Sunday, January 26, 2014

కాసేపలా...


కాసేపలా నడిచి వద్దాం
ఏకాంతంగా
ఒకరిలోకొకరిగా
ఎవరికి వారుగా

చల్లగా కాలికింద ఇసుక
మెత్తగా నలుగుతూ
వేసిన ముద్రలు కరుగుతూ

రెండు వెదురు ఆకులు
ఒకటికి ఒకటి
నిశ్శబ్దంగా రాసుకుంటున్నట్టు

కాసేపలా నడిచి వద్దాం
ఒకరిలోకి ఒకరు
తొంగి చూస్తూ

పెదవి దాటని రాగమేదో
పల్లవిగా సుళ్ళు తిరుగుతూ
మౌన చరణాలుగా

రెండు పావురాళ్ళ
గుర్ గుర్ శబ్దాల
ఆలాపనల మద్య పలకరింపులా

కాసేపలా నడిచి వద్దాం
నీరెండనింత దోసిలిలో పట్టి
ఒకరిలోకొకరు
ఇంకుతు వెచ్చగా

తల్లి కాళ్ళ మద్య విశ్రమిస్తున్న
ఆ కుక్క పిల్లలులా
మెడ అంచున చేతులు మెలిక వేస్తూ
.
.
.
.
కాసేపలా...

Tuesday, January 21, 2014

ఖాళీలను పూరింపుము - 2

ఖాళీలను పూరింపుము 

.............................
..........................

అవును
అతనింకా నా చేయి పట్టుకు నడిపిస్తున్నట్టే వుంది

నువ్వంటావు
యింకానా
నీ కన్రెప్పలు ముడుతలు పడుతున్నప్పుడూనా
అని

...........................
......................

అవును
అతనింకా తన మొదటి ముద్దను ఆప్యాయంగా
నోటి కందించి పొలమారితే తలపై
ఆత్మీయంగా తడుతున్నట్టు

నువ్వంటావు
యింకానా నెత్తిమీద రంగు మారుతున్నానా
అని

...........................
......................

అవును
ఆయాసంగా రొప్పుతూ గుమ్మం లోపలికి అడుగువేసిన వేళ
రారా యిలా వచ్చి కూచోమని
అనురాగాన్నంతా నుదుటిపై ముద్దుగా మార్చినట్టు

నువ్వంటావు
సగం ఆయుష్షు మింగేసిన వేళ కూడానా
అని

........................
......................

అవును

యిప్పుడీ

ఖాళీని

పూ
రిం
పు
ము

......................
....................

Monday, January 20, 2014

ఖాళీలను పూరింపుము..

ఖాళీలను పూరింపుము
.....................
..................
................

ఏమని
................
...............

కాసిన్ని పూలూ ముళ్ళూ
కప్పుతూ

................

మసిబారిన చేతులతో
తుడుస్తూ

అరచేతులనిండా
అంట్లు తోమిన చాళ్ళగుండా
ముదురుగా గరుకుగా మారిన

చేతులతో నుదుటిపై
ఎలా వున్నావురా

అని

ఆత్మీయంగా

................

................

తడిగా

ఖాళీలను

పూ
రిం
పు
ము

................

Tuesday, January 14, 2014

నిర్వికల్పం..

నీ చుట్టూ పరచుకుంటున్న నిశ్శబ్దాన్ని
గ్రహించలేనితనం

ఒకటే ఒడిదుడుకుగా అడుగులు వేస్తూ
పరుగు

అయినా ఒక్కడుగు ముందుకు
జరగనితనం

ఇన్నిన్ని మాటలు నీ ముందు
కుప్పబోసి

ఒక్కటీ ఇంకనితనంతో
ఆవిరవుతూ

రెప్ప మూతల మద్య పొర ఏదో
తడిగా ఇగురుతూ

జ్వరపు చేయి వెచ్చగా
నుదుటిపై తాకుతూ

నువ్వలా రక్తమింకిన పెదాలతో
తెల్లగా నవ్వుతూ

సమాధానంగా ఒట్టి చేతులతో
మోకరిల్లుతూ నేను!

