Monday, October 24, 2011

ఆమెకు వందనం



ఆమెను చూసినప్పుడల్లా
లోలోన గుండెనరం
ఒక్కసారిగా బాధగానో సంతోషంతోనో
మెలికపెడుతూంది....

పురిటి వాసనేస్తూ పురా జ్ఞాపకాల్నీ
ఒక్కసారి పేగు బంధంలా చుట్టుముడుతు
ఉక్కిరిబిక్కిరి చేస్తాయి...

నాకై నేను అప్పుడే చంటి పిల్లాడిలా మారి
అల్లరి చేసి చీవాట్లు తినాలనిపిస్తుంది!
విసుగు రాదే తనకి....

అల్లంతలోనే ఎప్పుడో నాకు దూరమైన
దేవత నా కనులముందు ప్రత్యక్షమై
నాలోలోపలి అలజడినంతా
తన వెచ్చని చేతిలోకి తీసుకొని
హ్యారీ పోటర్ లా విశ్వాంతరాల అంచులలోకి
తోడ్కొని పోయి
వెన్నెల లోని చల్లదనమంతా
తన చూపులలో వర్షించి
నన్ను కాంతిమంతం చేస్తూ
పరిమళభరితం చేయిస్తుంది....

ఆ స్త్రీ మూర్తికి వందనం....

Sunday, October 23, 2011

జనకేతనం

 
ఇటు అటూ ఏవో కాంతులీనుతూ
ప్రజ్వరిల్లుతూ
పదం పాడుతూ
కదం తొక్కుతూ
కదులుతున్నది దండు....

కుర్చీల కింద నేల బీటలు వారుతూ
నెత్తిపై కిరీటాలు నేలరాలుతూ
రాజముద్రలు అంతరిస్తూ
జైలు గోడలు బద్దలౌతూ
జన కేతనం రెపరెపలాడుతూ
స్వేచ్చా విపంచిక
నింగినంతా పరుచుకున్న వేళ...

ఈ నేల పులకరిస్తూ
ఊరి చివరి ఖండితుని శిరస్సు
ఫక్కున నవ్వుతూ
వెలుగులు విరజిమ్ముతుంది.....

Sunday, October 16, 2011

అసంపూర్ణ పద్యం...


జ్నాపకాలన్నీ గోడలో
మేకు వేసి వేలాడగట్టలేని నిస్సహాయత...

అలా తెరచాప చిరుగులతోనే నావలో పయనం
విరిగిపోతున్న తెడ్డు అలా ముందుకు నెట్టుతూ...

గాలి ఊసులేవీ వినబడనీయక ఉక్కపోతవేస్తూ
సంద్రం మధ్యలో దాహంతో నాలుక పిడచకట్టుతూ...

గొంతులో పాట సుళ్ళు తిరుగుతూ మూలుగుతూ
విరిగిన పాళీ రాయలేని ప్రేమలేఖ జేబులో సగం ముక్కలా...

మబ్బులన్నీ ఒక్కసారిగా దండుగా విసురుగా వస్తూ....
కంటిపై రేఖా మాత్రంగా విద్యుత్ కాంతి మసకబారుతూ....

కలలన్నీ సగానికి విరిగిపడుతున్న అలలై తీరాన తలబాదుకుంటూ...

వెలిసిన రంగులద్దిన ఆకాశం మసక చీకటిలో వెలవెలబోతూ
ఇదో అసంపూర్ణ పద్యంలా కరిగిపోనీయని మంచుగా యిలా....

Saturday, October 15, 2011

స్వేచ్చా...



కంచెలల్లికలేవీ
నా ప్రస్థానాన్ని
అడ్డుకోలేవు..

నేను
గగనాన
సాగిపోయే
స్వేచ్చా
విహంగాన్ని

భారం




ముప్పిరిగొన్న ఆలోచనలు!
మదిలో కమ్ముకున్న కారు మేఘాలు....

ఏదో కీడు శంకిస్తూ మనసంతా బాధగా మూలుగు
జవసత్వాలన్నీ సడలి ప్రాణం గిలగిలలాడుతున్నట్టు...

కాలం అక్కడే ఆగి వెక్కిరిస్తున్నట్టు...
గూడు అల్లిక మాని సాలెపురుగు కంట్లోకి చూస్తున్నట్టు...

ఉబకని కన్నీటి చుక్క కంటిపాపకు అడ్డంగా...
కాలికింద నేల బద్దలౌతూ లాక్కుంటున్నట్టు...

పండిన ఆకు నేలరాలజూస్తున్నట్టు
గాలి నిశ్శబ్ధాన్ని బిగబట్టి ఆగిపోజూస్తున్నట్టు....

గుండెలపై భారంగా ఏదో అణచిపెట్టినట్టు
ఇలా ఈ దినం ముగియనీ...

Wednesday, October 12, 2011

ఆదర్శం....




దేహమంతా గాయాల మయమైనా
పాడే వేణువు ఆదర్శం కావాలి....

నిర్బంధం ఎంతగా ఉక్కుపాదం మోపినా
గొంతు చించుకు వచ్చే నినాదం కావాలి...

నిషేధాలు ఎన్ని ఇనుప తెరలల్లినా
పొద్దు పొడుపులా పొడుచుకు వచ్చే వాక్యం కావాలి....

పెడరెక్కలు విరిచికట్టి కళ్ళలో గుండు సూదులు గుచ్చి
గుండెల్లో గురిపెట్టినా సత్యం వాక్కు కావాలి....

పాటల పల్లవిలో ప్రతి చరణంలో
నీ హృదయం నిక్షిప్తమై అజరామరం కావాలి....

(ఇలా రాసి చాలా రోజులయ్యింది...)

Friday, October 7, 2011

నాన్న మళ్ళీ బాల్యంలో

నన్నింత వాణ్ణి చేసి
ముందుకు నడిపించిన చేతులు
నేడు నిస్సహాయంగా
అచేతనంగా....

సైకిల్ తో స్కూలుకు దింపి
నాలుగక్షరాలు నేర్పించి
నాకు తోడూ నీడగావుండి

మనిషిగా నిలబెట్టిన కాళ్ళు
నేడు వడలిన కలువ కాడలులా
అచేతనంగా....

చిన్న పిల్లాడైన నాన్నకు
కథలు చెప్తూ తినిపిస్తున్న
చెల్లి అమ్మలా అగుపిస్తోంది...

నాన్న మళ్ళీ బాల్యంలో!
అమ్మ కన్నీటి సాగరంలో!!
మేము గూడు చెదరిన పక్షులులా...

(అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన నాన్నగార్ని చూసి)
Related Posts Plugin for WordPress, Blogger...