Sunday, February 2, 2025

నేస్తమా..

ఆమె ఉదయించే సూర్యునితో 

నిత్యమూ పోటీపడే పద్మంలా 

వికసించేది 


తనో నవ్వుల చందమామలా 

ప్రతి రేయినీ వెలిగించేది 


తన కనురెప్పల వెనక 

దాచుకున్న కన్నీటి పొర 

కానరాకుండా సెలయేరు

తుళ్లింతలా ఎగసిపడేది 


తన గొంతులో ఏదో తెలియని 

మాధుర్యం చెవులలో మోగేది 


పంచుకున్న భావాలు 

కలిసి పాడిన పల్లవులు 

పాదం పాదం కలిపి తిరిగిన 

సమయాలు 


ఇప్పుడిలా మౌనంగా 

కాలం గడ్డకట్టిన వైనాన్ని 

కమ్ముకున్న చీకట్లను 

మరలా వెలిగించడం సాధ్యమా 


తన అరచేయి వెచ్చదనాన్ని 

ఏ ఋతువూ అందించలేదు 


గుండెల్లో పట్టిన ఈ మబ్బును 

మరలా తనే కదా  

చిర్నవ్వుతో వెనక్కి నెట్టేది 


ఈ ఎడబాటు ఎంత 

దు:ఖించినా తీరేది కాదు 


నేస్తమా నిన్ను త్వరగా 

చేరుకునే సమయం కోసం 

నిరీక్షిస్తున్నా


నాకోసం వేచి ఉన్నావని 

ఆ కాంతి వంతమైన 

నక్షత్రంలో నీ నవ్వు మోము 

కనిపిస్తుందిలే....


(అర్థాంతరంగా వదిలి వెళ్లిన పద్మార్పిత కోసం)

Sunday, October 4, 2020

నల్లని సంతకం..

తెరచి వేచి చూస్తున్న కనుల
తలుపు రెక్కల ముందుకు ఆమె 

ఛిద్రమైన దేహమూ చేరలేదు


లోపలి పేగు బంధము ఆశగా 

చివరి సారి తాకాలనుకున్నా

ఆమె కాలి బూడిద చేయబడింది


విరిగిన ఎముకల గూడు పట్ల 

కనికరం లేని బానిసత్వం 

నిస్సిగ్గుగా ఆమె నాలుక ముక్కను 

నములుతూ మాటాడుతోంది


అంటరాని తన దేహంలోకి

మీడియా ఒక్కో కన్నూ చొరబడి 

తన దాహాన్ని తీర్చుకో చూస్తోంది 


అన్నీ మాయం చేసినా 

భయమేదో వెంటాడుతూ 

ఆమె గుడిసెనూ తగులబెట్టింది


మనీషా నువ్వొక మొదలూ కాదూ 

చివరాఖరి ఆర్తనాదం కాదూ 

ఇది మా నిర్లజ్జ చెవులకు కంటికీ 

అంతులేని ఉద్దీపన టాబ్లెట్


మన్నించమ్మా

అనే అర్హతలేని తరం మాది


నీ నవ్వూ  నెత్తురూ కాయమూ 

మాయం చేసిన ఈ నేలపై 

నువ్వొక నల్లని తడి ఆరని కన్నీటి సంతకానివి!!

Saturday, September 26, 2020

ఎప్పటికీ ఒక పాట కొరకు..









కొన్ని ఖాళీలు 

అలా మిగిలిపోతూ వుంటాయి

 

ఒక్కొక్కరు వారి చెరగని సంతకం 

చేసి వెళ్ళిపోతారు


ఎంత అనుకరించినా దాని ముద్ర 

చెరిగిపోదు


ఖాళీలు పూరించడానికి 

ఎవరెవరో వస్తారు


కానీ ఒక్కొక్కరిదీ ఒక 

లిపిగానే మిగిలిపోతుంది


ఖాళీల మధ్య తడి ఆరని 

బంధమేదో పరిమళిస్తుంది


ఎవరి పేజీ వారిని తన లోలోపలి

పొరలలో దాచుకుంటుంది పుడమి


ఖాళీలను పూరిస్తూ కొత్త 

విత్తనమేదో చిగురిస్తుంది మరొకసారి


వేచి వుందాం చెవులు రిక్కించి

భూమి పొరలపై... 

(గాన గంధర్వ బాలు తలపులో) 

Thursday, July 23, 2020

అభ్యర్థన.











కొద్దిగా ఒత్తిగిలి 
ఈ ఆకుల ఆకాశం పైకప్పు కింద
కాసింత విశ్రమించనివ్వండి

ఈ నేలను ఇంకిన ఈ చినుకు విత్తును
కాసింత మొలకెత్తనివ్వండి

ఈ సెకనుకు సెకనుకు మధ్య ఖాళీని
కాసింత పూరించనివ్వండి

ఈ మెలకువకు సుషుప్తకు మధ్య
కాసింత విరామమివ్వండి

ఈ స్వప్నాన్ని ఆ వేకువ కొక్కేనికి
కాసింత వేలాడనీయండి!!

(రచనా కాలం8-7-2015

Thursday, June 18, 2020

అజ్ఞాత

నీ చుట్టూ ఒక వల ఏదో కంటికి కనిపించని
                                 దారంతో నేయబడి

సీతాకోక చిలుకలు ఎగురుకుంటూ
                                గుంపుగా వచ్చి

చిక్కుపడి దారమంతా రంగులమయమై
                                      పైకి తేలిపోయి

దాని చుట్టూ కొన్ని పిచుకలు మూగి
                                 మౌనాన్ని కరిగిస్తూ   

నెత్తురోడి రెక్కలు తెగి వర్ణ రహితమైన
                                    సీతాకోకచిలుకలు

కొన్ని చినుకులేవో ముక్కలుగా పగిలిన వేళ
                                          భారంగా

గాలి ఏదో దు:ఖ గీతాన్ని ఆలపిస్తూ
                        కనురెప్పలను తాకుతూ

వెదురు చివుళ్ళు మధ్య  చిక్కుకుంటూ
                                 శూన్యావరణంలో

కను రెప్పలకావల దాగిన చెలమలో
                                      ఇగిరిపోతూ!

Wednesday, April 22, 2020

మల్లెల వేళ

కాలం
వేయి నాల్కలతో
ఎగురుతూ వస్తోంది

నీకూ నాకూ మధ్య
ఓ అఖాతాన్ని
సృష్టిస్తోంది

ఈ మల్లెల వేళ
యింత ఎడబాటును
కర్కసంగా విధిస్తోంది

అయినా
అక్షరాలతో
వంతెన కడుతూన్న
నీ ముందు
కాలం మోకరిల్లుతోంది..



Monday, August 26, 2019

జాబిలిని .మింగిన వెన్నెల










యారాడ కొండల్ని‌ తాకిన
అలలు ఆ నవ్వు నురుగులో
కలగలిసి అస్తమించే సూర్యున్ని
నుదుట తిలకంలా దిద్ది
గుండె చెమ్మనంతా
కరచాలనంతో
పారదోలే ప్రేమ జగతి

ఆ ఒంటరి ఇసుక మేటలను
దాటలేక  పలవరిస్తే
జాబిల్లినే మింగిన వెన్నెలా
ఆకాశపు తేరులో‌
తను చివరిగా గానం‌
చేసిన కవితను
ఒకసారి వినిపించవూ...

(లవ్ జేకు ప్రేమతో)
Related Posts Plugin for WordPress, Blogger...