(తే 13-01-2014 దీ రాత్రి 11.18)

Thursday, January 9, 2014

రాయబడని లేఖ...


ఇప్పుడో ప్రేమ లేఖ రాయగలనా!
 
ఆవరణమంతా రాలిన ఆకులు పూరేకులు ఎండుపుల్లలతో
నిండి గోడలన్నీ నాచు పట్టి పచ్చగా ఎండిన చోట
ఒక్కొక్కరి పేరు గోళ్ళతో చెక్కుతూ
దూరమైన గీతల మద్య ఖాళీలను
మరల పూరించలేక నలుపుదనమేదో
అతుక్కుపోయి చెమ్మ లేని పొర రాలిపోతూ

నువ్వక్కడే విసిరేసిన కాగితపు వుండ
వెలసిపోయి మూలగా ఒదిగి
అలుక్కుపోయిన అక్షరాలు
మెరుస్తున్నాయని నువ్వబద్దమాడితే

మరో మారు గుండె విరిగిన చప్పుడయి
మళ్ళీ రాయగలనా ప్రేమ లేఖ!!

Monday, January 6, 2014

ఉదయ్ కిరణ్ స్మృతిలో


ఇప్పుడు సమయాలన్నీ సందర్భం
అవుతున్న వేళ

ఒక్కొక్కరూ అలా వెళ్ళి పోతూ
కొన్ని జ్నాపకాలుగా ఫ్రేంలో ఒదిగిపోతున్న వేళ

మరుసటి రోజు ఓ గులాబీ
తరువాత వాడిపోయిన రేకులుగా

ప్రమిద చుట్టూ ఒలికిన నూనె
జిడ్డుగా నల్లగా

కాస్తంత ఎత్తిపట్టు ఒత్తిని
కాంతిలో వెతుకుతు
ఇన్ని కన్నీటి
చుక్కలను
తుడుచుకోని

రాత్రి కురిసిన
మంచు
పాదం
అంచులో
కరిగిపోతూ

పోకడ తెలీని
వార్తగా
మారి
కాసేపు
మాటల మద్యలో
మిగిలి
పొగ వలయంలా
ఎగబాకుతూ

నీ కళ్ళు
నవ్వుతూనే
మట్టిలో
కలిసిపోయే
వేళ మేమంతా
వెండితెర ఇవతల
పాన్ నములుతూ
గోడలన్నీ ఉమ్ముతూ

చిత్రం పూర్తికాకుండానే
తానే బ్లాక్ అండ్ వైట్
ఫోటోగా గోడకు
వేలాడుతున్నాడు

టాటా చెప్పని
చేయేదో
గాల్లో ఊపుతూ
సెలవింక...

(సినీ పరిశ్రమచే నిరాదరణ హత్యకు గురైన ఉదయ్ కిరణ్ స్మృతిలో)

Saturday, January 4, 2014

నిరీక్షణ...


అప్పుడప్పుడూ కాలం కొన్ని నవ్వులను మాయం చేస్తుంది

శీతల గాలులు వీస్తూ మంచు పట్టిన పువ్వులను దాచినట్టు
లోలోపల సుళ్ళు తిరిగే రాగాన్ని వేణువు తన ఊపిరి స్వరంలో దాపెట్టినట్టు
అమ్మ తన కొంగులో రూపాయి బిళ్ళను నాకోసం ముడివేసినట్టు

కానీ
మాయమయిన నవ్వులు మరల కానరాక
ఈ వంతెన చివర దోసిలిలో ఇన్ని పూరెమ్మలతో వేచి వున్నా

వస్తావా నేస్తం
మరలా కాసిన్ని నవ్వుల వెలుగు రేకలను పూయిస్తావా?
Related Posts Plugin for WordPress, Blogger...