ఖాళీ
చేతుల్నిండా ఓ గాలి తిమ్మెరను ఒడిసి పట్టుకొని
నేనింకా ఈ వంతెన చివర ఆగివున్నా
కన్రెప్పలపై
ఓ మంచు బిందువు జారి ఉప్పగా
పెదాలను తాకి నిన్నొకసారి గుర్తు చేస్తుంది
నువ్వంటావు
నీవన్నీ ఒఠ్ఠి మాటలే కదా అని
గాలికెగిరిపోయే ఎండుటాకునని
నిజమే
రోజూ మొలిచే విత్తులా
ఆశగా ఎదురు చూపుల ఎండమావి చివర దాగివున్నా
కరిగిపోతున్న
వెన్నెలనింత దోసిలిలో పట్టి ఈ నల్లని చీకటి గోడకు వేలాడదీసి
చినిగిపోతున్న ఈ పేజీల మధ్య వేచివున్నా..