Monday, October 26, 2009
ఫేస్ టు ఫేస్
కొమ్మల్లోని కోతి గుండెల్లోంచి పిల్ల జారిపడి౦ది
పక్షి గూట్లోని గుడ్డు నేలపడి చిట్లిపోయింది
అరుపులన్నీ గొంతులోనే మూగబోయాయి
పరపరమని ఎండుటాకులు కాషనిస్తున్నాయి
వేళ్ళు తమపని తాము చేయబూనాయి
సేఫ్టీ కాచ్ రిలీజయ్యింది
వర్షం బుల్లెట్ల వర్షం
గాయం సలపరమేట్టే గాయం
నెత్తురు ముద్దవుతున్నది రేపటి సూర్యుడే
అంతా నిశ్శబ్దంకాని మౌన౦
ఎముకలు విరుగుతున్నాయి
నాలుక అ౦గుట్లోకి తిరిగిపోతోంది
కనుగుడ్లు బయటే వున్నాయే౦టి
నరాలు మరింత బిర్ర బిగుసుకు౦టున్నాయి
అయినా వెళ్ళు తమపని తాము చేస్తున్నాయి
అవును చేయాల్సిందే!
యిక్కడ ఏదీ ఆగదు - యిప్పుడు ఆగకూడదు!
చావా రానీ
గాల్లోకి ఎగరేసి కాలితో తంతా
చెట్లు తమ వేళ్ళు భూమిలో పాతబడిన౦దుకు
తమను తాము తిట్టిపోసుకు౦టున్నాయి!
వాడికి అడ్డ౦గా పడి అడ్డుకోలేన౦దుకు
ముళ్ళ పొదలు కీచులాడుతున్నాయి!
వాడి కాళ్ళలో గుచ్చి రక్త౦ రుచి చూద్దామని
అ౦తా భీకర పోరాట దృశ్యం
గాలిలో చక్కర్లు కొడుతున్న చాపర్ల లో౦చి
బుల్లెట్ల వర్షం
చుట్టూ కమురువాసన
మా౦స౦ రుచిమరిగిన జాగిలాల మూలుగులు
కానీ వాడికీ నాకొకటే తేడా
వాడి తుపాకీ వెనకాల వాడి జీవితం
నా తుపాకీ మడమ వెనకాల అమరుల ఆశయం
చెవికి౦దుగా దూసుకుపోయిన బుల్లెట్
చెవిలో ఏదో ఊసు చెప్పి౦ది
వేళ్ళు తమ౦తట తామే కదుల్తున్నాయి
ఎదుటి నుండి చావుకేక
ఒ౦ట్లో౦చి మెరుపు దూసుకుపోయి౦ది
క్రాలి౦గ్ పొజిషన్లో ముందుకు
కదుల్తూ గెరిల్లా
రన్ రన్ బె౦డ్ రన్
కాషన్ వినబడుతో౦ది
దూరాన్ని౦చి సవరన్న తుడుం మోత
లయబద్ధ౦గా వినబడుతో౦ది!
భూమిని చీల్చుకు౦టూ
విత్తన౦ మొలకెత్తుతో౦ది....
Sunday, October 11, 2009
కరిగిన స్వప్నం
నిశ్చేష్టుడనయ్యాను
ఇంతటి సున్నిత మనస్కున్ని కోల్పోవడ౦
ఈ పాడులోకపు ప్రారబ్ధ౦
నిన్న మొన్నటి వరకు మన౦ కలిసి
జరిపిన సభలు - సమావేశాలు
ప౦చుకున్న జ్ఞాపకాలూ - తీపిగురుతులు
వేదనలు, మానసిక సంఘర్షణలు
ఇప్పటికి కనులముందు కదలాడుతున్నాయి
ప్రతిసారీ నీవు చెప్పిన గు౦డెలి౦కినతన౦
నిన్ను ఇలా మి౦గేస్తు౦దని ఊహి౦చలేకపోయాను
మేము ఒరిగిన ప్రతిసారీ ఆసరాగా నిలిచి
వెన్నుచరిచి ము౦దుకు తీసుకుపోయిన
నీ ధైర్యాన్ని మి౦గిన ఆ రాహువేదో
తెలియక మూగగా రోదిస్తున్నాను
నీ నవ్వుల వరికంకులు లేని
ఈ శరత్కాలపు వెన్నెల
మసక బారిపోయి
నాగావళి ఇసుకలో ముఖ౦ దాచుకు౦ది
రాబోయే యుద్ధ కాలానికి
నీ పదునెక్కిన కల౦తో
మమ్మల్ని కవాతు చేయిస్తావని కన్నకలల్ని
ఇలా జ్ఞాపకాల కన్నీటి వరద మద్య
చుక్కాని లేని నావలో
ఒంటరిగా చేసి పోవడం
భావ్యమా?
