Sunday, June 29, 2014

గాయాన్ని ఊపిరి తీసుకోనివ్వు..

గాయం పులిసిన నెత్తుటి వాసనతో మత్తుగా కోత పెడుతోంది
కాసింత ఉప్పు నీళ్ళతో కడిగి శుభ్రం చేయాలేమో! 
అవసరం లేదులే అలా ఈగలు ముసిరి 
పొరలు పొరలుగా ఉబ్బి ఊడిపోతుందిలే
కట్లు కట్టి ఊరబెట్టడమెందుకు 
స్వేచ్చగా గాలికి మాననీయ్
గాయపడ్డది ఒక్కసారి కాదు కదా?
గాయమయింది ఒక్క చోటే కాదు కదా?
మానని గాటొక్కటొక్కటీ 
చెట్టు బెరడు వలే పొక్కిలి పొక్కిలిగా 
ఊడబెరుక్కుంటూ 
కొత్త చర్మపు దారాన్ని నేసుకుంటూ 
దానికదే మరల మరల 
పునర్జన్మించనీ
గాయాన్నయినా స్వేచ్చగా 
ఊపిరి పోసుకోనీయ్..

Tuesday, June 24, 2014

నల్ల చందమామలా...


సరిగ్గా ఇక్కడే నువ్వొదిలి వెళ్ళిన చోటే 
నీటి తడి ఇగిరి ఓ పాదం ద్విపద ముద్రగా ఇంకింది...


నువ్ నాటి వెళ్ళిన చోటే ఓ మొగలి రేకు 
విచ్చుకొని నెత్తురు చీరుకుంది


నువ్వలా పాట ఆపి వెళ్ళిన నాడే 
ఈ వెదురు గొంతు మూగబోయింది


నువ్ విసిరేసి పోయిన నవ్వు 
అదిగో మబ్బు తునకలో దాగుంది 
వెన్నెలనావరించిన నల్ల చందమామలా..

Thursday, June 19, 2014

రాత్రి..



రాత్రుళ్ళను కొన్ని పోగులుగా మన ముందు కుప్పబోసుకుంటాం అప్పుడప్పుడూ

ఎంత చిలికినా తరగని మౌన గానాలతో అనంతంగా అలజడులమధ్య

అప్పుడప్పుడూ మబ్బుల మధ్య వచ్చీ పోయే వెన్నెలనింత ఇసుక పోగులలో కూర్చుకుంటూ తడిగా

నవ్వులను ఏడ్పులను కలగలిపి ఇంత నెత్తుటి ముద్దగా చేసి ఇరువైపులా కనురెప్పలను అతికించి
ఆరని ఉద్వేగాగ్ని ఊపిరుల మధ్య ఉసుళ్ళను ఎగదోస్తూ

రాలిపడే మంచు తునకలు కరిగి ఉప్పు నీళ్ళ చాళ్ళుగా తెల్లగా స్ఫటికంలా మెరుస్తూ మిణుగురుల రెక్కల మధ్య

ఒక్కోసారి వాక్యమేదో విరిగి పడ్డ శబ్దావరణం కలలను మింగుతూ అస్పష్టంగా అవరోహణా క్రమంలో నీ చుట్టూ వలయంగా రాత్రి

.........

సెలవింక

......

Wednesday, June 11, 2014

వెన్నెల జెండా..

నగ్న పాదాలతో ఈ రాదారిలో నిలుచున్నా

ఒంటరిగా ఖాళీ చేతులనిండా యింత ఓరిమితో


ఈ ప్రవాహ ఉరవడి ఎరుకతో నిశ్శబ్దంగా 

ఎండ కాలమంతాన వాన రాకడ కోసం ఎదురు చూస్తూ


వాన కాలమంతాన చలిగాలికి ఎదురు నిలుస్తూ


రాలే తురాయి పూలను మోదుగు పూలను దోసిట పట్టి 


పారే సెలయేటి గలగలలను గుండెలో దాచుకొని 


ఈ సరిహద్దు గిరి శిఖరాన వెన్నెల జెండా చేత పట్టి..



వస్తావా నేస్తం
నీ నవ్వునింత భరోసాగా ఇస్తావా?

Saturday, June 7, 2014

రాతి బింబం..

రాతిపై ప్రతిఫలిస్తున్న నీడ నీటిలో 
నీ రాతి బింబం

రాతి పలకల మద్హ్య యింత చెలమ
చెలిమి చేసి దాహమవుతోంది

రెండు దోసిళ్ళ మధ్య మిగలని 
నీటి బొట్టు నీ పెదవి చివర

ఒకింత ఎండ పొడతో కాంతినింత
సంతరించుకొని ప్రతిఫలిస్తూ

పగలని రాతి పొరల మధ్య 
గుండె బెక బెకలు 

ఈ చలి రాతిరి రాతి గుహలో
రెండు రాతి బింబాలు నిశ్చలంగా

Thursday, June 5, 2014

వెదురు గొంతు..

రాశి పోసావిన్ని పూలను 
కానీ నా కనులకు నెత్తురంటిన 
జేగురు చెమ్మ తగిలి గాయం రేగుతోంది

పదాల మధ్య అతకని దారమేదో తెగుతూ 
నిశ్శబ్దాన్ని మెత్తగా కోస్తోంది

ఆకులన్నీ రాలుతున్న చప్పుళ్ళ 
మధ్య ఒకింత ఖాళీ ఏర్పడి గాలి ఊసులేవొ గుసగుసగా

రాతి పొరలమధ్య నీ ఉలికి
చెందని శిల్పమేదో ఆవిష్కృతమవుతోంది

నెమ్మదిగా ఈ మట్టి వేళ్ళ మధ్య పారే నీటిని 
దోసిలితో పట్టి గాయపడ్డ 
ఈ వెదురు గొంతులో ఒంపి పాటగా సాగిపో..
Related Posts Plugin for WordPress, Blogger...