నాకు ఈరోజు ఓ గొప్ప అవార్డు దక్కింది. ఎన్నాళ్ళుగానో ఎందుకురా పుస్తకమేసావు అని రోజూ బాధపడుతూ వుండేవాడిని. ఈ మూల వుండి పుస్తకం అచ్చేసుకుని వేసిన వాటిలో ఓ నూట ఏభై కాపీలు పైగా పంచుకొని మిగిలినవి అటకమీద పడేసి వాటిని చూస్తూ ఇంక పుస్తకాలు వేసుకోకూడదు అనుకుంటు మొన్న ఒకసారి మోహన్ రిషి పోస్ట్ చూసి రాసుకున్న ఈ చిరునామాకు పంపించా. దేవులపల్లి క్రిష్ణమూర్తి గారితో ఈ పరిచయమే తప్ప తనతో ముఖాముఖీ మాట కూడా లేకపోయినా అంత సీనియర్ కథకులు నవలాకారులు అయి వుండి ఇన్ని ప్రేమ వాక్యాలు నాకోసం రాస్తూ నా పుస్తక ముఖచిత్రాన్ని కూడా కార్దు పై వేసి తమ ఆత్మీయతను ఇలా పంపినందుకు ఈ రోజు గాల్లో తేలినట్టు వుంది.
ఆయన వాక్యాలివిః
ప్రియమైన కెక్యూబ్ వర్మగారికి నమస్కరిస్తూ..
పార్వతీపురం నుండి ఈ రోజే దిగింరో 'రెప్పల వంతెన'
వెంటనే దానిపై నుండి మీ లోకాన్ని వీక్షించాను.
ఎంత అందమైన కవిత్వం. చాలా కాలానికో మంచి కవితా సంకలనాన్ని ఆసాంతం చదువగలిగాను.
ఈ మధ్య కాలంలో చదువాలంటె ఒక బంగిన ముందుకు సాగనివ్వటం లేదు. ఈ కవిత్వం అట్లాంటిది మొదలుపెట్టి చివరిదాకా చదివించింది మీ రెప్పల వంతెన. ముఖ్యంగా 'వాన' లో ప్రతి మూడు పాదాలు ఓ రేఖా చిత్రంగా కన్పించినయి.
కాసేపు నిశ్శబ్దాన్ని పాటిద్దాం
అడవి అంతా వెన్నెల పరచుకొంటొంది
కాసింత దోసిలి పట్టండి
ఎవరో నిశ్శబ్ద గీతాన్ని ఆలపిస్తున్నారు
గుండె గది తాళం చెవి తీయండి.
కాసింత విశ్రమించనివ్వండి
కనుల ముందు కదలాడుతున్న
రక్తసిక్త గాయాల నుండి
కనుల లోయలో కరిగి పోని కలల నుండి
కాసిన్ని కలవరింతలనేరుకొని కలబోసుకోవడానికి
ఎంత మంచి భావన. బాగుంది
స్థూపం మీది పేర్లు-
ఇవి పేర్లు మాత్రమేనా, వెయ్యేళ్ళ యుద్ధనావను నడిపిన సరంగుల ఆనవాళ్ళు
రేపటి సూర్యోదయానికి అరుణిమను పూసింది.
ఎంత బాగుంది. చక్కటి భావన
ఈ రెప్పల వంతెన అంచున నిలబడి ఒక్కో దారప్పోగును పేనుతూ, అక్షరాల అల్లికలల్లుతూ మీరు వ్రాసిన ఈ కవిత్వం నన్నెంతో కదిలించింది. మీరు సన్నని తీగలను నిశ్శబ్ధంగా మీటుతూ రక్తజ్వలన సంగీతాన్ని ఆలపించిన గీతాలను విన్నాను.
గోడ ఎక్కడో ఒరిగిపోయిన వీరిని చివరి పిలుపు
గోడలన్నీ నినాదాల గేయాలు
గోడ యుద్ధ నగారా
గోడ ఆత్మీయ చిత్రంగా ఆలింగనం చేసుకొని చేదతీర్చే రావి చెట్టు.
ఎంత మంచి భావన.
నెలవంక వెనకాల నడకలో మీ గూర్చి తెలుసుకున్నాను. ఆనందించాను. అట్,ఏ అలికిడిలేనితనం---
అఫ్సర్ ముందు మాట బాగుంది,
ఎంతో ప్రేమతో పంపించినందులకు కృతజ్ఞతలు---
ఏకబిగిన పుస్తకమంతా చదివాను.
కనురెప్పల వంతెన కింద నల్ల రేఖనై కరిగి పోయా
నెలవంక వెనకాల నడకనయ్యా.
జయహో---
మీ
దేవులపల్లి కృష్ణమూర్తి
07-09-2014.
ఇంతకంటే కవిత్వం నుండి ఏమాశించగలను. ఆ పెద్దాయన ఇన్ని వెన్నెల మాటలను కుప్పగా బోసి ఇస్తే రెండు చేతులూ జోడించి నమస్కరించగలను తప్ప..