Wednesday, September 16, 2015

కొన్ని సాయంత్రాలు..


కొన్ని సాయంత్రాలకు మోదుగు పూలు
నేలరాలుతాయి

ఒక్కో పూవును చిదిమి వేస్తూ
నవ్వుకుంటాడు వాడు

దేహం కాలుతున్న వాసనతో
చెట్లన్నీ ఆకులు రాలుస్తాయి

తలకు వున్న పేర్లన్నీ ఇప్పుడు
చెరిపి వేయబడతాయిఐ

గోడల్నిండా ముఖాలు మేకులకు
వేలాడబడుతూ నవ్వుతాయి

నువ్వంటావు
బతకనివ్వరా పసిపాపలనని?

ఔను
కలల వంతెనలను వాడు 
కూల్చుతానే వుంటాడు!

వాళ్ళు పావురాలను ఎగుర
వేస్తూనే వుంటారు!!

(శృతి సాగర్ లకు)

Tuesday, September 15, 2015

రెండు ప్రశ్నలు..


నది చుట్టూ కొన్ని పద్యాలు
అల్లుకునే వుంటాయి

నదిని ఒరుసుకుంటూ నిలిచిన రాతి
బొమ్మలేవో తెగిన రాగాన్ని ఆలపిస్తూ ఉంటాయి

పాయల మధ్య అతికిన తడితనమేదో
పురిటి వాసనేస్తూ వుంటుంది

నడక ఆగని నదీ ప్రవాహం
కొత్త నేలను హత్తుకుంటుంది

నువ్విప్పుడు నదిగా మారుతావా! 
రాతి బొమ్మగా మిగిలి వుంటావా!!

(August 23)

That last stanza


కొన్నంతే 
అలా దోసిట్లోకి వచ్చినట్లే వచ్చి 
ఇసుకలా జారిపోతాయి

ఖాళీలెప్పుడూ పూరింపబడవు 
ఆ గాలి కోత ఎప్పుడూ గాయాన్ని మాన్పదు

పచ్చిగా సలపరమెట్టే నెత్తుటి మరక చుట్టూ
ఓ సాలీడు గూడు

రాతి పగుళ్ళ గుండెలో దాగిన ఊట 
భ్రమ కాదా

ఈ చలి బీటల మధ్య 
కాసింత రహస్య సంగీతం

చెమ్మలేని ఈ ఊట 
జారిన ఇసుకలో ఇగిరిపోతూ
ఓ వర్ణరహిత చిత్రాన్ని 
మిగిల్చి పోతుంది

స్పృహ లేని 
స్పర్శరహిత దేహం
మట్టి పోతగా ఒరిగిపోతు....

(August 17/2015)
Related Posts Plugin for WordPress, Blogger...