Friday, July 29, 2011

దూరమయ్యిందెవరు??



నీవు నాకు దూరంగా వున్నావన్నది

నీ ఊహ మాత్రమే..


నీ అడుగుల లయ
నాకు వినిపిస్తూనే వుంది నేస్తం
నిశ్శబ్ధంగా నా చెవులకు...


మరి దూరమయ్యిందెవరు???

కొత్త చొక్కా....

ఎప్పుడు సంక్రాంతి పండగొస్తుందా
నాన్నకొత్త చొక్కా కొంటారా అని ఆశ...

సంసార సాగరాన్ని ఈదే ప్రయత్నంలో
ఏడాదికి ఒక కొత్త చొక్కా మాత్రమే కొనగలిగే స్తోమత...

అప్పుడప్పుడూ సంక్రాంతి రోజులులోనూ వాయిదా పడేది!
మళ్ళీ పుట్టిన రోజుకేసుకుందువులే అన్న మాట..
ఓ చిన్న ఏడుపు రాగంతో మనసు తేలికపడేది...

వేసుకున్నప్పుడు ఆ కొత్త చొక్కా వాసన
హృదయమంతా నిండి గాల్లో తేలిపోయే వాణ్ణి...

ఎవరన్నా బాగుందిరా అని అనరా అని
మనసు చుట్టూ చూసేది...

ఏమైనా కొత్త చొక్కా మజాయే వేరు కదా!
అందుకే వుతకడం వారం వాయిదా...
ఉతికితే పాతదే కదా మరి...

మళ్ళీ ఏడాది ఆగాలి కదా...
యిప్పటికీ అలవాటు మారలేదు మరి....

Tuesday, July 26, 2011

ఓ గురుతు




గురుతు

నిన్నో మొన్నో చూసినట్టుగా వుందిప్పటికీ...

నవ్వు అమావాస్య వేళ వెన్నెల
సంతకం

మాటాడుతుంటే సెలయేళ్ళ గల గలలకే అసూయపుట్టేలా కతల
ఊట...

చుట్టూ పూల రేకుల నవ్వుల
వాన....

గొప్ప నమ్మకమిచ్చే కరచాలనపు
స్పర్శ....

కలల పందిరి కింద వెన్నెల క్రీనీడల
సరాగం....

మనసంతా కమ్ముకున్న ఆనంద
తాండవం....

Friday, July 22, 2011

సన్నద్ధమౌతూ...

దూరంగా సుదూరంగా
గాలిలో అలా తేలియాడుతూ
వస్తున్న వేణు నాదం
పర్వత సానువులన్నీ చెవివొగ్గి ఆలకిస్తున్నాయి

గూడెంలో ఈ మూల లయగా
మోగుతున్న తుడుం...

చలిని దహిస్తూ
ఎర్రగా కాలుతున్న కొరకంచు.....

వెన్నెల దీపం చుట్టూ పదం పాడుతూ
జతగా కదులుతున్న పాదాలు.....

గుండెల్లో బాధను ఆత్మీయతను కలగలిపి
సన్నగా విడుస్తున్న ఊపిరి స్వరం తోడుగా...

రేపటి ఉదయానికి
వింటిని సవరించుకుంటూ అతడు....

Monday, July 18, 2011

ఉక్కపోత!



ఉక్కపోత
!
లోనా బయటా ఒకటే ఉక్కపోత...


ఒక చల్లని గాలితిమ్మెర కోసం

ఆత్రంగా కలియదిరుగుతున్నా...


మైమరిచి పోయేంతటి గాఢత కోసం

పలుచని పొరలన్నీ కోసుకుంటూ వెలుతున్నా...


అక్షరాలను అటూ ఇటూ పేరుస్తున్నా

రెండూ కలవక విరిగిపోతున్న వైనం కలవరపెడుతోంది...


నరాల దారాలగుండా వడుకుతూ అల్లుతున్న

సన్నని వస్త్రంలో గాలి దూరక ఉక్కపోత...

తప్పని ఉక్కపోత.....

Wednesday, July 13, 2011

వానలో





చూరునుంచి వర్షం ధారగా...
మదిలో ముసురులాంటి ఆలోచనలతో
కమ్ముకున్న తెల్లని పొగ....

ఒక్కొక్కటి కాగితపు పడవలా
ఈదుకుంటూ మునిగిపోతున్న చోట
అలా తడుస్తున్న జ్నాపకాలు....

ఎవరో కుర్రాడు తపక్ తపక్ మంటూ
గుంటలో బురద స్నానం చేస్తున్నాడు...

వీధికుక్క కూచుందామన్నా కసురుకుంటున్న
మనుషులతో తడుస్తూ మూలుగుతుంది...

ఎక్కడా ఆగేందుకు లేక తడిచిన రెక్కలతో
బరువుగా ఎగురుతూ ఓ కాకి....

హఠాత్తుగా వచ్చిన వానతో ముద్దగా తడిచిపోయిన
పాత చెప్పులను సంచిలో కూరుకుంటూ
ఓ మూలకు చేరిన చమారీతాత....


డొక్కలో పేగులన్నీ పంటి బిగువున లాగి పట్టి
తడుస్తూ రిక్షా తొక్కుతూన్న రామయ్య...

ఆరిపోతున్న బొగ్గులను చక్రం తిప్పుతూ రాజేస్తూ
చాయ్ కాస్తున్న రహీమ్ భాయి....

ఇంతలో ఓ ఇంద్ర చాపం...
పరికిణీలో ఓ పిల్ల వానలో కూనిరాగం తీస్తూ
శుభా ముగ్దల్ ను మరిపిస్తూ....

