Wednesday, March 27, 2013

రంగు


ఈ రంగు వెలసిన ఆకాశానికి
కాసింత రంగును అద్దండి...

ఈ ఆకు రాలిన చెట్టుకు
కాసింత చిగురును తొడగండి...

ఈ వాసన లేని గాలికి
కాసింత పరిమళాన్ని వెదజల్లండి...

ఈ నవ్వును కోల్పోయిన ముఖానికి
కాసింత రంగును నవ్వును పూయండి...

Wednesday, March 13, 2013

దీపాల దీవిలో...

నడచిన దారెంట ఇన్ని రాలిన పూల గురుతులు
రాక మరచిన అతిథిలా...

దప్పిక తీరని గొంతులో ఇన్ని తేనె మాటలు
ఒంపిన క్షణాలు...

కాలం పరుగుపెడుతున్న ఈ దీపాల దీవిలో
నడక సాగుతూనే...

వెచ్చని తడి ఆరని సంధ్య మలుపులో
ఆకలి తీరని కళ్ళు...

ఒక్కడే దివిటీగా మండుతున్న హృదయంతో
విషాద గీతమాలపిస్తూ...

అగ్ని పూల చెండులో దారంగా మారుతు
భగ భగ మండుతూ...

ఆకాశంలో ఆ చిగురున ఓ మిణుగురు
ఎర్రగా అంతర్థానమవుతూ...

Tuesday, March 12, 2013

లేలేతగా...

హృదయంపై బాసింపట్టు వేసిన
జ్నాపకాలు...

దేహమంతా ఇప్పపూల వాసనేస్తూ
మత్తుగా...

దాహం తీర్చని జీలుగు కల్లులా
గొంతు దిగుతూ...

చిగురు మామిడి లేలేత ఆకులా
చేతి కంటుతూ...

ఈ రాతి బాటలో అరి పాదం
మండుతూ...

Friday, March 8, 2013

నెత్తుటిలో సగం...

ఆకు చెప్పులేసుకొని
నాలుగు రొట్టెముక్కలు
మూటగట్టి
సరిహద్దు ముళ్ళకంచెలు
దాటి యవ్వనాన్ని
ఎడారి ఇసుకలో
నెత్తుటి దోసిల్లతో
పారబోస్తున్న
వాడి కనుగుడ్లలో
దాగిన నీటి చెలమ
చూసావా??

పుట్టిన గడ్డపై
నక్కి నక్కి బతకాల్సిన
దైన్యాన్ని
గట్టిగా చప్పట్లు చరిచి
ఆనందాన్ని
బిగ్గరగా పాడలేనితనాన్ని
ఏనాడైనా విన్నావా??

వాడినిక్కడ నుండి
తరుముతున్నది
నువ్వూ నేనే కదా??

వాడి సైకిలు టైరు
ఊడ బెరికి
గోళీ సోడా గొంతులో
ఉచ్చబోసి
రొట్టేముక్కను
దొంగిలించింది
నువ్వూ నేనే కదా??

నెత్తిమీది గంతల
టోపీని పీకి
మూతి మీద మొలిచిన
గెడ్డాన్ని అనుమానంగా
చూసి వాడి మొలలో
కత్తిరించబడ్డ చర్మాన్ని
కారంపూసి
వికటాట్టహాసం
చేసింది
నువ్వూ నేనే కదా??

కడుపులో దాగిన
శిశువును
మూడు చివుళ్ళ బళ్ళెంతో
ఊడ బెరికి ఎగరేసి
పేగులు జంధ్యంగా
వేసుకున్నది
నువ్వూ నేనే కదా??

వాడి మెదడులో
ఆలోచనలను
హత్యచేసి
ప్రతీకారమే
పరమావధిగా
మానవత్వాన్ని
చెరిపేసి మృగాన్ని
తట్టి లేపింది
నువ్వూ నేనే కదా??

ఈరోజు చెప్పులకంటిన
నెత్తురులో
వాడితో పాటు
సగభాగం
నీదీ నాదీ కూడా!

Tuesday, March 5, 2013

నిశ్శబ్ధ రేఖ...


ఇలా తడి ఇసుక పై వేలితో రాస్తూ
ఎదురెదురుగా...

ఒంటరితనాన్ని అల ఒకటి
మింగి పాలనురుగును పాదాల కద్దింది...

ఇంతలో ఓ నత్త నెమ్మదిగా
చేరి నీ కాలి గోరును ముద్దాడుతూ...

ఒడ్డుకు చేరిన తెల్లని శంఖమొకటి
సాయంత్రపు నీరెండలో మెరుస్తూ...

గవ్వలేరుకుంటున్న చిన్నారి
మొఖంలో వెలుతురు నవ్వుతూ...

పల్లీలు ఒక్కోటీ నములుతూ
మౌనాన్ని మింగుతున్న...

బద్ధలు కాని నిశ్శబ్ధాన్ని
మన మధ్య గీసిన చిత్రకారుడెవ్వడో..

నెత్తురోడుతూ...


ఇప్పుడేమి రాసినా తడిమినా
వేడి నెత్తురంటుతూనే వుంది...

అప్పుడే చాయ్ తాగి
హుష్ అంటూ భుజంపై వాలిన కాకిని
తోలుకుంటూ నడుస్తున్నా...

ఎవరిదో భుజంపై అరచేయి
తడుతూ బాగున్నావా అని పలకరిస్తూ
ఇంత నెత్తురు ముద్దను పులుముతూ...

ఇంటి ముందర కాళ్ళు రెండూ
తెగిపడిన పిల్లాడి చుట్టూ జనం
కనుగుడ్లలో నెత్తురు చిమ్ముతూ...

సైకిల్ టైరు చుట్టూ మేకులు దిగబడి
గాలి లేక వంకర్లు పోతున్నా తోలుకుంటూ
జారిపోతున్న పైజామా ఎగదోస్తూ
ఓ కుర్రాడు పరిగెత్తుకొస్తూ...

ఇవేవీ పట్టని ఆ అవ్వ ఇన్ని గులాబీ పూలు
బుట్టలో వేసుకొని వీధి వెంట మౌనంగా నడుస్తూ...

రాతిరి కాస్తున్న నెలవంక ముఖంపై
నెత్తుటి గాయం అలా పచ్చిగానే వేలాడుతూ....

Related Posts Plugin for WordPress, Blogger...