ఇక్కడేదో వాన ముందర
మబ్బులు కమ్మి
మసక బారినట్లు వుంది
తుఫాను ముందర
సంద్రం ప్రశాంతంగా అగుపిస్తున్నట్లుంది
మౌనాన్ని అంగీకారంగా
ఓటమికి చిహ్నంగా మారుద్దామన్న
తాపత్రయంతో వాళ్ళు ముంచుకొస్తున్నారు
కానీ
వేసిన వెనకడుగు
మరిన్ని బారల దూరాన్ని
అధిగమించడానికేనన్న
ఎరుకతో వుండండి..
నిశ్శబ్ధం బద్దలై
వసంత మేఘం గర్జించి
వర్షించే సమయుం
ఆసన్నమైంది...
ఇన్నాళ్ళు పొగిలి పొగిలి
ఏడ్చిన కనులే
నేడు విస్ఫులింగాల్ని
కురిపించనున్నాయి...
మోసపోయి పోయి
దగాపడ్డ జనమంతా
దండై నేడు
కదులుతున్న క్షణాన
ఢిల్లీ పీఠం కదలబారుతున్నది
ఎగరనీ ఎగరనీ
స్వతంత్ర తెలంగాణా
ఝెండా
నయా వలస పాలకుల
గుండెలపై...