Monday, September 7, 2009

అడవీ తల్లీకి దండాలో..

అడవి తల్లీకి దండాలో

మా కన్నతల్లీకి దండాలో…

అని గట్టిగా గొంతెత్తి పాడాలని వుంది

తన కడుపులో గుట్టుగా దాచుకున్న బిడ్డలను

మాటాడుదాం రమ్మని నమ్మకంగా ఇంత ముద్ద పెట్టి

వారు అడిగిన ఐదూళ్ళ వాటాను ఇవ్వలేదు సరికదా

తిరిగి తమ గూటికి ఆ పక్షులు చేరకముందే వారిని

దారికాచి గొంతుకోసిన నాటి నుంచి ఆగని నీ

కన్నీటి ధార మొన్న కుండపోతై, మెరుపుల జడివానై

వాడి అంతుచూసాక కాని నీ ఆక్రోశం చల్లారలేదు!

నీ వాకపల్లి పుత్రికల ఆవేదనకు ఇలా ముగింపు నిచ్చావు!

భూమ్మీదకాని, సముద్రంలోకానీ, ఆకాశంలోకాని, దేనివలన

మృత్యువులేదని వరం పొందిన నయా హిరణ్యాక్షుడికి

నీ మూడో నేత్రంతో మాడి మసిచేసావు!

పావురాల గుట్టకు మా పడి పడి దండాలు..

నీకు మా పొర్లు దండాలు తల్లి.

10 comments:

  1. మీ కవితకు మీలోని భావ ఘర్షణకు నా జోహార్లు మిత్రమా.
    ఇన్ని రోజులు మీ బ్లాగు గురించి తెలియక చాలా మిస్ అయ్యను ..

    ధన్యావాదాలు

    మీ

    శ్రీనురాగి

    ReplyDelete
  2. thank you మిత్రమా. మీ అభిమానానికి ధన్యవాదాలు.ఇంత తొందరగాచూసినందుకు కూడాను. చచ్చిన వాడి కళ్ళు పెద్దవంటారురా అని మా అమ్మ చెప్తూ వుంటాది. చావు కొంతమంది పాపాలను ఇలా కడిగేస్తుంది. తెలుగు నేలను తమ జాగీరులా ఏలి ప్రశ్నించే వేలిని చివరంటా తెగ్గోసిన వారికి ఇంతకంటే ఏమనుకోగలం.

    ReplyDelete
  3. మీడియా తో సహా అమాయకులు, అధినాయకులు అంతా మాస్ హిస్టీరియా తో ఊగి పొతున్నపుడు ఇట్లాంటి కవిత రాయడానికి నిజంగా గట్స్ వుండాలి.

    ReplyDelete
  4. నిజంగా అడవితల్లికి దండాలెట్టాలి. నావి కూడా పొర్లు దండాలు.

    >>"తెలుగు నేలను తమ జాగీరులా ఏలి ప్రశ్నించే వేలిని చివరంటా తెగ్గోసిన వారికి ఇంతకంటే ఏమనుకోగలం."

    100% కరెక్ట్. చాలా బాగా చెప్పారు.

    ReplyDelete
  5. అజ్ఞాత మరియు నాగ ప్రసాద్ గార్లకు
    మిత్రులారా గత వారం దినాలుగా ఉగ్గబట్టుకొని ఆపుకున్న సంతోషాన్ని ఇలా వ్యక్త పరిచాను. మీ సహానుభూతికి ధన్యవాదాలు. ప్రజల పక్షాన ఆలోచించే వారికి మనలాంటి ఫీలింగే కలుగుతుంది.

    ReplyDelete
  6. కథ అంతటితో ముగిసిందా! ఆ తరువాత అది ప్రాణ త్యాగమని అతడు దైవమనీ మసిపూసి మారేడుకాయ చేస్తున్నారు.
    ఇంతకాలం ప్రజలూ పత్రికలు ప్రతిపక్షాలు ఏ ఏ పనులను చూసి దుమ్మెత్తి పోసారో అవే పనులని చూపించి అవ్వన్నీ గొప్ప దేశభక్తి పనులుగా లోకోపకారములుగా చిత్రిస్తూ దానవున్ని దైవాన్ని చేస్తూ చూసేవాళ్ళను అవాక్కు పరుస్తున్నారు.

    ReplyDelete
  7. అజ్ఞాత గారు కరెక్టుగా చెప్పారు. అంతవరకు అమ్మా పెళ్ళామని తిట్టుకొని ప్రజా ధనాన్ని నిర్లజ్జగా వృధా చేస్తూ, నేడు ఒక్కసారిగా తమ అంతర్గత స్నేహాన్ని బయటపేడుతూ ప్రజలను బఫూన్లను చేస్తూ తమ వ్యాపారాలు ఎప్పుడూ ఒక అవగాహన మేరకు కొనసాగిస్తున్న మిత్ర వైరుధ్యాన్ని బట్టబయలు చేస్తున్నారు ఈ బ్లఫ్ మాస్టర్లు. ప్రజలే ఎప్పటికైనా వీరికtతగిన బుద్ధి చెప్పాలి. ఈ అవకాశం ప్రజలకు రాలేదనేదే నా బాధ.

    ReplyDelete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...