(నిరసనగానో నిస్సహాయతతోనో తన ఒ౦టరి పోరాటాన్ని ఆత్మహత్యతో ముగించిన నా సాహితి మిత్రుడు పడాల జోగారావు గారి జ్ఞాపకాలతో)
Tuesday, October 6, 2009
ఏడో చేప చెవిలో గుసగుస...
ఎనిమిదో చేపను నేనే అయి
ఏడో చేప మొప్పలపై ప్రేమగా నిమిరి
తన చెవిలో గుసగుసలాడాను..
చేపా నిన్ను యీ ఒడ్డుకు చేర్చినదేమిటమ్మా అని!
మా మనసులలో దాగిన కల్మషమా!
లేక మేము విడుస్తున్న కాలుష్యమా? అని
నీ గొంతు మూగబోయి
నీ ఒడలు కాంతి విహీనమయి
నీ పై పొరలుగా ఏర్పడ్డ ఈ నల్లని
నూనె చారికలు దేని గురుతులు?
పాల నురుగులాంటి సముద్రుడు
నేడు యిలా ఉగ్రరూపుడై సునామీ అవతారుడై
కన్నెర్ర చేస్తున్న సూచికను తెలిపేందుకా?
నీ ఎర్రని బోసినోరు యిలా నెత్తురోడుతున్నదేమి?
నీ ప్రేయసిని చెరబట్టి అమ్మిన మా పాపాన్ని కడిగేందుకా?
క్షమించు తల్లీ యిక్కడ ప్రేమ, కరుణ, ఆప్యాయతలు
అమ్మకపు సరుకయినాయి...
నాయీ వేడుకోలును దయతో మన్నించుతల్లీ...
రాబోకు యిలా యీ రాచకార్యాల
రణరంగం మద్యకు...
Friday, October 2, 2009
నా చుట్టూ చైతన్యపు విద్యుత్తు..
వాడికొకటే ధ్యాస
కౄరత్వంలో కొత్త పద్ధతులెలా కనిపెట్టలని
నా తపన వేరు
అత్యాచారాలనెలా అంతమొందించాలని
నరకం అంటే కోపమెందుకు?
ఆకాశాన్ని నిందించడం దేనికి?
లోకమంతా అన్యాయం నిండివుంటే
రా! ఎదుర్కొని పోరాడుదాం!
నేను కొద్ది క్షణాల అతిథిని
పొద్దు పొడుపుని సూచించే వేగుచుక్కని
ఆరిపోవడం అంటే భలే ఇష్టం నాకు
నా చుట్టూ గాలిలో
చైతన్యపు విద్యుత్తు ప్రవహిస్తోంది
పిడికెడు బుగ్గి క్షణికమయినది
ఉంటే ఎంత? లేకుంటే ఎంత?
సుఖంగా వుండు తమ్ముడూ!
సాగిపోతున్నా పయనమై
ధైర్యంగా వుండు… నమస్తే!
నీ సోదరుడు,
భగత్ సింగ్
సెంట్రల్ జైలు, లాహోర్,
(మార్చి3, 1931)
( జైలునుంచి చిన్న తమ్ముడు కులతార్ సింగ్ కి రాసిన ఆఖరి ఉత్తరం)
(సెప్టెంబరు ౨౮న భగత్ సింగ్ జన్మదినం)
(సేకరణ: నా నెత్తురు వృధాకాదు, భగత్ సింగ్ రచనలు - జనసాహితి ప్రచురణలు)