేస్తూ
ధవళ వర్ణ కాంతులను
విరజిమ్ముతూ...

నింగి నుండి
ఉల్కలా భగ బగ మండుతూ...

ఒక్క క్షణం
ఒకే ఒక్క క్షణమైనా జీవించనీ....

Tuesday, November 6, 2012

తత్వమసి..

  నీతో మాటాడుతున్న
సమయమంతా
నా హృదయం
సున్నితత్వాన్ని
పొందుతోంది...

ఏమైనా
నీవు నాలో
ప్రవహించే
జీవనదివి...

దేహంలోని
ప్రతి పాయా
నీ ప్రవాహంతో
పునీతమవుతూ
ఉత్తేజితమవుతోంది...


నదినిలా
నాలో యింకనీ
ఇగనీ...


మరల మరల
వర్షిస్తూ
చిగురు తొడగనీ..

Sunday, November 4, 2012

రేణువులు

రెండు పిడికిళ్ళ నిండా తీసుకున్న ఇసుక
వేళ్ళ సందుల గుండా కరిగిపోతూ....

ఎంత తీసుకున్నా
దాచుకోలేనితనంతో ఓడిపోతూ....

కాలాన్ని అలా పట్టుకోలేనితనం
వెక్కిరిస్తూ నీముందు యిలా...

ఎంత వేడుకున్నా నీవు
నవ్వని ఆ క్షణాలు నాకెందుకు??

రాతిరంతా మూగతనంతో
గొంతుతో పాటు దేహమూ కాలిపోనీ...

యిన్నిన్ని కోల్పోయిన ఇసుక రేణువులు
మరల నీ వేలి చివర మెరుస్తూ దరి చేర్చవా??
Related Posts Plugin for WordPress, Blogger...