Tuesday, February 25, 2014

కాసిన్ని పూలూ నేత వస్త్రాలు...

 
నువ్వెప్పుడో వదిలి వెళ్ళిన నూనె అంటిన పూలు
పరిమళిస్తున్నాయింకా ఈ దోసిలిలో


జ్ఞాపకాలన్నీ ఒక్కోసారి దారప్పోగులనంటీ అంటని
జిగురులా జారిపోతాయేమో

అయినా అల్లబడని వస్త్రం సారె పైన రంగు పట్టని
నూలుపోగులా

వదిలేయి కాసిన్ని పూలూ నేత వస్త్రాలు
ఒక మూలగా

ఎప్పుడో ఒక ఖాళీ మాటల పోగుల మద్య
పాడబడని పల్లవిలా

ప్రమిద అంచులోని వెలుగు జాడల వెనక
దాగిన నీడలా

దేహమంతా ఒక సలపరమేదో కమ్ముకుని
కాసింత పూలెండిన మట్టినద్దుకోనీ 
ఈ పూట

Monday, February 24, 2014

ఇప్పుడొక ఆఖరి మాట కావాలి..


ఇప్పుడొక ఆఖరి మాట కావాలి

అప్పుడెప్పుడో వాగ్ధానం చేసి మరచిపోయినది


ఏదో పేజీ మధ్యలో వదిలేసి పోయిన బియ్యం గింజలాంటి మాట

అసంపూర్ణంగా వదిలేసిన వర్ణ చిత్రంలోని గీతలాంటి మాట

సల్ల కుండలో ఆఖరి చుక్కలాంటి మాట

రాయబడని పద్యంలాంటి మాట

ఆఖరి మాట కావాలి
Related Posts Plugin for WordPress, Blogger...