Saturday, December 12, 2009

గిరితనయ


నీ పాదం అంచున నిలబడి
తలపైకి ఎత్తి నిన్నుగాంచ
నాలో ఉవ్వెత్తున ఎగసిపడిన ఆలోచనా తరంగాలు


నీ నవ్వుల విరులమాటున దాగిన
సూరీడు నీ పచ్చని చీర కొంగు పట్టుకొని
దోబూచులాడుతున్నాడు

నీ తీగల ఊయలలూగుతూ ఇటువైపు
వెన్నెల రేడు నీ మూలికా సుగంధ
పరిమళాలను వెదజల్లుతున్నాడు

నీ గర్భం మాటున దాగిన సంపదను
కొల్లగొట్టజూస్తున్నాడు ఈ
దిగువన పల్లపు మానవుడు..

6 comments:

  1. మీ భావవ్యక్తీకరణ బాగుంది. కానీ "గిరితనయ" అన్నది నాకు తెలిసి పర్వతరాజ పుత్రి అయిన పార్వతీదేవికి వాడతారు. మీరిక్కడ "గిరి" నే కవితలోని మూర్తికి వాడారు కదా? మీ అర్థం వేరంటారా? పోనీ తనయ అన్నది ఆమె ఇచ్చే సంపదలుగా వాడినా, అవి మనిషి వినియోగానికే కదా, కాకపోతే దుర్వినియోగం, ప్రకృతిలో వైపరీత్యం, వాతావరణ అసమతుల్యం కారణభూతుడు మానవుడే కానీ.

    ReplyDelete
  2. గిరితనయ అని నేనన్నది సహజసంపదకలిగిన గిరిజన ఆవాసాన్నే. పార్వతీదేవిగా కాదు. పల్లపుమనిషి దోపిడీ నిరంతరం సాగుతున్నదిక్కడ. గిరిజప్రాంతమనుషులను కూడా తమ దోపిడీలో అంతర్భాగంగావించుకుంటున్నారు. మీరు సరిగానే నన్ను అర్థంచేసుకున్నారు. ఈ శీర్షికయితే ఎక్కువమంది స్పందిస్తారని చిన్న ఆశ.

    ReplyDelete
  3. మీ కవితలో నాకు మూడు విషయాలు గోచరిస్తున్నాయి. ఒకటి కొండలు, రెండు అడవులు, మూడు వాటి సంపదలను కొల్లగొట్టడానికి సిద్దపడుతున్న గిరిజనేతర మానవుడు. కాకపోతే "గిరితనయ " అనేశీర్షిక మీ ఉద్దేశంలో గిరిజన ఆవాసానికి సంబంధించినది. కాని మీరు జతపరిచిన ఫోటో హిమాలయాలను సూచిస్తున్నది. గిరితనయ అనగానే ఎవరికైనా మొదట ( కవిత పూర్తిగా చదవక ముందు ) పార్వతి గుర్తుకొస్తుంది.

    ReplyDelete
  4. మీ ఆత్మీయ స్పందనకు కృతజ్నతలు. నేను గత వారమంతా గిరిజన ఆవాసాలమద్య తిరిగాను. ఆ స్పర్శానుభూతితో రాసాను. ఫోటోలు నా సెల్తో తీసినవి అంతబాగా రాలేదు. అందుకే నేపాల్ ఫోటో వాడాను. నేను గిరితనయ అన్నది గిరులనుండి వచ్చే సంపదను దృష్టిలో పెట్టుకునే. మీకు ధన్యవాదాలు.

    ReplyDelete
  5. మీకు అభ్యుదయ భావాలు మెండు. అవ్వి మీ బ్లాగ్ లో స్పష్టంగా కనిపిస్తాయి. ఒకప్పుడు అంటే చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో మీలాగే ఏదో చేయాలని ఆత్రం ఉండేది ఇప్పుడు ఎవరి కర్మ వారిది అనిపిస్తోంది. ఎంతైనా మనకన్నా గిరిజనులే సుఖంగా ఉన్నారు. వాళ్ల రోజువారి జీవితం సరళం (అ)నాగరికుడు పాడు చేస్తే తప్ప.

    ReplyDelete
  6. రమాగారు మీ ప్రతిస్పందనకు ధన్యవాదాలు. ఎప్పుడూ ఎవరి కర్మ వారిది కాదు. మన దైనందిన జీవితాలను మనకు కనీ కనిపించని ఒక పెద్ద ధన భూతం నడిపిస్తోంది. ఇది అందరం గుర్తెరిగిననాడు సమ సమాజం వస్తుంది. దానివైపుగానే మన చూపుండాలి అన్నదే నా అభిలాష. గిరిజన జీవితాలను అల్లకల్లోలంవైపు నెడుతున్న కార్పొరేట్ నాగరికుడును ఎదుర్కొనేందుకు వాళ్ళు సమాయత్తమవుతున్నారు. తప్పదు ఇది అందరికీ. మరో మార్గాంతరంలేదు.

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...