Thursday, February 21, 2013

వెన్నెల కాపలా...

నువు నన్ను
నచ్చలేదన్న
ప్రతి సారీ
నీ 
కనులలో దాగిన
నా రూపం 
వెక్కిరిస్తూంది...

నీవు విసురుగా
మెడ తిప్పి 
పో
అని కసురుకున్న
ప్రతి సారీ
నీటి పాయలా
నీవు మరల
దరి చేరుతావని
ఆశగా...

నీ 
తిరస్కారం 
వెనక
దాగి వున్న
 ప్రేమ
అలలా 
మరల మరలా
స్వచ్చంగా
నా గుండెను
తాకుతూనే 
వుంటుంది..

నీ 
చిర్నవ్వంటిన
వెన్నెల 
రేయంతా
రెప్పలపై 
కాపలాగా...

Friday, February 15, 2013

సమయం..

 

రాలిన పక్షి ఈక
గాలి తేరు మీద
రెప్పల ముందు
ఎగురుతూ...

మొదలంటిన
నెత్తుటి మరక
తడి ఆరనితనం
దు:ఖ ముఖంగా...

పడమరన దించిన
తెరను లేపుతూ
తూరుపున పూసిన
ఎరుపు రంగులా...

చినిగిన జెండా
అతుకుతూ
పాటనెత్తుకున్న
గొంతు బిగ్గరగా...

నినాదమొక్కటే
నిద్దుర లేపుతూ
పద పదమని
పదం పాడగా...

సమయం
సమన్వయమవుతూ
సముద్రుని ముందు
అలల కోలాహలం...

Wednesday, February 13, 2013

తెల్లకాగితం


మనసంతా తెల్లకాగితంలా
ఏదీ అంటనితనంతో దిగాలుగా...

అక్షరం అతకనితనంతో
వాక్యం పొందు కుదరక ఆర్తిగా...

రంగు పూయనితనంతో
గీతల మధ్య పొసగక ఖాళీగా...

మంచు కరగనితనంతో
గుండె బరువు గొంతులో మూగగా...

అసంపూర్ణ రాగం ఒక్కో మెట్టు
పలకనితనంతో మౌనంగా....

ఆవరణంతా అలముకున్న
కారు మేఘం కురవక ఉక్కపోత...

ఈ నిశ్శబ్ధ సంధిగ్ధావరణంలో
నీ పిలుపు ఆనందార్ణవమై మెరవగా...

రాజుకున్న నిప్పు సెగలు
ఈ రేయినింక తెలవారనీయవు...


Tuesday, February 12, 2013

'రెప్పల వంతెన' - అలికిడి లేనితనానికి - అలజడికి వంతెన



వర్మ - ' రెప్పల వంతెన - అలికిడి లేనితనానికీ - అలజడికీ వంతెన.
- ప్రజాసాహితి సంపాదకులు నాగరాజు గారి పరిచయ వాక్యం...

        'అతడెప్పుడూ కలల్ని మోసుకు తిరుగుతాడు'
         జీవితమే యుద్ధమైన చోట
        యుద్ధాన్ని అంతం చేయడమే కలగా
        అతడెప్పుడూ కలల్ని మోసుకు తిరుగుతాడు'

        ' రెప్పల వంతెన ' కవితా సంపుటి ముగిసిన చోట -
        అలికిడిలేనితనంలోంచి అలజడిలోకి
        పాఠకుడు అడుగులు వేస్తాడు.

మిత్రులు వర్మ కలానికి కలలు కనడం బాగా తెలుసు.
అది నిజాన్ని కలగనే కలం.
అది నిజమైన యుద్ధాన్ని గానం చేసే కలల గళం.

సామ్రాజ్యవాద ప్రపంచీకరణ అబద్ధపు యుద్ధాన్ని ఎలా గెలవాలో కలగనే కలం!

        "గుండె పగిలి | పొగిలి పొగిలి | ఏడ్చినట్టు | ఆకురాలిన చోట | చిట్లిన నేల" ను చూపించే చూపున్న కలం.

