Tuesday, February 22, 2011

మాటాడుకుందాం రా...

మాటాడుకుందాం

రా

మనసువిప్పి నగ్నంగా...


కనులలోయలో దాగిన

కలలన్నీ కుప్పబోసి

పూచిక పుల్లాటాడుదామా?

లేక

పాదం అంచున కట్టిన

సైకత ప్రేమమందిరంతో

తాజ్ ని ఓడిద్దామా?


రా నేస్తం..

గుండెపై చెవిపెట్టి

అగ్గిపెట్టెల ఫోన్ ల

దారం గుండా వినబడే

నా లబ్ డబ్ లయను

ఈ కొండ శిఖరాన

నిలబడి లోయంతా

వినపడేట్టు

నీవు ఎలుగెత్తి

గానం చేస్తే

నీతో శృతి కలుపుదామని

ఈ అంచున....


నీ నవ్వుల వెన్నెల

పరచుకున్న

ఈ అడవి పూల

పరిమళం

దిగంతాలు

వ్యాప్తిచెందనీ...


నవ్వు నీ ఒక్కడికే

సొంతమైందన్న

ఈర్ష్య నాలో

పోగొట్టేలా

సందమామ

వంగి నీ నుదుట

ముద్దులిడే

ఆ దృశ్యం

గుండె గూటిలో

పదిలం నేస్తం...


రా

మాటాడుకుందాం...

(ఈ కవిత ఆంగ్లానువాదాన్నిక్కడ చదవొచ్చు.అనువాదకులు శ్రీ జాన్ సత్యానందకుమార్)

Sunday, February 20, 2011

ముఖం కోల్పోయిన వాణ్ణి..

ముఖాన్ని కోల్పోయిన వాణ్ణి...

దాచిపెట్టుకుందామనుకున్నంతలోనే

పోగొట్టుకున్న వాణ్ణి!

వెతుకుతూ వెళుతున్న

దారిలో నాదంటూ

కానరాక

చిక్కుకున్న

దారాల పోగుల మధ్యలో

ఒక్కొక్క పోగు

కలుపుకుంటూ

వచ్చిన దారిని

మరిచిపోయిన వాణ్ణి!

ముఖాన్ని కోల్పోయిన వాణ్ణి!

Saturday, February 12, 2011

ఎడారిలో వసంత గానం



మొన్న ఎగసిపడిన

జాస్మిన్ సెగలు

అంటించిన నిప్పు

రవ్వలు...


ఆకలిగొన్న

పేగుల ఆర్తనాదాలే

పొలి కేకలై

నిద్ర లేచిన మమ్మీల

నో టి నుండి

ఎగసిపడిన ఇసుక

తుఫాన్లో

అవినీతి చక్రవర్తి

ముబారక్

సింహాసనాన్ని

పెళ్ళగించి

ప్రజల పాదాల

చెంతకు

అధికారం

దాసోహమన్న

క్షణం ...


ఇది మరో మారు

విముక్తి పోరాటాల

యుగమని

జన హోరుముందు

మర ఫిరంగులు

బలాదూరని...


ఉత్తుంగ తరంగాలుగ...

ఎగసిపడే

జన కెరటాల తాకిడికి

ఏ రక్షణ కవచాలు

అడ్డు నిలవవని ...


అట్టడుగు జనావళికి

మరోమారు

గుండెనిబ్బరాన్నిచ్చిన

ఎడారి హోరు...


ఎండమావులే కాదు

ఒయాసిస్సులూ

ఉన్నాయన్న

భరోసాకు

జేజేలు....


ఈ వసంతగానం

నేల నాలుగు చెరగులా

వినిపించాలని...


ఈ విజయం

శాశ్వతం కావాలని...

(ట్యునీసియా, ఈజిప్టు ప్రజల ప్రజాస్వామ్య కాంక్షకు మద్ధతుగా)

Thursday, February 10, 2011

ఆది యందు అంతమందు నేనే

శూన్యమా అది

కాదు అక్కడా

నోట్ల రెపరెపలే

ఒకటా రెండా

లెక్కపెట్టనీకి

నీవి మున్నూరు

జీవితాలు కావాలె...

ఆద్యంతములు

ఖాళీగా వదలని

అవినీతి భూతం

వికటాట్టహాసం

నాలుక లేని

నాయకునికి

చేతులూ లేవు...

డొక్కనిండనీకి

జనం

రెండొందల

పెన్సన్ డబ్బులకు

క్యూలో

విదిల్చనీకి

ఇంక

ఎంగిలి మెతుకులూ

లేకుండా

నాకి పారేస్తున్న

నాయకుల

అరచేతి కింద

నీడ కూడా

భయపడి

దాక్కుంది...

కావుకావు మననీకి

కాకులూ లేవు

కరవనీకి

కుక్క పళ్ళకంద

బొమిక ఇరుక్కుంది

చల్ చల్ రే భాయి

జర దేఖో బహెన్

ఏక్ కఫన్

ఊంచా రహే హమారా...

Saturday, February 5, 2011

వలస పక్షులు
























ప్రతి
దినం

ఒక జాతర ఇలా

మా రైల్వే స్టేసను కాడ


బుజాలకేవో రెక్కలు

మొలిసినట్టు
అంతా
ఇలా దూరంగా
సాగిపోతున్నారు...
ఊరు దాటి గడప దాటి
రాని
మా గంగమ్మ, ముత్తాలవ్వ

సీతారాముల్నాయుడు

ఇలా నెత్తిన సత్తు ముంతల

గోనెతో సాగిపోతుంటే...


ఊరు దెయ్యమేదో
తిరుగాడినట్టు
ఊరంతా తలుపులు మూసుకుపోయి

దప్పికకు సెంబుడు
నీళ్ళిచ్చే
సెల్లెమ్మ లేక
గొంతు తడారిపోతోంది...


ఎన్ని పథకాలు పెట్టి

ఈ కడుపు మంటను

ఏమార్చ గలరు...


ఇలా మూటా ముళ్ళె

సరుదుకొని
సాగిపోతున్న
వారు
జన్మతః సంచార జీవులు కాదాయే..

ఇంటి కొచ్చిన అతిథికి

కడుపునిండా తిండి పెట్టి

పంపిన వారే

నేడిలా తమ
పేగుల్ని
మెడకు
సుట్టుకొని
సాగిపోయే రోజులొచ్చి

పొలాలు బీడులవుతుంటే
..

ఇక్కడ ఎక్కడెక్కడినుండో

వచ్చి బొగ్గు కుంపట్లు రాజేస్తామని

మా సుట్టు సేరిన పెద్దలు

వంతపాడుతున్న
గోడమీద పిల్లులు

ఇలా అంతా

మా బతుకులో
బుగ్గి పోయ జూసినోళ్ళే

మరి వాళ్ళ నోట్లో బుగ్గి పోసేదెప్పుడో...


ఈ వలసలాగి

మా నేల తల్లి
మల్లా
పచ్చ సీర కట్టుకొని
నుదుట ఎఱ కుంకుంబొట్టు

పెట్టుకునేదెన్నడో...

Tuesday, February 1, 2011

వెలుగు పూలు




















మీరు నడిచినంత మేరా

వెలుగు పూలు


మీ నవ్వుల కాంతితో

ఈ జగమంతా

వెలుగు పూలు


మీ ఆత్మీయ

కరచాలనంతో

మనసంతా

వెలుగు పూలు


మీరు వదిలిన

జ్నాపకాలన్నీ

మాకు

వెలుగు పూలు
Related Posts Plugin for WordPress, Blogger...