Saturday, November 14, 2009

రెక్కలు రాలిన ఎర్ర గులాబీ


మీరు రోజూ తాగి పారేసే సిగరెట్ల ఖర్చులో
అర
శాతమైనా బొచ్చెలో వెయ్యి బాబూ!
మీరు
ప్రతి క్షణమూ మీ సెల్ తో పలకరించే
మీ శ్రేయోభిలాషి కాల్ ఖర్చులో
ఒకటో వంతు ఇలా విదిలించేయి బాబూ!
రంయ్యిన మీ గర్ల్ ఫ్రెండ్ తో షికారుకయ్యే పెట్రోల్ ఖర్చులో
ఒక చుక్క విలువైనా విసిరేయి బాబూ!


సిగ్నల్ లైట్ వెలిగి ఆరిపోయే లోపు
నేను
వేసే పిల్లిమొగ్గలను లెక్కపెట్టగలవా?
చక్ర౦లో౦చి దేహాన్ని మెలికలు తిప్పిన
నా
నేర్పరితనాన్ని ఒక్కసారి చూసావా?
తాడుపై నా నడక నైపుణ్యాన్ని చూసావా?

మీరు
తిని పారేసే కాగితపు పొట్లాలలో
మిగిలింది ఏరుకోవడానికి నేనిప్పుడు
ఒక
అంతర్రాష్ట్ర యుద్ధాన్నేచేయాలి!

రైలు బండిలో మీ సీట్లకింద బుగ్గిని
తుడిచే
పిలగాడినీ నేనే?
మీ
ఎంగిలి ప్లేట్లను కడిగి మీరు తిన్న బల్లలను ఉడ్చి
నా
చేతి వేళ్ళు ఊరిపోయి చేప పిల్లలలా
తెల్లగా
పాలిపోయాయి!

ఖాకీ
బాబులకు నెలవారీ కేసుల లోటు తీర్చేది నేనే
రక్తం రుచిమరిగిన ఈ తెల్లపులుల మద్య
ప్రతి క్షణం
వేటాడబడుతున్నాను

ఏతల్లి
చేసిన పాపానికో మీ పుణ్యమూర్తుల
లోకాన ఉమ్మివేయబడ్డాను
నాయీ
పాపిష్టిజన్మకు విముక్తి ఎన్నడో?

నాకెవరిమీద అసూయ లేదు బాబయ్యా
మీరంతా మీ పిల్లల౦తా మీ కోటు జేబులకు
ఎర్రగులాబీలను
గుచ్చుకో౦డి!

నేనీ రాతిరి అమావాస్య చీకటిలో
రైలు పట్టా పక్కన నిశీధి స౦గీతాన్ని
విరిగిన వేణువుతో ఆలపిస్తాను.....

5 comments:

  1. ఎంత బాధగా ఉందో ఇది చదువుతూ ఉంటే. ఈ కవిత చాలా బాగుంది. ఎంత దైన్యంగా ఉందో.

    ReplyDelete
  2. ధన్యవాదాలు జయగారు. నేను రాసినదానికంటే వారి జీవితం మరింత దయనీయంగా వుంటుంది. మనం చూసేది పైపైన మాత్రమే కదా? వారి మనసులో ఇంకేముందో?

    ReplyDelete
  3. మీ కవిత బాగుంది. వారి అభాగ్య జీవితాలు బాగా చిత్రించారు. చెయ్యాలి అనుకున్న చెయ్యలేని అసహాయత.

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...