Friday, January 21, 2011

తడి












ఇప్పుడేదో అంతా
ఎడారి పరుచుకున్నట్లు
పాదాలు ఎర్రని ఎండలో
కూరుకుపోతున్నట్లు
అరచేతులలో తడి
ఆరినతనం..

దేనిని తాకినా
ఏదో రబ్బరు తొడుగు
దేహమంతా
కప్పబడినట్లు
స్పర్శ కోల్పోయినతనం..


కనుల లోయలో
పరచుకున్న
ఎండమావులు....
గాజు కళ్ళుగా
మారిపోయాయన్నట్టు
ఏదీ ఇంకనితనం..


అంతా రంగు రుచి లేని
కషాయంలా గొంతులో
ఏదో విషం దిగుతున్నా
బాధ తెలియని
శిలాజంలా...


ఒంటరితనంవైపు
మొగ్గుతూ బాహ్యాంతరాలలో
ఏదో నిషేధ ఘోష


చుట్టూరా కమ్ముకున్న
ఈ సమ్మె వాతావరణంలో
నాలుక పిడచకట్టి
గొంతెండిన వేసవితనం
వెంటాడుతోంది...


ఎక్కడో దాగిన కాసింత
కన్నీటి ఊట
నన్నింకా ఇలా
మనిషిలా(?)
నీముందు...

(ఈ కవిత ముందుగా 'పొద్దు' లో వచ్చింది)

10 comments:

  1. arachetilonE kaadu tadi ekkadaa kanapaddamu lEdu.......aa tadi kosam vEdukutoo.....meeku kanipistE naaku chepparoo...

    ReplyDelete
  2. వర్మ గారూ...first things first....సారీ ఎందుకు?..నిజానికి ...నేను మీకు thannks చెప్పాలి..ఎంతో ప్రేమతో 'మీ వ్యాఖ్య కోసం' అన్నారు...
    ఏ మనిషైనా ఏదో వొక సందర్భంలో (లేక) కొన్ని సందర్భాలలో వొక alienation (అలీనతనం...ఏదీ అంటని...లేక ..ఏదీ అంటించుకొని తనం అనొచ్చా....?) కి గురవుతాడు....విషాదమేమంటే....మనం బతుకుతున్న సందర్భాలన్నీ SUM OF ALIENATIONS కావడం...
    మీ కవిత లో ఆ స్థితి ని శక్తివంతంగా చెప్పారు....మంచి కవిత...నిస్సందేహంగా!...ఈ కవిత ని వొక ఆశ తో ముగించడం మరీ బాగుంది..."ఎక్కడో దాగిన కాసింత/కన్నీటి ఊట/నన్నింకా ఇలా మనిషిలా(?) నీముందు...".....
    నేను బలంగా నమ్మే విషయం వొకటుంది...సృజన ఏదయినా మనిషి లోకాన్ని దర్శించే అద్దానికి పట్టిన మకిలిని తుడిచి, సరయిన దృష్టిని ప్రసాదించి, చివరన మనిషికి బతుకు పట్ల కాస్తయినా వొక ఆశనీ, నమ్మకాన్ని యివ్వాలి. ఆ పనిని ఈ కవిత చేసింది.. అభినందనలతో....

    ReplyDelete
  3. "కనుల లోయలో
    పరచుకున్న
    ఎండమావులు....
    గాజు కళ్ళుగా
    మారిపోయాయన్నట్టు
    ఏదీ ఇంకనితనం..".......... చాలా సహజంగా, హత్తుకునేలా ఉంది వర్మగారు...

    ReplyDelete
  4. విజయ్ కుమార్ సార్ ధన్యవాదాలు...మీ వ్యాఖ్యతో ఎక్కడో దాగిన అసంతృప్తి పోయింది...

    ReplyDelete
  5. శోభారాజు గారు ధన్యవాదాలు మేడం...

    ReplyDelete
  6. యాకూబ్ సార్ మీరు చదివారన్నదే నాకు గొప్ప ఉత్సాహాన్నిచ్చింది.. మీ వ్యాఖ్యతో మరింత.........ధన్యవాదాలు సార్..

    ReplyDelete
  7. జాన్ హైడ్ కనుమూరిగారు ధన్యవాదాలు సార్...

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...