Wednesday, December 31, 2014

ఆఖరి పేజీ..


కాలెండర్ ఆఖరి పేజీని చించేస్తావు

కానీ 
అది మిగిల్చిన జ్ఞాపకాన్ని 
గాయాన్ని మరిచిపోగలవా?

నువ్వంటావు 
ఇన్ని నీళ్ళు కుమ్మరించుకో
అవే కడిగి వేస్తాయని

కానీ గాయం నెత్తురంటినది కదా!

Thursday, December 18, 2014

నీలి పూలు


ఒక్కో కాలంలో ఒక్కో రీతిన తగులబడిపోతాను 
ఈ చలి మంట వేళ నీ చేతి వేళ్ళలో ఎండు పుల్లలులా


అంతలో నువు మంత్రించిన దుఃఖ జలమేదో చల్లి 
కనులు తుడిచి బూడిదలోంచి మరల జన్మనిస్తావు


ఈ మంచు దుప్పటి కరిగి నీలి పూలన్నీ విచ్చుకుంటాయి

.
.
.

......

Tuesday, December 16, 2014

అపరిచిత వాక్యంలా...



ఎప్పుడో ఒక్కసారైనా అలా ఓ గాలి కెరటం విసురుగా తాకి 
ముసురుకున్న కారు మబ్బులను తొలగిస్తాయా

కాసేపలా ఈ క్రీనీడల మాటున మరిచిపోయిన ఊసులేవో 
పోగు చేసుకుని పొత్తిళ్ళలో దాచుకుందాం

వద్దులే మరల మరల ఇవే మాటలు 
నీకూ నాకూ విసుగు తెప్పిస్తాయి 

ఇలా ఖాళీగానే అపరిచిత వాక్యాలుగా 
మిగిలి వెంటాడి వేధించనీయ్

ఇదేదో అలవాటుగా మారి 
గాయంపై బొబ్బలా ఉబికి చిట్లి సలపరమెట్టనీయ్

. . . . . . . . .

Saturday, December 6, 2014

రాతి బింబం


చల్లగా ఒక మృత్యు స్పర్శలా ఈ చలి 
కంతల దుప్పట్లో దూరి ఎముకలను కొరుకుతూ 
గజగజా వణికిస్తూ మలేరియాలా

మనసు కుంపటిలో రాజేయని నిప్పులా 
కఫన్ కప్పుకున్న దేహం అచేతనంగా 
రాలుతున్న ఆకు స్పర్శ లేక


ఈ కదలని రాతి బింబం చుట్టూ 
పొగ మంచు తెర అల్లుకుంటూ 
దగ్ధమవుతున్న నెలవంక

Tuesday, December 2, 2014

నెత్తుటి పుష్పం..


నీ చుట్టూ ఇన్ని కాగితప్పూలు 
ఎరుపు పసుపు నీలం వర్ణాలలో


కమిలిన నీ అరచెతులలో 
రాలిన పూరెక్కలు ఓదార్పుగా

సరే నువ్వంటావు ఈ నిదుర పట్టని కనులకు 
కలల మోహం వీడదే అని


ఈ గోడపై అలికిన ముగ్గు రంగు వెలిసి పోతూ 
గూటిలోని దీపం మసిబారి సూరీడి కంట కన్నీరొలుకుతూ


రాత్రి నీ పొత్తికడుపులో బలంగా వాడు తన్నిన బాధ మెలిక పెడుతూ 
నేలపై మొకాళ్ళ మధ్య లుంగలు చుట్టుకు పోయిన దేహం


గుండెలో వాడి బూతులు సూదుళ్ళా గుచ్చుతూ 
నోటిలో ఉప్పగా నెత్తుటి ఊటై


గాట్లు పడ్డ రొమ్ముపై ఒరిగిన లేత పెదాల కోసం 
లేని శక్తిని కూడగట్టుకొని 
మరల ఈ దినం ద్వారబంధం ముందు నువ్వొక నెత్తుటి పూవులా

ప్రజాశక్తి 'సోపతి'లో నా కవిత 'గురి చూసే పద్యం కోసం'


Related Posts Plugin for WordPress, Blogger...