Tuesday, June 29, 2010

ఖాళీ ఆవరణ



ఇప్పుడిక్కడంతా ఆవరించుకుంటున్న
ఖాళీ గురించే ఆలోచన..
గుండె గదినుండి అంతా పోగొట్టుకున్నట్టు
చివరాఖరి బొట్టు వరకు పీల్చి వేయబడ్డట్టు
ఏదో మాయో మత్తో కమ్ముకున్నట్లుగా
అంతా ఖాళీ అయిన ఆవరణ..

దేనిచేత పూరింపబడని ఒక లెక్క తప్పిదమా?
కాదేమో!
ఎందుకో అంతా జబ్బపట్టి లాక్కుపోతున్నట్టు...
నాకున్న ఈ రెండుపాదాల కింది నేల
వ్రయ్యలయినట్టు!

ఓ గబ్బిలం నా కనులముందు తన
రెక్కలతో విసురుతున్నట్టు!

కోల్పోయిన సందడి ఎవరిస్తారు మిత్రమా?
అడిగే హక్కు నాకున్నా
మొఖం చాటేసి పోతున్న నీ వెంబడి
ఈ నాలుక్కాళ్ళ పరుగులో నిన్ను
చేరలేనితనం...

దహించివేస్తున్న అగ్నకీలల బారినుండి
ఏ ఫైరింజన్ కాపాడగలదు?

పోనీ పోనీ అంటూ నిస్సహాయ
రాగాలాపన చేయలేని మొండితనం
ఎన్నాళ్ళు నిలబెట్టగలదు...

(అసంపూర్ణం)..

Monday, June 28, 2010

పొద్దులో నా కవితవచ్చిందోచ్..

చాన్నాళ్ళుగా పొద్దులో నా కవితను చూడాలని అనుకునేవాడిని. అందులో రాస్తున్న వారంతా సీనియర్స్ మరియు కవితల standard కూడా బాగుంటోంది. మన కవిత అందులో వస్తే బాగుణ్ణు అనుకునే వాడిని. ఇన్నాళ్ళకు అందులో చోటు దొరికింది. సాహితీ మిత్రులు స్పందించగలరు..

గాలి...http://poddu.net/?p=4823

Saturday, June 26, 2010

జ్ఞాపకంగా మిగులుతావనుకోలేదు...

మొన్నటి సభలనాడు అదే ఉత్సాహం
నీ గొంతులో అదే నినాదాల హోరు..

జనార్థనుని జ్నాపకాలను కలబోసుకొంటూ
విషాదాన్ని నీ కనురెప్పల మాటున దాచుకుంటూ
అందరితో చేయి కలిపి మనమంతా
కలిసి నిలబడాలనే అవసరాన్ని గుర్తుచేస్తూ
ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తానని
మాటిస్తూ కలుద్దాం మళ్ళీ మళ్ళీ అంటూ
వీడ్కోలు తీసుకున్న నీవే
ఓ జ్నాపకంగా మిగులుతావనుకోలేదు..

మొక్కవోని ఆత్మ స్థైర్యంతో నిర్బంధాన్ని
నిబ్బరంగా ఎదుర్కొన్న నీ జీవితం మా
కందరికీ ఆదర్శం...

(అమరుడు కా.జనార్థన్ సహచరి కా.తనూజ (వరంగల్) చెన్నైలో ఓ ఉన్మాది కౄర దాడిలో హత్యకు గురై మరణించిందన్న వార్త విని..)

Tuesday, June 22, 2010

చింతా 'దుక్కి' కవిత్వానికి ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డ్...




