Tuesday, November 29, 2011

వాడి నెరవేరని కల



ఎప్పుడూ వాడికొకటే కల

తనకు నిద్ర పట్టనివ్వని వాణ్ణి
అంతం చేసేద్దామని...

వేల తుపాకులు భుజానేసుకొని
కవాతు చేస్తూ భయం భయంగా
నక్కుతూ నీల్గుతూ మూల్గుతూ
అడుగులేస్తూ
ఎదురుగా
వెన్నెలతో జలకాలాడుతూ
కోరమీసం మెలేస్తూ
నెగడు చుట్టూ థింసా ఆడుతున్న
వాడి గుండెల్లో తూటా దించేసి
హాయిగా ఊపిరి పీల్చుకుందామని...

కానీ,
నెగడులోంచి ఎగసి పడుతున్న నిప్పురవ్వలు
ఒక్కొక్కటి వేల సూరీళ్ళుగా ఉదయించడం
చూసి మరల నువ్వు
బురదపాములా ఊబిలో కూరుకు పోయావు....

చూసావా
నా అప్రియ శతృవా??

Monday, November 21, 2011

ఖాళీ అయిన కుర్చీ..


ఖాళీ అయిన కుర్చీ..
నేను పాకుతున్న వయసులో
ఆ కుర్చీ చేతులు పట్టుకొనే నిలవడం నేర్చుకున్నా...

ఎప్పుడు చూసినా ఎంతో ఠీవిగా
చిరునవ్వులు చిందిస్తూ వున్నట్టుండేది...

అటువైపు చూసినప్పుడంతా మరచిపోయిన
హోంవర్కు గుర్తొచ్చి కాళ్ళు వణికేవి...

ఒప్పచెప్పాల్సిన పాఠాలు గుర్తొచ్చి
అమ్మ కొంగు వెనక చేరిపోయేవాణ్ణి
అప్పుడు చూసి నవ్వుతూ లాలనగా
తన ఒడిలో కూచోపెట్టుకొని అక్షరం
విలువ చెవిలో ఉపదేశిస్తూ నుదుటిపై ముద్దుపెట్టేది.....


తన చుట్టూ వనమూలికల సువాసనలతో
పరిమళిస్తూ రోగులకు స్వాంతననిచ్చే
ధన్వంతరీలా ఎప్పుడూ ఆయుష్షునందిస్తుండేది...

కాలం కరిగిపోతున్నా ఆ చేతులు అలా
ఎంతోమంది మనసులను చక్కదిద్ది
ఆనందంతో నింపి కరుణతో స్వాంతననిచ్చేది....

౩.

నన్ను దగ్గరకు తీసుకుని అప్యాయంగా
నా నుదుటిపై ప్రేమగా తాకే ఆ చేతులు
కానరాక హృదయమంతా శూన్యమావరించింది...!!

Monday, November 14, 2011

నెత్తురోడుతున్న చందమామ


కలల అంచులు
కత్తిరించుకుంటూ
నీ చుట్టూ పాతుకున్న
కంచె ముళ్ళు గుచ్చుకుంటూ
నెత్తురోడుతున్న చందమామ
గాయానికి ఇంత నవ్వుల
వెన్నపూత పూస్తావని
ఆశగా ఇంకా ఎదురుచూస్తూ...

Monday, November 7, 2011

సింహనాదం...



నిర్బంధాలు కూల్చివేయబడనీ...

నిషేధాలు నిర్జింపబడనీ...
విద్రోహాలు పాతరేయబడనీ...
నీడల చారలు వెలుగుతో నింపబడనీ...

దేహమే ఉక్కుపిడికిలై
సింహనాదం చేస్తూ
విజయకేతనం దిగ్దిగంతాలు ఎగరనీయి....

Tuesday, November 1, 2011

దీపమైన నాన్న


తన నుదుటిపైన ముద్దుడితూ నాన్నా
అని నేను ఆక్రోశిస్తున్నా నన్ను నిర్దయగా
విడిచి దీపమైన నాన్న....

నా అరిపాదం గాయపడకుండా
తన గుండెలపై ఆడించిన నాన్న..
తన ఒడిలో కూచుండబెట్టి అక్షరభ్యాసం
చేయించిన నాన్న....

ఎప్పుడూ నీడలా వెన్నంటి వుండి
తన మాటల బాట వెనకే
నడిపించిన నాన్న....

నేడు నా చేత పసుపు నీళ్ళ స్నానానికి
ఒదిగిపోయిన క్షణాలు...

ఆ పాదాలను చివరిసారిగా కన్నీటితో
కడిగిన క్షణాలు...

చివరిసారిగా తన చుట్టూ చుట్టిన కాషాయ వస్త్రం కాంతులీనుతూ
ఒడలంతా విభూది పూసి పవిత్ర పత్రాల మధ్య
తేజోవంతమైన దేహం సజీవంగానే ఒరిగిన క్షణాలు....

నా గుండెకింత నిబ్బరమెక్కడిది???

ఇది ఆయన చివరిగా గట్టిగా ఒత్తిన స్పర్శకదా???




Related Posts Plugin for WordPress, Blogger...