Tuesday, July 12, 2011

అతడు

అతడెప్పుడూ ఒంటరి కాలేదు
అతడు సమూహ గానంలో స్వరమైనవాడు..

అతడు నడిచినంతమేరా
ఆకు పచ్చని వెన్నెల పరచుకుంది...

అతడి పిలుపుకు అడవి తల్లి
పులకించి ఎర్ర పూల వనమైంది....

అతడి నవ్వు గాయపడ్డ హృదయాలకు
వెన్నపూసై స్వాంతననిచ్చింది....

అతడు అందరి హృదయాలలో
పదిలమై పాటై గొంతులో జీరాడుతున్నాడు....

Sunday, July 10, 2011

ఆమె ఆదివారం



ప్రతిదినం సూరీడుతో పోటీ పడుతూ సాగే ఆమె
ప్రయాణం ఈ రోజు కాసింత నిద్ర కోరుకుంది....

నా టీ నేనే కాచుకున్నా
ఇందులో ఏదో తక్కువైంది...

పర్వాలేదు...
ఈ రోజు ఆమె విశ్రాంతి కోరుకుంది...

అలసిన దేహంతో పాటు
మనసుకూ కాసింత విరామాన్నిద్దాం...

Tuesday, July 5, 2011

కాసేపు నిశ్శబ్ధాన్ని పాటిద్దాం



కాసేపు నిశ్శబ్ధాన్ని పాటిద్దాం

అక్కడెవరో రంగుల్ని కలుపుతున్నారు
బొమ్మను పూర్తి చేయనివ్వండి...

కాసేపు నిశ్శబ్ధాన్ని పాటిద్దాం
ఆయనెవరో ఉలిని చేతుల్లోకి తీసుకుంటున్నారు
రాతిని బొమ్మగా మారనివ్వండి...

కాసేపు నిశ్శబ్ధాన్ని పాటిద్దాం
అనంత సాగరం ఆకాశంతో మొరపెడుతోంది
చెవి ఒగ్గి వినండి...

కాసేపు నిశ్శబ్ధాన్ని పాటిద్దాం
రాతిని కోసుకుంటు సెలయేరు ప్రవహిస్తోంది
గలగలలను వినండి....

కాసేపు నిశ్శబ్ధాన్ని పాటిద్దాం
అడవి అంతా వెన్నెల పరచుకుంటోంది
కాసింత దోసిలి పట్టండి....

కాసేపు నిశ్శబ్ధాన్ని పాటిద్దాం
అక్కడేదో విత్తనం మొలకెత్తుతోంది
చిగురును కాపాడండి...

కాసేపు నిశ్శబ్ధాన్ని పాటిద్దాం
ఎవరో విముక్తి గీతాన్ని ఆలపిస్తున్నారు
గుండె గది తాళం చెవి తీయండి....

Sunday, July 3, 2011

చెల్లి..

కొన్ని గురుతులు అలా
కోనేటి గట్టున కోవెల గూట్లో దాక్కున్న
పావురం కువకువలులా మది గూడులో
ఎప్పుడూ పిలుస్తూనే వుంటాయి....

వెనక్కి పరుగెత్తలేని నిస్సహాయత
ఓ నిట్టూర్పులా విసురుగా రాలేక
గుండె పొరలలో సుడి తిరుగుతూనే వుంటుంది...

తను నా తరువాత పుట్టిందన్న మాటే గానీ
మా నానమ్మ ప్రతి రూపమన్న అయ్య మాటతో
నేలను దింప బుద్ది కాక చంకలో పీతికాయలు మొలిచాయి...

తను మారాం చేస్తే ఏంజేయాలో తెలియని తనంతో
అమ్మతో తిన్న చీవాట్లు....
అంత ముద్దు చేయకురా అది ఎవరి మాటా వినకపోతే
తిడతారురా నన్ను అంటూ విసుక్కునే అమ్మ మాటే వినపడ లేదు...

వున్నంతలోనే తనని ఒక ఇంటి దానను చేసేయాలన్న
తొందరతో కట్టబెట్టి పంపినప్పుడు మా ఇంట్లోనే కాదు
నా కళ్ళలో కూడా దీపాలు ఆరిపోయాయి...

తానిప్పుడు ఆరిందలా పెద్దరికంతో మాటాడుతుంటే
మళ్ళీ మా నానమ్మ గుర్తొచ్చి
కళ్ళు వెలుగును నింపుకున్నాయి....

Friday, July 1, 2011

అంతర్లీనమయ్యే మహాకాయుడు..



నాన్నంటే నమ్మకమే కాదు
వెన్నంటే నేస్తం కూడా...

నిరంతర శ్రామికుడు..
తనకంటూ ఒక శిఖరాన్ని అధిరోహిస్తున్నట్లు
కనిపించే ఓ అమాయకపు ప్రాణి...
అది తాను చూపించే బాట మనకు...

నీ అసహనానికి, జుగుప్సకు బలి అయ్యే ఓ నిర్వేదపు సాక్షి...
ఎదగడం చేతకాని తీగకు తుది ఊపిరున్నంత వరకు
పందిరయ్యే పిచ్చి మాలోకం...

తన సరదాల ప్రపంచంలోంచి విడివడి
నీ అడుగుల సవ్వడిలో లీనమైన మహా స్రవంతి...
నీ నీడలో అంతర్లీనమైన మహా కాయుడు...
Related Posts Plugin for WordPress, Blogger...