Friday, March 8, 2013

నెత్తుటిలో సగం...

ఆకు చెప్పులేసుకొని
నాలుగు రొట్టెముక్కలు
మూటగట్టి
సరిహద్దు ముళ్ళకంచెలు
దాటి యవ్వనాన్ని
ఎడారి ఇసుకలో
నెత్తుటి దోసిల్లతో
పారబోస్తున్న
వాడి కనుగుడ్లలో
దాగిన నీటి చెలమ
చూసావా??

పుట్టిన గడ్డపై
నక్కి నక్కి బతకాల్సిన
దైన్యాన్ని
గట్టిగా చప్పట్లు చరిచి
ఆనందాన్ని
బిగ్గరగా పాడలేనితనాన్ని
ఏనాడైనా విన్నావా??

వాడినిక్కడ నుండి
తరుముతున్నది
నువ్వూ నేనే కదా??

వాడి సైకిలు టైరు
ఊడ బెరికి
గోళీ సోడా గొంతులో
ఉచ్చబోసి
రొట్టేముక్కను
దొంగిలించింది
నువ్వూ నేనే కదా??

నెత్తిమీది గంతల
టోపీని పీకి
మూతి మీద మొలిచిన
గెడ్డాన్ని అనుమానంగా
చూసి వాడి మొలలో
కత్తిరించబడ్డ చర్మాన్ని
కారంపూసి
వికటాట్టహాసం
చేసింది
నువ్వూ నేనే కదా??

కడుపులో దాగిన
శిశువును
మూడు చివుళ్ళ బళ్ళెంతో
ఊడ బెరికి ఎగరేసి
పేగులు జంధ్యంగా
వేసుకున్నది
నువ్వూ నేనే కదా??

వాడి మెదడులో
ఆలోచనలను
హత్యచేసి
ప్రతీకారమే
పరమావధిగా
మానవత్వాన్ని
చెరిపేసి మృగాన్ని
తట్టి లేపింది
నువ్వూ నేనే కదా??

ఈరోజు చెప్పులకంటిన
నెత్తురులో
వాడితో పాటు
సగభాగం
నీదీ నాదీ కూడా!

2 comments:

  1. నిజమే, మనమే కదా?
    ఎవరినో నిందించినా, విధి రాత అని కొట్టేసినా....కారణం నువ్వు , నేనే అన్న నిజం తెలుసుకుంటే నెత్తురే ఉండదు కదా? Great poem వర్మ గారు

    ReplyDelete
  2. ఎన్నాళ్ళకెన్నాళ్ళకు మీ మాట.. మీ స్ఫూర్తిదాయక స్పందనకు ధన్యవాదాలు జలతారువెన్నెల గారు..

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...