Friday, April 18, 2014

ప్రవాస ప్రవాహం!!

అలా మొదలవుతుందో ప్రయాణం
గాలి వాటుగా మాటల మాటుగా
అక్కడక్కడా రాలుతున్న ఆకులను
పూలను ఒత్తుకుంటూ
సాగుతుందో ప్రయాణం

ఎండ పొడలో నుదుట చెమట పట్టి
ఉప్పు పేలిన మొఖంపై
రహదారి పక్కన బోరు పంపు నీళ్ళు
చిలకరించుకుంటూ
కాసిన్ని గొంతులో ఒంపుకుంటూ
కదులుతుందో ప్రయాణం

మాటలు కలిపేందుకు ముఖంపై ముడతల
అనుభవపు గీటురాళ్ళతో ఓ మనిషి
నవ్వుతూ నీ భుజం తడుతూ
ఆయాసాన్ని ఆలవోకగా పారదోలుతూ
కబుర్ల కథలలో నీ ప్రయాణం
సాగుతుందలా

తరాలుగా మానని గాయమేదో లోలోపల
దొలుస్తూ పెడుతున్న సలపరం
కనురెప్పల వెనక దాగుతూ
ఆగని పయనం

ఎండిన పాయల మద్యగా నెత్తుటి ధారలా
దాహపు నదీ ప్రవాహం అంతరంగంలో
కాలుతున్న ఇసుకలో పాదాలు కూరుకుపోతున్నా
పద పదమంటూ పయనం

గుట్టలుగా మిగిలిన రాళ్ళ మద్య
చీలమండలు కోసుకుపోయినా
సాగే రాతి ప్రవాహపు ధారగా
అలుపెరుగని పయనం

మండుతున్న అడవి దారులలో
చిటపటమని ఆకుల సవ్వడి మద్య
పక్షుల దాహపు ఆర్తరావాలగుండా
సాగుతున్న యుద్ధారావం
ఆగిపోని యీ పయనం

ఇదొక అనంత దారుల పాయలగుండా
సాగే అసంపూర్ణ జీవన ప్రవాహ
బలవంతపు ప్రవాస పయనం!!
(18-04-2014 11.09 PM)

5 comments:

  1. ఈ బలవంతపు ప్రవాసం, నిర్జీవపు నివాసం,
    మనిషిని ముందుకు తోస్తున్న ప్రవాహం.
    వర్మగారు చాలా బాగుంది

    ReplyDelete
  2. ప్రవాస ప్రవాహం అంటూ కదల్లేక కదులుతున్న జీవన పయనం గురించి బాగారాసారు.

    ReplyDelete
    Replies
    1. కదల్లేక పోయినా కదిలినట్టు ఊహించుకోవడమే కవిత్వం కదా పద్మార్పిత గారు.. థాంక్యూ..

      Delete

నిర్మొహమాటంగా చెప్తే సంతోషిస్తా..

Related Posts Plugin for WordPress, Blogger...