Friday, May 31, 2013

యత్నం..


చేతులలోకి ఇంత మట్టిని తీసుకొని
తడినద్దుతూ ఓ బొమ్మ చేసే ప్రయత్నం...

పిడికిలిలోకి ఉలినందుకొని రాతినిలా
నిలబెడుతూ ఓ శిల్పం చెక్కే ప్రయత్నం...

ఇన్ని దారప్పోగులను వేళ్ళ మద్య
తీసుకుంటూ నేత నేసే ప్రయత్నం...

ఇన్నిన్ని రంగులను ఒంపుకొని
కుంచెతో చిత్రం గీసే ప్రయత్నం...

రాజుకున్న బొగ్గుల మద్య ఇనుప కడ్డీని
సమ్మెటతో మోదుతూ ఓ పనిముట్టు చేసే ప్రయత్నం...

మనసులోకి ఇన్ని తడి అక్షరాలను ఒంపుకొని
కాగితంపై కవిత చేద్దామని విఫల యత్నం,,,

Friday, May 24, 2013

ఎండ కాలం...


రోడ్డు మీద కాలుతున్న రాతి వాసనతో
మనసు కూడా…


మౌనంగా ఆకుల తేమను హరిస్తూ
గొంతు పెగలనితనం…


ఆరిపోతున్న చెలమలోని తడి
దేహమంతా భారమౌతూ…


దోసిలిలో నిప్పుల కుంపటితో
గుండె మండుతూ…


కన్నులలో ఇగిరిపోతున్న నీటి పాయ
రెప్పలముందు వడగాడ్పు…


కలలన్నీ ధూళి కమ్ముకుంటు
చినిగిన తెర పైకి లేస్తూ…

Wednesday, May 15, 2013

రంగద్దని చిత్రం...



కనులముందు పరచుకున్న కాన్వాసుపై
ఇన్ని రంగులు అద్దుతూ...

కొంచెం చీకటిని వెలుగును నలుపు తెలుపుల
మద్య పొదుగుతూ...

రాత్రి మిణుగురుల కాంతిని ఒక్కో గీత
అంచుల నింపుతూ...

అసంపూర్ణత్వమేదో కుంచె చివర
వర్ణాల వెనకాల విరిగిపోతూ...

విసురుగా వీస్తున్న గాలి కెరటాల వేగానికి
ఆకు అంచులా చినిగిపోతూ...

నెలవంక వెనకాల పరుగులెడుతున్న
కుందేలు కాలి ముద్రలు అతుకుతూ...

చెవిలో వినిపించీ మనసులో ఇంకని
స్వరమేదో రొదపెడుతూ...

గాయం నుండి స్రవిస్తున్న నెత్తురు
కాగితపు చివరల ఒలికిపోతూ...

మనసంత శూన్యపు ఆవిర్లు కమ్ముకుంటూ
కాలుతున్న ఒంటరితనం మండుతూ...

చేతులు బార్లా చాపి కావలించుకున్న
ఖాళీతనాన్ని కాన్వాసుపై చిత్రిస్తూ...

Monday, May 13, 2013

సంధ్యావస్థ..

దోసిలిలో పట్టిన నీళ్ళిన్ని
ముఖంపై చల్లుకుంటూ
మరో దోసిలి గొంతులో
వొంపుకుంటూ
ఈ వేసవి ఎడారిని
ఈదేద్దామని...

కానీ!

ఇన్ని మాటలు లేని
మౌన ఎడారిని
ఈదే సాహసం
చేయలేక నీ ముందిలా
ఓడిపోతూ...

కంట్లో నెత్తుటి నరం తెగి
నేలరాలిన నీటి బొట్టు..

అమవాస చంద్రునిలా
చీకటినంతా పులుముకొని...

నీటిలో నానిపోయిన
కాగితప్పడవలా చినిగిపోతున్నా
కాలాన్ని ఎదురీదుతూ...

దూసిన కత్తి పదునులా
మెరిసి మాయమై పోతున్న
క్షణాలను ఏరుకుంటూ
ఒకడు చినిగిన చేతి సంచిలో
వేసుకొని దారెమ్మట
ఎడతెగని బాటసారిలా...

కూలిపోతున్న వంతెన
చివర అంచున వేలాడుతూ
కాలం నవ్వుతూ
వెక్కిరిస్తూ...

కాదనలేని సత్యాన్ని
భుజంపై భేతాళునిలా
మోస్తూ అలసట తీరని
పయనం...

(తే 13-05-2013 దీ)

Saturday, May 11, 2013

నడక..

ఎర్రగా కాలుతున్న రాయిపై
అరిపాదం బొబ్బలెక్కినా
ఆగని నడక...

మెత్తగా ముళ్ళు దిగుతూ
గాయం సలపరమెడుతున్నా
ఆగని నడక...

కసిగా ఇసుక కోస్తు
నెత్తురు చిమ్ముతున్నా
ఆగని నడక...

చల్లగా మంచు గడ్డపై
తిమ్మిర్లెక్కుతున్నా
ఆగని నడక...

జీవితం నడకైనప్పుడు
తోవ ఏదైనా
నడక ఆగదు కదా...
(తే 10-05-2013 దీ)

Monday, May 6, 2013

సందిగ్ధంతో...

నువ్వెప్పుడూ విడి విడిగానే కనబడతావు
నువ్వూ నేనులా

ఇసుక రేణువు విడి విడిగానే కనబడుతుంది
దేనికది స్పృహ లేనట్టుగా

నీటి తుంపర విడి విడిగానే ఎగసిపడుతుంది
వీడలేని బాంధవ్యంలా

కళ్ళు రెండూ విడి విడిగానే చూస్తాయి
ఒకే దృశ్యాన్నిలా

చెవులు రెందూ విడి విడిగానే వినిపిస్తాయి
ఒకే స్వరాన్ని ఏక తాళంలా

దేనికది విడివడుతూనే ముడి పడి
వున్నదన్నది ఎంత విషాదమూ...

Friday, May 3, 2013

ఎండిన...

 
ఎండిన ఆకు ఈనెను అలా గట్టిగా
వత్తి పట్టకు
విరిగి పోతుంది కదా...
ఎండిన మొదలుపై అలా గట్టిగా
వేటు వేయకు
ఒరిగి పోతుంది కదా...

ఎండిన నీటి పాయలో అలా గట్టిగా
అడుగు వేయకు
ఇసుక కోతకు గురవుతుంది కదా...

ఎండిన చర్మం పై అలా గట్టిగా
పట్టి చూడకు
నెత్తురు చిమ్ముతుంది కదా...

ఎండిన ఎదపై అలా గట్టిగా
మాటాడకు
పగిలి ముక్కలవుతుంది కదా...
Related Posts Plugin for WordPress, Blogger...