
నీ జ్ఞాపకం నన్ను
నిరంతరం వెన్నాడుతూనే వుంది
నీ కేరింతలతో ఇల్లంతా
పున్నమి వెలుగులు నింపిన
నీ బోసి నవ్వును
మరువలేకున్నా..
నీ అర్థనిమీలిత నేత్రాలతో
సుషుప్తావస్తలో వున్న
నిన్ను చూసి ఎంతలా
మురిసిపోయామో కదా!
నీ లేలేత దేహ కాంతి పుంజం
తాకి నా వొడలంతా పులకరించిన
క్షణాన్ని ఎలా మరిచిపోగలను..
కానీ..
ఆకశాన మెరిసిన విద్యుల్లతలా
భువిని తాకిన నీ పాదాలు
వెన్వెంటనే మాయమయ్యాయన్న
నిజం నేటికీ మింగుడుపడలేదీ
గుండెకి..
నింగిని మెరిసిన మెరుపును
చూసినప్పుడంతా నువ్వు మరలా
నాన్నా అంటూ గుండెలపై
వాలతావని ఆశగా..
ఆర్తిగా..
(ఈ రోజు మా మొదటి ప్రేమఫలం 'పాప' పుట్టిన రోజు. తను పుట్టినప్పుడు ఆరోగ్యంగా కనిపించి ఆ తరువాత blueish గా మారి ఎనిమిదో రోజున మమ్మల్ని విడిచిపోయింది. నిరుద్యోగం, ప్రేమ పెళ్ళి ఇబ్బందులతో తనను కాపాడుకోలేకపోయనన్న guiltiness ఇప్పటికీ వెంటాడుతూ వుంది..)