ఉత్తరాంధ్ర బతుకు దుఃఖాన్ని తన కవితా వస్తువుగా చేసుకొని తన మాతృ యాసలో కవిత్వాన్ని రాస్తున్న మా చింతా అప్పలనాయుడు మాస్టారుకు 2009 ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డ్ ప్రకటించారన్న వార్త చూసి మేమంతా గొప్పైపోయాము. తను కథలు, కవిత్వంతో ఈ ప్రాంత వాసుల జీవన వెతలను రికార్డు చేస్తున్న మాస్టారికి ఈ పురస్కారం రావడం ముదావహం. మా ప్రాంతానికి దక్కిన ప్రత్యేక గౌరవంగా భావిస్తూ ఫ్రంట్ కు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ సందర్బంగా వర్తమాన తెలుగు కవితా దీపస్తంభం కె.శివారెడ్డి గారు ఈ సంకలనానికి రాసిన ముందుమాటలోని వాక్యాలుః 'చింతా అప్పలనాయుడు మనముందు కూర్చొని శ్రీకాకుళం యాసలో కబుర్లు చెబుతున్నట్లు హాయిగా ఉంటుంది. చాలా సూటిగా, హాయిగా సాగిపోయే శైలి, పల్లెటూళ్ళ జీవనంలో అతలాకుతులమయిన పల్లెల జీవన దృశ్యాల్ని కతచెపుతున్నట్టు చెప్పుకుంటూ పోతున్నాడు, అతని కథా కథన పద్ధతి జానపదకథకుడు చెప్పే పధ్ధతి. అనుభవసారం గుండెనిండుగా వున్నవాడు, గొప్ప ఊహాశీలి, సంక్షోభాల్ని వర్ణించేటప్పుడు, కుతూహలం తగ్గకుండా, కన్నీళ్ళు తెప్పిస్తూ కథనడుపుతాడు. బహుశా అప్పల్నాయుడు శిల్పంకూడా యిదేనేమో' అన్నారు.

మాస్టారి కవితా పాదాలు కొన్నిః
'ఊరు ఊరంతటికీ..
ఉదయమే పొద్దు పొడుస్తుందిగానీ
నిజానికి మాలపేటలో
సాయంకాలమే సూర్యోదయమవుతుంది!
పొద్దు పోయి పోయి తిరిగొచ్చి
మాలపేట పొయ్యిల్లో దూరినట్టుంటుంది' (ఒక మాలపేట కొన్నిదృశ్యాలు)

అమెరికా వెళ్ళి పట్టించుకోని ఇంజినీరు కొడుకు గురించిః
'ఇంజీనీరువైతే..
గట్టిగూడు కట్టి నీడనిస్తావనుకున్నాను
డాలర్ పులి నోటికి దొరికి పోతావనుకుంటే
పుట్టినపుడే పుటికీసుందును!'

'నేల నా తల్లి
నాకు ఓర్పును ఒంటబట్టించింది నేలే..
ఏరు నా నేస్తం
కెరటాల్లో కొట్టుకు వచ్చే కట్టెను తెప్పజేసుకొని
ఈదులాడే విద్య నేర్పించింది ఏరే నాకు
ఏలినవారు మా దొడ్డ వారు
ఒక్క నదిని నాకు కాకుండాజేసి
రెండు నదుల్ని కానుకగా ఇచ్చారు
ఒక కంటికి కన్నీరు!
ఒక కంటికి నెత్తురు!'

'మాలోలు గుంటరా అని
మాటికీ నోళ్ళు పారేసుకుంటారు గానీ
నీలకుండతో నీలాటి రేవు చేరినప్పుడల్లా
ఆమె అందాన్ని చూసి నోళ్ళూరబెట్టుకున్నోలే!
అప్పడాల ముద్ద పేడించినట్లు
ఫెయిర్ అండ్ లౌలీ పుసుకున్నోళ్ళంతా
నాటుకోడిలా నిగనిగ మెరిసిపోయె
ఆమె ముందు ఫారం కోళ్ళే గదా?
శ్రమ జీవన సౌందర్య వేదిక మీద
ఆమె కదా విశ్వ సుందరి' (మా ఊరి మాలపిల్ల)