        " విరిగిన వేణువు | స్రవిస్తున్న | నెత్తుటి పాటనెవరో | దోసిలిపట్టి గొంతులో | నింపుకు పోయినట్టున్నార " న్న
భావుకతలో నేలకొరిగిన వీరుని ఊపిరి పిట్టలు నింగికెగిరే స్వేచ్చా కవాతు తెలిసిన కలం.

ధ్వంసమవుతున్న ప్రకృతీ -  మానవ సామాజిక ప్రకృతి మిత్రులు వర్మ కవిత్వంలో దృశ్యమానమవుతాయి.

"ఇక్కడో" విషాదగీతాన్ని వినిపిస్తారు వర్మ.

        "ఇక్కడో బడిగంట మోగుతూ వుండేది
        అక్షరాభ్యాసం చేయిస్తూ నాలుగు పద్యాలు పాడేది
        ఎవరో జేబులో పెట్టుకు పోయినట్టున్నారు"

కవి కలం అనేసరికి - వర్తమాన ఆందోళనల నాడిని పట్టుకొని భవిష్యత్ చిత్రపటాన్ని ఆవిష్కరించే చూపు మండి తీరుతుంది. ఆ కవికి సామాజిక అనుకంప ఉండాలే గానీ!

హృదయానికి రాసే గుణం వుంటే ఆ కలం పేరు వర్మ.
కలానికి చైతన్య విద్యుదావేశం వుంటే ఆ ఆవేశం పేరు వర్మ.
భావుకతని సామాజిక చైతన్యానికి రాపిడి పెట్టడం తెల్సిన నిబద్ధత వర్మ కవిత్వానికి వుంది.

చైతన్యాన్ని ఎండగా రూపించి -

        " ఎండ జీవితంలో సుఖ దు:ఖాలకు సంకేతం
          దాని రూపు తెలియక పోతే
          నీతో పాటు నీ మెదడు కూడా
          నాచు పట్టి పోగలదు "  అని చెప్పగల వేడీ, వెలుతురూ వున్న కవన చలనం వర్మ కలానికుంది.

అందుకే
         " ఎవరో విముక్తి గీతాన్ని ఆలపిస్తున్నారు
           గుండె గది తాళం చెవితీయండి " అని సమాజం సముద్రం ఒడ్డున ఒంటరి లంకలై విడిపోయిన వ్యక్తివాద పోకడలకు హెచ్చరికలు చేస్తున్నారు.

ఎవరో పాడే విముక్తి గీతం సామూహిక సమర గీతం కావాలనీ - సమష్టి విప్లవ కార్యాచరణ పథం పట్టాలని ఆకాంక్షిద్దాం. అక్షరాల తుడుం మోగించి "నిద్రమత్తును" వదిలిద్దాం.

మిత్రులు వర్మ బాల్యాన్ని కోల్పోలేదు. బాల్యానికి సొంతమైన చురుకుదనాన్నీ, సృజనాత్మకతనీ కోల్పోలేదు కనుకనే -

        " రా నేస్తం | గుండెపై చెపిపెట్టి | అగ్గిపెట్టెల ఫోన్ ల దారం గుండా | వినబడే నా లబ్ డబ్ లయను
          ఈ కొండ శిఖరాన | నిలబడి లోయంతా వినబడేట్టు నీవు గానం చేస్తే | నీతో శృతి కలుపుదామని |
          ఈ అంచున" అన్నప్పుడు - లేత బాల్యం గుండె మాటున దండకారణ్యం ప్రతిధ్వనిస్తుంది.

ఆ ప్రతిధ్వని కవాతు చేసే బాట ఒక సుదీర్ఘ ప్రజా చైతన్య పోరాటానికి అడుగులు కలపాల్సిన ఆకాంక్ష తొంగి చూస్తుంది.

మరంతే కదా - ప్రజలే చరిత్ర నిర్మాతలు.
పోరాడే వీరులు ప్రజలే - సంఘటిత ప్రజా పోరాటమే అంతిమ విజయాన్ని నిర్దేశిస్తుంది.

