Friday, December 27, 2013

కాగుతున్న ఋతువు..

చేతులతో కాసిన్ని ఎండుపుల్లలు పోగేస్తూ నువ్వలా నిప్పు రాజేస్తూ వుంటే కనులలో పడ్డ ఆ కాంతి ఎఱగా మెరుస్తూ చుట్టూ వెచ్చగా పరుచుకుంటూ

అరచేతులను కాపుకుంటూ బుగ్గలపై వేస్తూ లోలోపలికి వెచ్చదనాన్ని పోగేసుకుంటూ మంటను ఎగదోస్తూ వీస్తున్న చల్లగాలిని కాసింత వేడిగా మార్చుకుంటూ

ఈ చెట్ల మద్య రాలిన ఆకులను యిలా కాగబెడుతూ కరుగుతున్న మంచు బిందువులను వేలితో తాకుతూ చెంపలపై రాస్తూంటే ఝుమ్మన్న నాదం గొంతులో ఒలికిపోతూ

ద్వైతం అద్వైతంగా మారుతున్న క్షణాల మద్య రాకాసి బొగ్గులా మండుతున్న ఒంటరితనమేదో మెదడు గోళంలో పగులుతూ ఉసుళ్ళమంటను చీలుస్తూ

రెండు దేహాత్మల మద్య కాగుతున్న నిశ్శబ్దాన్ని బద్ధలుకొట్టే సమయం దూరమవుతూ కాలం చీకటి పొరల మద్య ఒదిగిపోతూ

Monday, December 23, 2013

ఆకులు రాలిన శిఖరం...



కొన్ని సార్లు ఆకులు రాలిన
చెట్లను చూస్తూ వుండి పోవాలనిపిస్తుంది

వర్షించని మేఘాలు తరలి పోతుంటే
రెప్పవేయకుండా ఆర్తిగా చూస్తూన్నట్టు

ఎక్కడో దాగిన వేరు నీరును తోడుతున్నట్టు
లోలోపల నెత్తురు చిమ్ముతూ

పడుతున్న వేటును పరాకుగా తప్పుకున్నట్టు
చేతులు అలా వడిసిపడ్తూ

గొంతు పెగలని రాగమేదో ఆలపిస్తున్నట్టు
చుట్టూ నిశ్శబ్ద సంగీతమావరిస్తూ

అక్షరమొక్కటే తలెత్తుకు నిలబడినట్టు
ఆ శిఖరం ఆకాశాన్ని తాకుతూ చిగురిస్తున్నట్టు!

Thursday, December 19, 2013

(అసంపూర్ణం)


ఏదో ఒకటి చెప్పాలని
చూడకు

ఏదో ఒకటి రాయాలనీ
చూడకు

గాయాన్ని కాస్తా సున్నితంగా
తాకరాదూ

వద్దులే
చీలికల మద్య
పేడులా అతుకు నిలవదు

మనసు
విప్పడానికి
ఉల్లి పొరలులా
చినిగిపోతూ వీడదు కదా!

దేనికదే
ఒక్కోటీ
తన తన
అభావాన్ని
కప్పుకుంటూ
పేలిపోనీ

దాయలేనితనమెప్పుడూ
పత్తి పువ్వులా
విచ్చుకుంటూనే
వుండాలి కదా!

అతకనితనమే
నిన్నూ
నన్నూ
నిలువరిస్తూ
నిప్పులా
రాజేస్తుంది......

పసరికతనం..

 
నాలుగ్గోడల
మద్య
ఊపిరాడనీయని
రంగు
వాసన
నన్ను
నిలవనీయదు!

కాసిన్ని
నీళ్ళు
పోసి

మొక్కనలా
తాకితే
పసరికతనమేదో
దేహమంతా
వ్యాపించి
నన్ను
గుర్తు చేస్తుంది!!

Wednesday, December 11, 2013

అతడు...

అతడెప్పుడూ గాయాల్ని మోసుకు తిరుగుతాడు
దేహమంతా ఓ మూలిక చిగురిస్తున్నట్టు
కళ్ళలో వెలుతురుతో

అతడెప్పుడూ గాయాల్ని గానం చేస్తూ తిరుగుతాడు
అంతరంగంలోని ఆగ్రహాన్ని నినాదంలా మార్చి
అందరి గొంతులో

అతడెప్పుడూ గాయాల్ని తూటాలా మార్చి తిరుగుతాడు
నెత్తుటి బాకీని తుపాకీ మొనకు బాయ్ నెట్ గా గుచ్చి
అందరి భుజాలపై

అతడెప్పుడూ గాయాల్ని ఝెండాలా ఎగరేస్తూ తిరుగుతాడు
మట్టిలోని జ్నాపకాల్ని తవ్వి పోస్తూ
అందరి చేతులలో

అతడెప్పుడూ గాయాల్ని పూలగుత్తులుగా మార్చి తిరుగుతాడు
ఓటమిలోంచి గెలుపు బాటను వేస్తూ
అందరి చిరునవ్వులలో

Monday, December 9, 2013

ఇడియట్ పోస్ట్

 
ఎవరూ రారిప్పుడు
ఓ ఇడియట్ ని చూడ్డానికి

తెలీనితనమో
తెలివిలేనితనమో

పసిమనసో
మసి మనసో

తెలియక చేసిన
తెలిసి చేసినా

ఒఠ్ఠి మూర్ఖత్వమో
ఒంటరితనమో

వదిలెల్తావా
వదిలేస్తావా

ఎంగిలి పంచుకున్న
ఐస్ క్రీమ్ కరగకముందే

రావి ఆకు పై రాసుకున్న
బాసలన్నీ చెరిపేస్తావా

గడ్డకట్టిన ఎదపై
కాసింత నిదురరాని 
మెలకువ కాలేవా??

(పోరా ఇడియట్ అన్న నేస్తానికి)

Related Posts Plugin for WordPress, Blogger...