త్రిపురనేని శ్రీనివాస్ తెలుగు సాహిత్యంలో ఒక సంచలనం. తన కవితా దాహంతో జీవితమంతా ్జీవించినవాడు. ఎన్ని విమర్శలనెదుర్కొన్నా తన కవితాయాణాన్ని కొనసాగించి తెలుగులో ఒక సంచలనాన్నే సృష్టించినవాడు. అకాల మృత్యువాతకు గురై మనలందరిని ఒంటరివాళ్ళను చేసి పోయాడు. ఆయన కవితా పాదాలు కొన్ని స్మరించుకుందాం.
ఒకరి వెనుక నడవటం చేతకాదు
నీడ కింద ఆలోచన కదలాడదు
లోపల సరస్సులున్న మనిషి
బయట సముద్రాల్ని సృష్టిస్తాడు
ఆకాశానికి ఆలాపన నేర్పుతాడు
అతడు ఎవరి వెనుకా నడవడు.
౨.అస్తమయం తర్వాత నేను నిజంగా మనిషిని
శత్రు శిబిరం వెనుక మాటువేసిన శరీరాస్త్రాన్ని
ఆఖరి సూర్యకిరణం భూమిని చేరిన క్షణం
నిలువెత్తు శోకధాత్రిని రహస్యోద్యమమై వేటాడుతాను
౩. కవిత్వం కావాలి కవిత్వం
అక్షరం నిండా జలజలలాడిపోయే
కవిత్వం కావాలి కవిత్వం
అలా ఒక వాక్యం చదవగానే
శత్రువు ఠారెత్తిపోవాలి
అమాయకుడు ఆయుధమై హోరెత్తిపోవాలి
తుప్పల్ తెప్పల్ మాటల్ రాల్చి కవిత్వమని మొరాయించకు
కవిత్వాన్ని వంచించకు
వచనమై సోలిపోతావ్ ...
౪. అవును నిషేధించిన అక్షరం మీదే నాకెప్పుడూ మోజు
తపనతో కాలే మెదడుకి అవే స్వప్నాలు...
ఆంక్షలో విజృంభణ నాకు కొత్తకాదు!
౫. మౌనం నిస్త్రాణకాదు
నివురుగప్పిన వ్యూహం
మౌన పరీవృత శిల్పి చెక్కిన నిశ్శబ్ద సవ్వడి
సంస్పందనాంతరమ్లోకి నైరూప్య వాక్యాలాపన
మొఉన పరాజయారణ్యరోదన కాదు
మాటలు లేని ఎడారి మైదానంలో అగ్నివృక్షం
రూపరహిత ప్రస్థాన సారాంశం
మౌనం అవ్యక్త మరణం కాదు
భాషా ప్రమేయం లేని నిగూఢ భావ హర్మ్యావరణం
విశ్వాంతర్గోళ ఆదిమ వ్యాకరణం.
౫.అరచేతికి రక్తం అంటకుండా చేసిన హత్యే ఆత్మహత్య
ఆత్మహత్యలన్నీ హత్యలే.
౬. సముద్రం నుంచి
పల్చటి నీటిపొర కత్తిరించి
ఆకాశమ్లోకి విసిరేస్తే
ఒక మబ్బు
ఒక వాన
ఒక తొలకరి
బాధ నుంచి
బరువైన విశ్వాసాన్ని మొసుకొచ్చి
మనుషుల్లోకి విసిరేస్తే
ఒక కవిత్వం
ఒక తిరుగుబాటు
ఒక మార్పు.
౭. కొత్తగా ఊహింనిదే నేనెప్పుడూ జీవించలేదు
అద్దాలను బద్దలు చేయనిదే నేనెప్పుడు విశ్రమిచను
వెన్నెల కురిసినా చంద్రుడిని ప్రేమిచలేను
దగ్ధమైనా సూర్యుడినే కౌగలించుకుంటాను..
౮. ఎవరి రెక్కలతో వారు ఆకాశాన్ని లొంగదీసుకోవాలి
సాక్షాత్తు సూర్యుడి గుండెలపై తప్పతడుగులు వేయాలి
....
ఎవరి రక్తచలనంతో వారు ఖద్గచాలనం చేయాలి.
వర్మ, ఎందుకో మనసు ఒక్కసారే తృళ్ళిపడింది. నాకు గురుతుల్యులు వంటి బాబా గారు నా అభ్యర్థన మేరకు నా కవితనొకదాన్ని విశ్లేషించి ఇచ్చిన feedback లో త్రిపురనేని శ్రీనివాస్ గారు వ్రాసిన కొన్ని కవితా పంక్తులు ఉటంకించారు. ఆ ఆసక్తితో వీర్ని గురించి చదివాను. సంస్మరణ అవసరం లేని నిష్క్రమణలవి. అమరత్వం సిద్దించిన కవితాత్మలవి. "మనమీ సుందర ప్రపంచాన అందవిహీనులమా" at http://maruvam.blogspot.com/2009/04/blog-post_16.html లో చివరి వ్యాఖ్యలో ఆయన కవితవుంది.
ReplyDeleteత్రిపురనేని శ్రీనివాస్ కవిత్వమంటే నాకెంతో ఇష్టం. మాటను డైనమైట్ లా పేల్చిన కవి. చాలా గొప్పకవి. మీ కంపైలేషన్ చాలా బాగుంది.
ReplyDeleteబొల్లోజు బాబా
September 10, 2009 8:40 AM