Thursday, September 25, 2014

దుఃఖ నది



ఔను 
ఇప్పుడు ఒక్కొక్క వాక్యమూ తడిని కోల్పోయి 
రాతి నాలుకతో పొడిబారిపోతోంది...

కొత్తగా క్రొంగొత్తగా మొదలెడుదామని 
నీ గీతేదో నీ పోలికతో వుండాలని
ఆశగా క్లోనింగ్ చేయగలవా...

ఈ సామూహిక మరణ తాండవం చేస్తూ
గుట్టలు గుట్టలుగా నీ బొటనవేలికే 
అన్ని వేల్ల తాళ్ళూ మెలికపడి వున్న వేళ...

. . . . . .

రహస్యంగా అతి రహస్యంగా ఒక రావి ఆకును  
తుంచి పేజీ మధ్యలో దాచుకుని ఆ ఈనెల 
గుండా ప్రవహించిన క్షణాలు...

ఈ కొండ పాదం అంచున మూలికలన్నీ తాకి 
ప్రవహిస్తూన్న నదీ జలాన్ని దోసిట పట్టి
దాహంగా స్వీకరిస్తున్న ఘడియలు...

మరల మరల నిన్ను ముసురుకుంటున్న 
సామూహిక దు:ఖమేదో మేల్కొలిపి 
నిన్నో ఝెండాగా మార్చి ఎగరేస్తుంది...

No comments:

Post a Comment

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...