        "కనుల లోయలో | పరచుకున్న ఎండమావుల్నీ "
        "గాజుకళ్ళుగా మారిపోయినట్టు - ఏదీ ఇంకనితనాన్నీ"

ఆనవాలు పట్టగలిగే చేదివ్వె - లోదివ్వె కూడా వర్మ కవిత్వానికున్నట్టు ఆనవాలు దొరుకుతుంది. సామాజిక జీవశక్తి రాను రాను ఇంకిపోతున్న 'పొడి'తనాన్ని - 'తడి' కవితలో మనకి అవగాహనకందిస్తారు.

భావ చిత్రాల గేలరీ కావాలంటే వర్మ కవిత్వాన్ని చదివి తీరాల్సిందే.

భావుతత సామాజికతలో స్పందించడం వినాలంటే వర్మ కవిత్వాన్ని అనుభూతించాల్సిందే.

వర్తమాన సామాజిక సంక్షోభం కొలిమిలో సున్నితమైన మనిషితనం పడే చిత్రహింసలకు అక్షరాల ఆనవాలు పట్టి ఇచ్చే 'woodcut' కళ తెలుసు వర్మ కలానికి.

ఒక్కొక్కసారి పద చిత్రాలు కుప్పబోసినట్టు పోగుపడి పోతాయి. వస్తువు మరుగునపడిన ప్రమాదం కూడా లేకపోలేదు.

        "ఏదీ రాయలేనితనం పాడలేనితనం
         దృశ్యీకరించలేనితనం ఎడారితనం కదా"  అని వాపోతారు కవి ఇక్కడే..

ప్రజాయుద్ధ పంథా నాయకుడు మావో అంటారు - గ్రంథ ఆరాధనను మనం అధిగమించాలని.

        " ఊహాజనిత విధానాన్ని మనం తుడిచి వేయాలి. ప్రజలను మన వైపు తిప్పుకోవటంలో జయప్రదo కావడానికి, శత్రువును జయించడానికి అవకాశవాద తప్పులన్నిటి నుండి మనం వాస్తవ పరిస్థితిని పరిశీలన చేసేందుకు ప్రయత్నించటమొక్కటే మార్గం " అంటాడా మహా నాయకుడు.

కవిత్వానికి భావుకత సహజ లక్షణం. వాస్తవికత దాని ఆత్మిక లక్షణమైతేనే ఆ భావుకతకు పదును పెరుగుతుంది. సామాజిక నిబద్ధత సాహిత్య నిమగ్నత వున్న మిత్రులు వర్మ కవిత్వం పదునైన ఆయుధం.

ఈ రెప్పల వంతెన - ప్రజలకీ - చైతన్యానికీ ఒక వంతెన.
అలికిడి లేనితనానికీ - అలజడికీ ఒక వంతెన.
కంటికీ చూపుకూ వంతెన.
అక్షరానికీ - ఆచరణకీ వంతెన!

Tuesday, February 5, 2013

ప్రవాహాన్ని...


అలుపు తీర్చుకుందామని
ఈ మలుపు దగ్గర ఆగాను...

ఈ గడ్డి పరక ఒకటి మెత్తగా తాకుతూ
నిటారుగా నిలబడుతూ వుంది పచ్చగా...

ఒరిపిడి తాకిడికి ఈ రాతి గుండె
సున్నితత్వాన్ని పొందినట్టుంది....

ఈ ఇసుక పర్రల మధ్య మెరుస్తున్న
రేణువుల బంగరు చాయ...

అలల మధ్య ఖాళీ వలయాల గుండా
నీటి పాయల సుళ్ళు...

ఒక్కోటీ దేనికదే ప్రత్యేకంగాను
కలగలసిన ఏకత్వాన్ని పొందుతూ...

ఆగని ప్రవాహం మరల మరల
సాగుతూ నిరంతర యానం...

Saturday, February 2, 2013

వెతుకుతు..

ఎదలో పసరికతనం కరవై
అక్షరం పొడిబారుతోంది...

చుట్టూ మనిషితనం కరవై
ధుఃఖం ఇంకిపోతోంది...


కాసింత పచ్చదనం కోసం
వెతుకుతూ....
Related Posts Plugin for WordPress, Blogger...