Thursday, August 28, 2014

వాన కడిగిన గోడ


రావి ఆకు చివర వేలాడే నీటి బొట్టు 
స్ఫటికత కనులకింత ఓదార్పునిస్తూ

మొనదేలిన గడ్డి పోచ 
పచ్చగా వాన నీటిలో నిటారుగా ప్రతిఫలిస్తూ

తార్రోడ్డుపై నల్లగా నిగనిగలాడే 
తడితనం రిక్షా టైరుపై మరకలా మెరుస్తూ

తడిచిన కాకి గూడు చేరలేక 
దాగిన బ్రహ్మజెముడు పొద బయటపడేస్తూ

తడిచిన దేహంతో పరుగున 
దూడ తల్లి పొదుగులో దాగిపోతూ

వాన కడిగిన ఈ జైలు గోడపై ఆకాశాన్నింత దోసిట్లో 
పోసి పావురం బొమ్మ వేస్తూ....


Friday, August 22, 2014

భిక్షా పాత్రలా..


నేనో భిక్షాపాత్రలా నీ ముందు

నువ్వాడే మాట కోసం వేచి చూస్తూ

నువ్వలా విసురుగా వెనుదిరిగి పోతూ తళుక్కుమంటావు

అక్కడే కదా ఆ స్థానంలోనే అలా స్థానువయ్యాను

మరల మరలా నువ్వక్కడే ఆగుతావని

ఓ చినుకులా రాలి దప్పికగొన్న నాలో దాహమౌతావని

ఒక్కో క్షణం లెక్కిస్తూ నేనిలా 

యుగాలుగా నువ్వక్కడలా ఓ వర్ణ చిత్రంలా 

చివరి సంతకంలా 

నే
ని
లా

ఒ లి కి పో తూ....

Saturday, August 16, 2014

ప్రార్థన..


ఇప్పుడొకటే ప్రార్థన 
తెగ్గోయబడ్డ గొంతులోంచి 
నెత్తురోడుతున్న వాక్యంగా

ఈ నేలపై ఇన్ని దేహపు మాంసపు ముద్దలలోంచి 
నువు తెంచుకునే పుష్పమేమై వుంటుంది

నీ దోసిలినిండా నీళ్ళు పోసి తాగగలవా
నెత్తురు రుచిగా

కమిలిన పేగులనిండా మందుగుండు వాసనతో
ఆకలి కాలుతుందా?

దేవా!
నువు లేవని తెలిసినా
వుంటే నీ మొండి చేయితో 
వీళ్ళ నుదుటిపై చావు రేఖలను చెరిపేయగలవా?


Saturday, August 9, 2014

నెత్తుటి స్పర్శ

నువ్వలా ఒత్తిగిలి పడుకున్న వేళ
నీ గుండెలపైనుండి వేరు పడి పాప నిదురలో ఏదో కలవరింతతో
బోసి నోటితో నవ్వుతూన్నప్పుడు పక్కగా ఓ తుపాకీ మోత


గోడలో దిగబడ్డ బుల్లెట్ చేసిన రంధ్రం పిల్లెట్లు తగిలి
పాప వీపు చీరుకు పోయి నీ అరచేయినంతా నెత్తురు తడి


వీధిలో ఆవు కడుపులో గాయం చేస్తూ వాడు బాయినెట్ మొనపై
రక్తం మరకతో అరుస్తు నిర్విరామంగా కాలుస్తున్నాడు


నీ చేతిలో ఆయుధానికి మానవత్వపు కల వేలాడుతూ
గాయాలకు కట్లు కడుతూ నువ్ రిట్రీట్ అవుతున్న వేళ
హోరున వాన కురుస్తూ పాయలగుండా వెచ్చని నెత్తుటి ధార


ఒకరా ఇద్దరా ముగ్గురా పదముగ్గురు ప్రజా యోధులు
తమనే రక్షణ వలయంగా చేసి ఇన్నిన్ని ప్రాణాలను
ఒంటి చేత్తో కాపాడుతూ ఎదురొడ్డిన ఆ క్షణాలు


యింకా మీ చేతి స్పర్శ వెచ్చగా నమోదయ్యే వుంది

(1998 August 8న కోపర్ డంగ్ లో అమరులైన వారి స్మృతిలో)

Monday, August 4, 2014

యిది సమయం కాదని!!


నువ్ రోజూ కూచున్న చోటులోనే 
ఏ ఎండ పొడా పడని ఆ దిక్కులోనే 
తడి యిగరని ఆ ఐమూలలోనే 
వాడి వాలిన పూరేకును దోసిలిలో పట్టి


నీకూ తెలుసు కదా 
యిది సమయం కాదని


దాగివున్న కన్నీటి బొట్టేదో వేడిగా 
జారిపడి వాడినదేమో కదా


పసి వాళ్ళ నెత్తుటి బొట్టేదో ఎర్రగా 
ఈ చివురునంటి తుపాకీ మందు వాసనేస్తూ


ఆసుపత్రి పైనా ప్రేమికులు కలిసి వున్న చోటుపైనా
వాడొక్క తీరే మందుగుండు వేయగలడు 


నువ్వూ నేనే కదా అప్రమత్తంగ లేక 
యీ తునాతునాకలైన దేహపు గాజు ముక్కలనేరుతూ
యీ దిక్కుగా గాయాల సలపరంలో నవ్వుతున్నది


నవ్వు వాడినెప్పుడూ భయపెడుతుంది...

Friday, August 1, 2014

కొన్ని నవ్వుల మధ్య...



కొన్నిసార్లు మాటలన్నీ పోగులుపడి 
సమయమంతా క్షణాలుగా కరిగిపోయి 
నీ చుట్టూ ఇన్ని వెలుతురు పిట్టల కాంతి పరచుకుంటుంది

దేహాలు వేరైనా కన్నపేగు బంధమేదో నెత్తుటి సంబంధాన్ని 
జ్నాపకాల తెరల పై రంగుల చిత్రంగా ఆవిష్కరిస్తుంది

కాలాన్ని కరిగించి హృదయాలను తెరచి మాటాడుకుని 
దు:ఖాన్ని గొంతులో దాచి కొన్ని నవ్వులుగా వెలిగించే మనుషులున్నందుకు 
మనమింకా బతికి వున్నామన్న స్పృహనిస్తుంది

వాళ్ళకి నీకూ ఉన్న ఋణానుబంధమేదో 
నిన్నెప్పటికీ మనిషిగా నిలుపుతుంది..
Related Posts Plugin for WordPress, Blogger...