Friday, September 30, 2011

పోస్ట్ కార్డ్..




ఓ చిన్న చిట్టీ నిండా
ఇన్ని కబుర్లు నింపి
నీ అంతరంగాన్నంతా
మధించి కాసిన్ని
అమృతపు చుక్కలు జల్లి
రాసిన ఆ నాలుగు
మాటలు
ఓ స్నేహితుడా క్షేమమా!
అన్న నీ పలకరింపు
ఎంత పులకరింతగా వుండేది...
ఆ ఎదురు చూపుల
తీయదనం తిరిగి రాదేమి?
మడత పెట్టి జేబులో
గుండెకు దగ్గరగా వుంచుకొని
మధ్యలో తడుముకుంటూ
నీ వెచ్చని స్పర్శను
అనుభూతిస్తూ నడిచే వేళ
ఆ మమకారం కళ్ళలో
వెలుగును నింపేది...
ఎక్కడ దాగిపోయాయివన్నీ??

బాబూ పోస్ట్
అన్న పిలుపే కరువై
పసుపురాయని గుమ్మంలా
వెల వెల బోయింది....

Monday, September 26, 2011

చప్పుడు (నానోలు)

అద్దం
ముందు
అంతా
దోషులమే

కన్నీళ్ళు
చనుబాలు
కలుషితం
కారాదు

నచ్చిన
సంగీతం
గుండె
చప్పుడు

కాళ్ళు
రెండూ
నేలపై
స్థిరత్వం

కనులకు
మించిన
కాగడా
లేదు

(నానోలు రాద్దామని)

Friday, September 23, 2011

నీవా? నేనా??


కుప్ప బోసిన కలల్లోంచి
ఏరుకుంటున్న జ్ఞాపకాలు....

తడిగా నెత్తురంటిన శిశువు దేహంవలె
పురిటి వాసనేస్తూ
తల్లి పేగులా మెడ చుట్టూ...

తెగిపడని ఆలోచనల సంకెలలోంచి
ఒక్కో మెలిక గట్టిగా ఒరుసుకుంటూ...
గురుతుల చేద వేస్తున్నా అందని నీళ్ళ బావిలా
లోతుగా....

నల్ల మబ్బుల లోంచి సగం కోసిన వెన్నలలా
తొంగి చూస్తూ...

కాగితంపై ఒలికిపోయిన రంగుల లోంచి
గాడంగా ఓ చెరిగిపోని చిత్రం....

నీవా? నేనా?


Wednesday, September 14, 2011

వెన్నెల దోసిట పట్టి....


ఇంత పున్నమి వెన్నెలను దోసిట పట్టి
ఈ చివర నేను ఆవలి ఒడ్డున నువ్వు
కలవని సరళ రేఖలులా...
ఎన్నాళ్ళైనా
అతకని గాజు పెంకులా గాటొకటి మిగిలిన చోట...

నెత్తురోడుతున్న అక్షరాల మాటున
దాగిన
వేదన......

Saturday, September 10, 2011

ఇక్కడో...




ఇక్కడో గులకరాయి వుండాలి!
ఎవరో విసిరేసినట్టున్నారు...

ఇక్కడో ఏటి పాయ ఒరుసుకొని పారుతూ వుండాలి!
ఎవరో మింగేసినట్టున్నారు...

ఇక్కడో వట వృక్షం పిట్టల గుంపుతో కిలకిల మంటూండేది!
ఎవరో నరికేసినట్టున్నారు...

ఇక్కడో తీగ చుట్టుకొని విరగ కాస్తూ పరిమళిస్తుండాలి!
ఎవరో తుంచేసినట్టున్నారు...

ఇక్కడో పాక కడుపునిండా యింత అన్నం పెట్టేది!
ఎవరో పీకి పారేసినట్టున్నారు...

ఇక్కడో బడ్డీ కొట్టుండేది
నోటినిండా తాంబూలం ఇచ్చి వాసన పండిచ్చేది!
ఎవరో ఎత్తుకుపోయినట్టున్నారు....

ఇక్కడో ఆసుపత్రి గాయాలకు పలాస్త్రీ రాస్తూ వుండేది!
ఎవరో దొంగిలించినట్టున్నారు....

ఇక్కడో బడిగంట మోగుతూ వుండేది
అక్షరాభ్యాసం చేయిస్తూ నాలుగు పద్యాలు పాడేది!
ఎవరో జేబులో పెట్టుకు పోయినట్టున్నారు...

ఇక్కడో గుడి గోపురం ఠీవిగా నిలబడి వుండేది
గంట మోగుతూ నేనున్నానని పిలిచేది!
నేల మాళిగలో కలిసినట్టుంది...

ఇక్కడో పావురాల గుంపు ఎగురుతు వుండేది
పచ్చని ఆకు ఈనెలపై నెల వంకను పూసేది!
ఎవరో తవ్వి పారేసినట్టున్నారు....

ఇక్కడో కుర్రాడు సైకిల్ చక్రం తిప్పుతూ
పరిగెడుతుండేవాడు...
ఎవరో బొమ్మగీసి ఎత్తుకు పోయినట్టున్నారు...

Wednesday, September 7, 2011

దేహమే ఓ నేత్రమై...



ఇక్కడేదో పోగొట్టుకున్నాను అనుకొని ఒక్కటే మనసులో గుబులు...

ఎక్కడ వెతికినా కానరాదేమీ......

పోగొట్టుకున్నదేదో తెలియనిదే ఏమని వెతకను.....

అయినా ఆగదే వెతుకులాట......

చేతిలో లాంతరు పొగ మారి మసక బారుతున్నా దేహమే నేత్రమై వెతుకుతున్నా....

లోలోపల గాఢ మైన సాంద్రమైన సంద్రంగుండా అలల తెప్పలపై కదులుతూ....

అమేయమైన దీర్ఘ నిర్నిద్ర రాత్రుల గుండా చీకటి సాలెగూడు తెరలను తెంపుకుంటూ.....

నేతగాని మునివేళ్ళ మధ్య గుండా విడిపోతున్న దారాల ముడులులా....

సుడిగుండాల మధ్య నుండి పైపైకి దూసుకు వస్తున్న వేటగానివోలె......

ఇంతలో సన్నని వెన్నెల కిరణమొకటి దారుల గుండా వెలుతురు నింపుతూ.......

(అసంపూర్ణం)

Thursday, September 1, 2011

ఇప్పుడో వాక్యం కోసం వెదుకుతున్నా.....

ఇప్పుడో వాక్యం కోసం వెదుకుతున్నా....

మనసులోని వ్యాకులతను పారదోలి
వెలుగును నింపే వాక్యం కోసం...

అక్షరారణ్యంలో లేలేత చిగుళ్ళుగా
విచ్చుకునే వాక్యం కోసం.....

మడుగులోంచి విచ్చుకునే స్వచ్చమైన
పద్మంలాంటి వాక్యం కోసం....

ఆలోచనల సాలెగూడును తెంచుకు వచ్చే
దివిటీలాంటి వాక్యం కోసం....

ఎదనిండా నిబ్బరాన్ని నింపే
స్నేహితుని లాంటి వాక్యం కోసం....

రారమ్మని హృదయమంతా ప్రేమ నింపే
ప్రేయసిలాంటి వాక్యం కోసం....

నరాలలో లావాను పరుగులెత్తించే
అగ్నిపునీతలాంటి వాక్యం కోసం....

కోటి నినాదాల హోరును వినిపించే
కాంతిపుంజంవంటి వాక్యం కోసం
వెదుకుతున్నా...

.....



Related Posts Plugin for WordPress, Blogger...