'మా ఊరికి నాగరికతను
మోసుకొచ్చిందని సంబరపడ్డామే గానీ
మా శ్రమ చమట చుక్కలై
ఈ రోడ్డుమీదుగానే ప్రవహించి
పట్నంలో ఇంకిపోతాయనే
ఎరుకలేని వాళ్ళం!'(కొండ)

'పెట్టుబడుల ప్రవాహమై
నా మట్టి పాదాలను చుట్టుముట్టి
ఊబిలోకి లాక్కుపోతుంటే
ఇనుప దున్నల స్వైర విహారంలో
ఇప్పుడు నేను విరిగిన నాగలిని..!'

ఇలా తన ప్రతి కవితలోను కరుణ రసాన్ని మేళవించి ఈ నేల ఆనుపానుల్ని ఎరిగిన ఈ తరం కవి చింతా అప్పల్నాయుడు మాస్టారు. ఆయనకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన కలం నుండి మరిన్ని కొత్త పదచిత్రాలను ఆశిస్తూ...

ఈ సంకలనాన్ని ప్రముఖ కథా రచయిత, కవి గంటేడ గౌరునాయుడు మాస్టారి నేతృత్వంలోని 'స్నేహకళా సాహితి, కురుపాం' వారు ప్రచురించారు. ప్రతులు విశాలాంధ్ర, ప్రజాశక్తి బ్రాంచీలలో లభ్యమవుతాయి.


Wednesday, June 16, 2010

అలసట...

పెడుతున్న పరుగునాపి
గుండెలనిండా ఒక్కమారు ఊపిరి తీసుకొని
గొంతులో కాసిన్ని నీళ్ళు పోసుకొని
అలసట తీరిన క్షణం
పొందిన ఆనందం వర్ణణాతీతం

కొత్త శక్తితో
మొదలైన ప్రయాణం
చెవిదాకా లాగివదిలిన బాణంలా
దూసుకుపోతుంది...

Tuesday, June 15, 2010

శ్రీశ్రీ...ఓ మహాస్వప్నం




శ్రీశ్రీ... ఓ పోరాట రూపం

శ్రీశ్రీ... ఓ సామాన్యుడి అంతరాత్మ

శ్రీశ్రీ... స్పార్టకస్ ఖడ్గం

శ్రీశ్రీ... వేల ప్రశ్నలకు జవాబు

శ్రీశ్రీ... జగన్నాద రథ సారథి

శ్రీశ్రీ... సమస్త వృత్తుల సహస్ర చిహ్నం

శ్రీశ్రీ... విశ్వమానవాళి కన్న మహా స్వప్నం

శ్రీశ్రీ... మరోప్రపంచపు ఎఱబావుటా నిగనిగ

శ్రీశ్రీ... అనంత విశ్వంపై ఎగిరిన తెల్లబావుటా ధగధగ


(శ్రీశ్రీ వర్థంతి సందర్భంగా)

Sunday, June 13, 2010

వెంటాడుతున్న ఆ కళ్ళు



ఆ మూసుకుపోని కనురెప్పల
ఆవల దాగిన విషాదం
ఇన్నినాళ్ళ తరువాత కూడా
వెంటాడుతూనే వుంది..

రాబందుల నోట చిక్కి విలవిలలాడిన
ఆ క్షణం,
ఊపిరి సలపలేని
గుండెలపై పడిన భారం
బిగబట్టి వదలలేని శ్వాస
చివరి నిట్టూర్పై కళ్ళలోంచి
నిష్క్రమించిన క్షణం..

ఆ కళ్ళు కొన్ని వేల
ప్రశ్నలకు గురుతుగా
సమాధి చేయబడ్డా
తిరిగి లేచిన
మోసెస్ వలే నిన్ను
వెంటాడుతూనే వుంటాయి..

తప్పించుకున్న హంతకులను
వేటాడుతూనే వుంటాయి..
Related Posts Plugin for WordPress, Blogger...